Fake News, Telugu
 

మహారాష్ట్రలోని IDBI బ్యాంక్ మేనేజర్ పై దాడి చేసింది శివ సేన పార్టీ సభ్యులు కాదు

0

మహారాష్ట్రలో పోలీసుల సమక్షంలోనే శివ సేన గుండాలు IDBI బ్యాంక్ మేనేజర్ పై దాడి చేస్తున్నారు, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మహారాష్ట్రలో శివ సేన గుండాలు IDBI బ్యాంక్ మేనేజర్ పై దాడి చేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం):  వీడియోలో IDBI బ్యాంకు మేనేజర్ పై దాడి చేస్తున్నది మహారాష్ట్ర లోని బుల్దాన జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, శివ సేన పార్టీ కార్యకర్తలు కాదు. రైతులకి రుణాలు మంజూరు చేయడంలో ఆలస్యం చేస్తున్నారనే నెపంతో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మల్కాపూర్ నగరంలోని IDBI బ్యాంకు మేనేజర్ పై ‘24 August 2020’ నాడు దాడి చేసారని విశ్లేషణలో తెలిసింది. ఈ ఘర్షణకి శివ సేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోని ‘The Times of India’ న్యూస్ వెబ్ సైట్ ‘13 సెప్టెంబర్ 2020’ నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోని ‘Times Now’ న్యూస్ ఛానల్ వారు కూడా తమ ట్వీట్ లో షేర్ చేసారు. ఈ వీడియోలో మహారాష్ట్ర లోని ఒక  IDBI బ్యాంకు మేనేజర్ పై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసారని తెలిపారు. ఈ వివరాల ఆధారంగా ఆ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం వెతకగా, ఇదే వీడియోని ‘News 18 Lokmat’ న్యూస్ ఛానల్ ’10 సెప్టెంబర్ 2020’ నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ ఘటన మహారాష్ట్ర లోని మల్కాపూర్ అనే నగరంలో చోటుచేసుకున్నట్టు ఆ వీడియో వివరణలో తెలిపారు. ‘7 Star News’ అనే మరాఠి లోకల్ న్యూస్ ఛానెల్లో కూడా IDBI బ్యాంకు మేనేజర్ పై దాడి చేసింది మహారాష్ట్ర బుల్ధాన జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలని తెలుపుతూ ఈ వీడియోని పోస్ట్ చేసారు.

ఈ ఘటనకి సంబంధించిన వివరాల కోసం మల్కాపూర్ IDBI బ్యాంక్ మేనేజర్ అనిల్ సావ్లె ని FACTLY సంప్రదించింది. ఈ బ్యాంక్ కి ఇటివలే మేనేజర్ గా తను నియమితుడైనట్టు అనిల్ సావ్లె తెలిపారు. బ్యాంకులోని పాత మేనేజర్ పై జరిగిన దాడిలో ఏ పార్టీ హస్తముందో తెలుపనప్పటికి, రైతుల రుణాలు మంజూరు చేయడంలో ఆలస్యం చేస్తున్నారనే నెపంతోనే మేనేజర్ పై కొందరు దాడికి పాల్పడినట్టు తెలిపారు.

మల్కాపూర్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ స్మితా మసాయే ని FACTLY సంప్రదించగా, మల్కాపూర్ నగరంలోని IDBI బ్యాంక్ మేనేజర్ పై దాడి చేసింది బుల్ధాన జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలని తెలిపారు. రైతులకి రుణాలు మంజూరు చేయడంలో ఆలస్యం చేస్తున్నారనే నెపంతో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మల్కాపూర్ నగరంలోని IDBI బ్యాంకు మేనేజర్ పై ‘24 August 2020’ నాడు దాడి చేసారు, అని ASI స్మితా మసాయే తెలిపారు. ఈ ఘటనకి శివ సేన పార్టికి ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసారు.

చివరగా, మహారాష్ట్రలోని IDBI బ్యాంక్ మేనేజర్ పై దాడి చేసింది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, శివ సేన పార్టీ సభ్యులు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll