Fake News, Telugu
 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన, సవరించిన పాఠ్యపుస్తకాలలో ఈ హిందూ రాజుల చరిత్ర గురించి వివరించలేదంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదు

0

కాంగ్రెస్ హయాంలో వచ్చిన, సవరించిన సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకాలలో కేవలం మొఘలుల చరిత్రను గొప్పగా చూపించి, హిందూ రాజుల చరిత్రను పూర్తిగా విస్మరించారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో మౌర్య, చాళుక్య, చోళ, పాండ్య, శాతవాహన మరియు ఇతర హిందూ రాజుల చరిత్రను ఎక్కడా తెలుపలేదని ఈ పోస్టులో తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.        

క్లెయిమ్: కాంగ్రెస్ హయాంలో వచ్చిన, సవరించిన పాఠ్యపుస్తకాలో కేవలం మొఘలుల చరిత్రను గొప్పగా చూపించి, హిందూ రాజుల చరిత్రను పూర్తిగా విస్మరించారు.

ఫాక్ట్ (నిజం): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1961లో NCERT ఏర్పాటైన తరువాత వచ్చిన సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకాలలో మౌర్యుల చరిత్ర, చోళుల చరిత్ర, గుప్తా, పల్లవ, శాతవాహనుల మరియు ఇతర సామ్రాజ్యల చరిత్రల గురించి వివరంగా తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలలో వాడుకలో ఉన్న పాఠ్యపుస్తకాలలో కూడా హిందూ రాజుల చరిత్ర గురించి అధ్యాయాలు ఉన్నాయి. కావున, పోస్టులో షేర్ చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1961లో NCERT ఏర్పాటైన తరువాత పలు సార్లు పాఠ్యపుస్తకాలను మార్పులు, సవరణలు చేసినట్టు తెలిసింది.  1966లో వచ్చిన 6వ తరగతి మరియు 7వ తరగతి సామాజిక శాస్త్రం పాఠ్యపుస్తకాలలో మౌర్యుల చరిత్ర, చోళుల చరిత్ర, గుప్తా, పల్లవ, శాతవాహనుల మరియు ఇతర సామ్రాజ్యల చరిత్రల గురించి వివరించినట్టు తెలిసింది.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పాలిస్తున్న కర్ణాటక మరియు రాజస్థాన్ రాష్ట్రాలలో వాడుకలో ఉన్న పాఠ్యపుస్తకాలలో మౌర్యుల చరిత్ర, చోళుల చరిత్ర శాతవాహనుల మరియు ఇతర సామ్రాజ్యల చరిత్రల గురించి ప్రస్తావించారు. కర్ణాటకలో 2015-16 వార్షిక సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం సవరించిన సామాజిక శాస్త్రం పాఠ్యపుస్తకాలలో రాజ్‌పుత్‌, చాళుక్య, రాష్ట్రకూట, చోళుల చరిత్ర గురించి వివరంగా తెలిపారు. పై వివరాల ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందూ రాజుల చరిత్ర గురించి పాఠ్యపుస్తకాలలో తెలుపలేదంటూ చేస్తున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.  

చివరగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన, సవరించిన పాఠ్యపుస్తకాలలో హిందూ రాజుల చరిత్ర గురించి వివరించలేదంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll