Update (06 November 2024):
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) FY 2024-25లో ఇంగ్లాండులో నిల్వ చేసిన 102 మెట్రిక్ టన్నుల (MT) బంగారాన్ని దేశీయ వాల్ట్‌లకు తరలించిందని పలు వార్త కథనాలు ఇటీవల అక్టోబర్ 2024లో రిపోర్ట్ చేశాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలోనే “గత ప్రభుత్వాలు మన బంగారాన్ని విదేశాల్లోతాకట్టు పెట్టి అప్పులు తెచ్చాయి. దీపావళి సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆ అప్పులను వడ్డీతో సహా చెల్లించి 102 టన్నుల బంగారం తాకట్టు నుండి విడిపించి తిరిగి భారత్‌కు తీసుకొచ్చారు” అంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

RBI ఇటీవలే 2024-25 మొదటి అర్ధ వార్షిక రిపోర్ట్ (Half Yearly Report, April – September 2024)ను విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం, సెప్టెంబర్ 2024 చివరి నాటికి, RBI 854.73 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది, వీటిలో 510.46 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు దేశీయంగా ఉన్నాయి, కాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (BIS) వద్ద 324.01 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు విదేశాల్లో ఉన్నాయి. అలాగే, 20.26 మెట్రిక్ టన్నుల బంగారం డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. విలువ పరంగా (USD), మొత్తం విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా మార్చి 2024 చివరి నాటికి 8.15 శాతం నుండి 2024 సెప్టెంబర్ చివరి నాటికి 9.32 శాతానికి పెరిగాయి. అలాగే, ఏప్రిల్ 2024 నుండి సెప్టెంబర్ 2024 మధ్య RBI 32.63 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొత్తగా కొనగోలు చేసింది. ఈ రిపోర్టు ప్రకారం, 2024-25లో RBI విదేశాల్లో నిల్వ చేసిన బంగారాన్ని దేశీయ వాల్ట్‌లకు తరలించినట్లు తెలుస్తుంది. అయినా, సెప్టెంబరు 2024 నాటికి RBI ఇప్పటికీ విదేశాల్లో సుమారు 344.27 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలను కలిగి ఉంది.

అలాగే, RBI తన FY 2023-24లో రెండోవ అర్ధ వార్షిక రిపోర్ట్ (Half Yearly Report, October – March 2024) ప్రకారం, 31 మార్చి 2024 నాటికీ RBI వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది, ఇందులో 408.31 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు దేశీయంగా ఉండగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (BIS) వద్ద 387.26 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు విదేశాల్లో ఉన్నాయి. అలాగే, 26.53 మెట్రిక్ టన్నుల బంగారం డిపాజిట్ల రూపంలో ఉన్నాయి అని తెలుస్తుంది. అలాగే RBI తన 2023-24 వార్షిక రిపోర్టులో విదేశాల్లో 413.79 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని పేర్కొంది.
ఈ రిపోర్ట్స్ ప్రకారం, RBI 2023-24లో మరియు 2024-25 మొదటి ఆరు నెలల్లో కూడా విదేశాల్లో ఉన్న బంగారాన్ని దేశీయ వాల్ట్‌లకు తరిలించినట్లు తెలుస్తుంది. గత మార్చి 2024తో పోలిస్తే దేశీయంగా బంగారం నిల్వలు 102.15 మెట్రిక్ టన్నులు మేర పెరిగాయి. ఈ సంఖ్య ఆధారంగానే, భారత్ 102 మెట్రిక్ టన్నుల బంగారం విదేశాల నుండి తీసుకొచ్చింది అని పేర్కొంటున్నారు. అయితే దేశీయంగా పెరిగిన ఈ బంగారం నిల్వలన్నీ గతంలో విదేశాల్లో నిల్వ ఉంచిన బంగారమే అని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే RBI ఏప్రిల్ 2024 నుండి సెప్టెంబర్ 2024 మధ్య RBI 32.63 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొత్తగా కొనగోలు చేసింది, ఈ కొనగోలు చేసిన బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేసిందా లేదా దేశీయంగా నిల్వ చేసిందా అనే సమాచారం మనకు లేదు. అలాగే, ఈ బంగారం విదేశీ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం కాదు. బంగారంపై లావాదేవీలు సౌలభ్యం వంటి వివిధ కారణాల వల్ల RBI మన బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేస్తుంది. ఇలా నిల్వ చేసిన బంగారాన్ని RBI దశల వారీగా భారత్‌కు తీసుకువస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇవ్వబడింది.
Published (04 June 2024):
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2023-24 లో ఇంగ్లాండులో నిల్వ చేసిన 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దేశీయ వాల్ట్‌లకు తరలించిందని పలు వార్త కథనాలు రిపోర్ట్ చేశాయి(ఇక్కడ & ఇక్కడ). RBI తన 2023-24 వార్షిక రిపోర్టులో విదేశాల్లో నిల్వ చేసిన 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దేశీయ వాల్ట్‌లకు తరలించినట్లు పేర్కొన్నది. ఈ నేపథ్యంలోనే, 1991లో భారతదేశం దివాలా తీసే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఉన్న సుమారు ఒక లక్ష కిలోల బంగారాన్ని విదేశీ బ్యాంకుల్లో కుదువ పెట్టింది, అలా విదేశీ బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న సుమారు ఒక లక్ష కిలోల బంగారాన్ని ఇప్పుడు మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మన దేశానికి తెచ్చింది అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 1991లో అప్పటి భారత ప్రభుత్వం విదేశీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన సుమారు లక్ష కేజీల బంగారాన్ని ఇటీవలే మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మన దేశానికి తీసుకొచ్చింది.
ఫాక్ట్(నిజం): 1990-91 మధ్యకాలంలో విదేశీ మారకద్రవ్య సంక్షోభం సమయంలో, భారతదేశం తన బంగారం నిల్వలలో కొంత భాగాన్ని అనగా 46.91 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు బ్యాంక్ అఫ్ జపాన్ నుండి $405 మిలియన్ల రుణాన్ని పొందింది. అలాగే, 1991 సెప్టెంబర్-నవంబర్ మధ్య కాలంలోనే ఆ రుణాన్ని తిరిగి చెల్లించింది. రుణాన్ని చెల్లించినప్పటికీ, RBI ఆ బంగారాన్ని ఇంగ్లాండులో ఉంచింది. RBI చాలా సంవత్సరాల నుండి బంగారాన్ని కొనగోలు చేసి విదేశాల్లో కూడా నిల్వ చేస్తుంది, అనగా 2014 కన్నా ముందు, 2014 తరువాత కూడా బంగారాన్ని కొనగోలు చేసి విదేశాల్లో కూడా నిల్వ చేస్తుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) FY24 వార్షిక నివేదిక ప్రకారం, 31 మార్చి 2024 నాటికీ RBI వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. ఇందులో 308 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దేశంలో జారీ చేసిన నోట్లకు బ్యాకింగ్‌గా భారతదేశంలో ఉంచారు(బంగారం నిల్వల ఆధారంగా నోట్ల ముద్రణ చేస్తారు). 2023-24లో RBI విదేశాల్లో నిల్వ చేసిన 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దేశీయ వాల్ట్‌లకు తరలించినప్పటికీ, 01 ఏప్రిల్ 2024 నాటికి విదేశాల్లో ఇంకా 413.79 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలను కలిగి ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
చాలా దేశాలు తమ బంగారాన్ని ఇంగ్లాండులోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో నిల్వ చేస్తు ఉంటాయి. భారతదేశం కూడా స్వాతంత్ర్యం రాకముందు నుండి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో బంగారాన్ని నిల్వ చేస్తోంది. RBI బంగారాన్ని కొనుగోలు చేయడం మరియు నిల్వ చేయడం అనేది ఆర్థిక వ్యవస్థలో సాధారణ ప్రక్రియ. ఇలా బంగారం కొనగోలు చేసి నిల్వ చేయడం ద్వారా విదేశీ మారక నిల్వలను విస్తరించడానికి మరియు ద్రవ్యోల్బణం మరియు కరెన్సీ అస్థిరతను అరికట్టడానికి దోహద పడుతుంది. ఇలా కొన్న బంగారాన్ని ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై RBI ఎప్పటికప్పుడు సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. విదేశాలలో నిల్వ చేసిన బంగారాన్ని సులభంగా ట్రేడింగ్ చేయడానికి, ఉపయోగించవచ్చు. RBI అంతర్జాతీయ మార్కెట్ల నుండి బంగారాన్ని కొనుగోలు చేసి, విదేశాలలో నిల్వ చేయడం ద్వారా బంగారంపై లావాదేవీల చేయడం సులభతరం అవుతాయి.
అయితే, అంతర్జాతీయంగా బంగారాన్ని నిల్వ చేయడం ప్రమాదాలతో కూడుకున్నది, ప్రత్యేకించి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో. ఇటీవల పాశ్చాత్య దేశాలు రష్యా ఆస్తులను స్తంభింపజేయడంతో విదేశాలలో ఉన్న ఆస్తుల భద్రత గురించి ఆందోళనలను పెంచుతున్నాయి. UK నుండి RBI బంగారాన్ని స్వదేశానికి తరలించడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. అలాగే ఆర్థిక అనిశ్చితి మధ్య సెంట్రల్ బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా తమ బంగారం నిల్వలను పెంచుకుంటున్నందున, భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం గురించి ప్రపంచ దేశాలకు చెప్పడానికి ఇది ఒక సంకేతంగా ఉంటుంది.
30 మే 2024న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 2023-24 సంబంధించి తమ వార్షిక రిపోర్టు విడుదల చేసింది. ఈ నివేదికలో RBI తమ వద్ద ఉన్న బంగారం నిల్వల గురించి కూడా ప్రస్తావించింది. ఈ వార్షిక నివేదిక ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం(2023-24)లో RBI కొత్తగా మరో 27.47 టన్నుల బంగారాన్ని తన ఖజానాలో చేర్చింది. 31 మార్చి 2024 నాటికీ RBI వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. ఇందులో 308 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దేశంలో జారీ చేసిన నోట్లకు బ్యాకింగ్‌గా భారతదేశంలో ఉంచారు. వాస్తవంగా, ఈ నివేదికలో 514.07 మెట్రిక్ టన్నుల బంగారాన్ని స్థానికంగా బ్యాంకింగ్ విభాగానికి చెందిన ఆస్తిగా మరియు విదేశాల్లో ఉన్న బంగారం నిల్వలగా పేర్కొన్నారు. ఇందులో నుంచి 100.28 మెట్రిక్ టన్నుల బంగారాన్ని భారతదేశంలో నిల్వ చేసినట్లు తెలిపింది. అనగా ఈ 100.28 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఈ ఆర్ధిక సంవత్సరంలోనే భారతదేశానికి తరిలించినట్లు తెలుస్తుంది. అంటే ఇంకా 413.79 టన్నుల బంగారాన్ని RBI విదేశాల్లో నిల్వ చేసింది. ఈ వార్షిక నివేదిక ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం ఆర్‌బీఐ కొత్తగా కనగోలు చేసిన 27.47 మెట్రిక్ టన్నుల బంగారంలో నుంచి 20.53 మెట్రిక్ టన్నుల బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేసినట్లు అర్ధమవుతుంది.

అలాగే RBI 2022-23 వార్షిక రిపోర్టును పరిశీలిస్తే, 31 మార్చి 2023 నాటికి RBI వద్ద 794.63 టన్నుల బంగారం ఉంది. ఇందులో నుండి 301.09 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దేశంలో జారీ చేసిన నోట్లకు బ్యాకింగ్‌గా భారతదేశంలో ఉంచారని, 493.54 మెట్రిక్ టన్నుల బంగారాన్ని స్థానికంగా బ్యాంకింగ్ విభాగానికి చెందిన ఆస్తిగా మరియు విదేశాల్లో ఉన్న బంగారం నిల్వలగా పేర్కొన్నారు అని తెలుస్తుంది. ఆర్‌బీఐ 2022-23 కొత్తగా కనగోలు చేసిన 34.21 టన్నులలో బంగారంలో నుంచి 28.94 టన్నుల బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేసినట్లు అర్ధమవుతుంది. అలాగే కొత్తగా 5.27 టన్నుల బంగారాన్ని నోట్ల ముద్రణకై బ్యాకింగ్‌గా భారతదేశంలోనే ఉంచారని తెలుస్తుంది.

అలాగే RBI 2013-14 వార్షిక రిపోర్ట్ ను పరిశీలించగా, 30 జూన్ 2014 నాటికీ RBI వద్ద 557.75 టన్నుల బంగారం ఉంది. ఇందులో నుండి 292.26 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దేశంలో జారీ చేసిన నోట్లకు బ్యాకింగ్‌గా భారతదేశంలో ఉంచారని, 265.49 మెట్రిక్ టన్నుల బంగారాన్ని స్థానికంగా బ్యాంకింగ్ విభాగానికి చెందిన ఆస్తిగా మరియు విదేశాల్లో ఉన్న బంగారం నిల్వలగా పేర్కొన్నారు అని తెలుస్తుంది. ఆర్‌బీఐ 2013-14లో కొత్తగా ఎలాంటి బంగారం నిల్వలు పెంచుకోలేదు తెలుస్తుంది.

RBI వార్షిక నివేదికల ప్రకారం FY2011- FY2018 మధ్య కాలంలో కొత్తగా ఎలాంటి బంగారం నిల్వలు పెంచుకోలేదు అని తెలుస్తుంది. FY2018లో కొత్తగా 8.46 టన్నుల బంగారాన్ని కనగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో నుండి 8.44 టన్నుల బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేసినట్లు, అలాగే కొత్తగా 0.2 టన్నుల బంగారాన్ని నోట్ల ముద్రణకై బ్యాకింగ్‌గా భారతదేశంలోనే ఉంచారని తెలుస్తుంది. దీన్ని బట్టి RBI చాలాసంవత్సరాల నుండి బంగారాన్ని కొనుగోలు చేసి విదేశాల్లో నిల్వ చేస్తునట్లు మనం నిర్థారించవచ్చు.
RBI 2009-10 వార్షిక రిపోర్టును పరిశీలిస్తే 2009లో, భారతదేశం అప్పటి UPA ప్రభుత్వ హయాంలో, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో, భారీ మొత్తంలో సుమారు $ 6.7 బిలియన్ల విలువైన 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది అని తెలిసింది. గత కొన్నేళ్లుగా, రిజర్వ్ బ్యాంక్ బంగారం కొనుగోళ్ల ద్వారా బంగారం నిల్వల్లో స్థిరమైన వృద్ధి చోటు చేసుకుందని, ఆర్‌బిఐ డిసెంబర్ 2017 నుండి మార్కెట్ నుండి క్రమం తప్పకుండా బంగారాన్ని పోగుచేయడం ప్రారంభించిందని RBI వార్షిక రిపోర్టులు పరిశీలించంగా తెలసింది.

1991లో అప్పటి భారత ప్రభుత్వం విదేశీ బ్యాంకుల్లో సుమారులక్ష కేజీల బంగారాన్ని తాకట్టు పెట్టిందా?
27 జూలై 2021న రాజ్యసభలో జరిగిన చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నకి ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర సహాయ మంత్రయిన పంకజ్ చౌదరి ఇచ్చిన సమాధనం, RBI FY1992 వార్షిక నివేదికల ప్రకారం, 1990-91 విదేశీ మారకద్రవ్య సంక్షోభం సమయంలో, భారతదేశం తన బంగారం నిల్వలలో కొంత భాగాన్ని అనగా 46.91 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు బ్యాంక్ అఫ్ జపాన్ నుండి $405 మిలియన్ల రుణాన్ని పొందింది. అలాగే, 1991 సెప్టెంబర్-నవంబర్ మధ్య కాలంలోనే రుణం తిరిగి చెల్లించింది. రుణం చెల్లించినప్పటికీ, RBI ఆ బంగారాన్ని ఇంగ్లాండులోనే ఉంచింది. అంతే కాకుండా 1991 నవంబర్/డిసెంబర్ మధ్య కాలంలో RBI కొత్తగా 18.36 టన్నుల బంగారాన్ని కొనగోలు చేసింది. ఈ బంగారాన్ని కూడా UKలో ఉంచింది.

దీన్ని బట్టి ఇప్పుడు తరిలించిన బంగారం 1991లో తాకట్టు పెట్టిన బంగారం కాదని, 1991లో ఆ బంగారానికి సంబంధించిన తనఖా సొమ్మును అప్పటి ప్రభుత్వమే కట్టినట్లు తెలుస్తుంది. సంవత్సరాలుగా RBI కొనగోలు చేసి విదేశాల్లో నిల్వ చేసిన బంగారంలో కొంత మొతాన్ని(100 మెట్రిక్ టన్నుల) 2023-24లో దేశీయ వాల్ట్‌లకు తరలించిందని మనం నిర్థారించవచ్చు.
ఇదే విషయమై మేము RBIని సంప్రదించాము, వారి నుండి సమాధానం రాగానే ఈ ఆర్టికల్ అప్‌డేట్ చేయబడను.
చివరగా, 2023-24లో RBI విదేశాల్లో నిల్వ చేసిన 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దేశీయ వాల్ట్‌లకు తరలించినప్పటికీ, 01 ఏప్రిల్ 2024 నాటికి విదేశాల్లో ఇంకా 413.79 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు కలిగి ఉంది.