హిందూ సనాతన ధర్మం అందరికి తెలిసే విధంగా ఏడాదిలో 15 పుణ్యక్షేత్రాలు దర్శించినవారికి అయిన ఖర్చంతా తిరిగి ఇచ్చే విధంగా మోదీ ప్రభుత్వం పర్యటన పర్వ్ అనే పథకం తీసుకువచ్చింది అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హిందూ సనాతన ధర్మం అందరికి తెలిసేవిధంగా ఏడాదిలో 15 పుణ్యక్షేత్రాలు దర్శించినవారికి అయిన ఖర్చంతా తిరిగి ఇచ్చే విధంగా పర్యటన పర్వ్ అనే పథకం మోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఫాక్ట్(నిజం): 15 పర్యాటక ప్రదేశాలు సందర్శించిన వారికి వారి పర్యటనకి అయిన ఖర్చు ఇన్సెంటివ్ రూపం లో వారికి తిరిగి ఇచ్చేయబడుతుందని టూరిజం మంత్రి అయిన ప్రహ్లద్ సింగ్ పటేల్ ఒక జనవరి 2020లో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నప్పటికీ, ఖర్చులు ఇన్సెంటివ్ రూపంలో తిరిగి ఇచ్చే పథకమేది అమలులో లేదని మార్చి 2020లో పార్లమెంట్ లో ఒక ప్రశ్నకి జవాబిస్తూ మంత్రి అన్నాడు, పైగా ఈ పథకం కేవలం హిందువులకి మాత్రమేనని ఎక్కడ కూడా లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో చెప్పిన వార్తా గురించి గూగుల్ సెర్చ్ చేయగా ఈ వార్తకి సంబంధించిన వార్తా కథనం మాకు కనిపించింది. ఈ వార్త కథనం ప్రకారం 25 జనవరి 2020న ఒడిశాలో జరిగిన నేషనల్ టూరిజం కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమంలో కేంద్ర టూరిజం మంత్రి అయిన ప్రహ్లద్ సింగ్ పటేల్ మాట్లాడుతూ పర్యటన పర్వ్ ఇనిషియేటివ్ కింద 2022 లోపు ఒక ఏడాదిలో 15 పర్యాటక ప్రదేశాలు సందర్శించిన వారికి వారి పర్యటనకి అయిన ఖర్చు ఇన్సెంటివ్ రూపం లో తిరిగి ఇచ్చేయబడుతుందని చెప్పారు. ఐతే ఈ స్కీం కేవలం హిందువులకు మాత్రమేనని మంత్రి అనలేదు, ఇంకా ఈ స్కీం కేవలం హిందువులకే అని ప్రభుత్వ గైడ్లైన్స్ లో కానీ, వార్తా కథనాల్లో గాని ఎక్కడా లేదు. ఇంకా ఈ కార్యక్రమం కింద కేవలం పుణ్యక్షేత్రాలు సందర్శించాలని కూడా ఎక్కడ లేదు.
ఐతే 17 మార్చ్ 2020న రాజ్యసభలో ఒక పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకి టూరిజం శాఖ మంత్రి ప్రహ్లద్ సింగ్ పటేల్ బదులిస్తూ మినిస్ట్రీ అఫ్ టూరిజం కింద పర్యాటక ప్రదేశాలు సందర్శించిన వారికి అయిన ఖర్చులు తిరిగి ఇచ్చే పథకమేదీ అమలులో లేదని చెప్పాడు. కాకపోతే టూరిజం మంత్రిత్వ శాఖ భారత దేశంలో డొమెస్టిక్ టూరిజం ప్రోత్సహించడం కొరకు ‘దేఖో అప్నా దేశ్’ అనే ఇనిషియేటివ్ మొదలుపెట్టిందని చెప్పారు, ఈ ఇనిషియేటివ్ ద్వారా ప్రజలని 2022 లోపు భారత దేశంలోని 15 పర్యాటక ప్రదేశాలు సందర్శించేలాగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. దీన్నిబట్టి పర్యాటక ప్రదేశాలు సందర్శించిన వారికి అయ్యే ఖర్చు ప్రభుత్వం తిరిగి ఇచ్చే పథకం ఇంకా అమలు కాలేదని కచ్చితంగా చెప్పొచ్చు.
భారత దేశం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే భాగంలో నిర్వహిస్తున్న ‘దేఖో అప్నా దేశ్’, ‘టూరిజం ఫర్ అల్’ వంటి కార్యక్రమాలని ప్రోత్సహించడానికి ‘పర్యటన పర్వ్’,’భారత్ పర్వ్ ‘ వంటి ఇనిషియేటివ్ లు తీసుకున్నామని టూరిజం మంత్రిత్వ శాఖ తమ వార్షిక నివేదికలో పేర్కొన్నారు.
చివరగా, పర్యటన పర్వ్ అనే ఇనిషియేటివ్ కింద 15 పర్యాటక ప్రదేశాలు సందర్శించిన వారికీ ఖర్చులు ప్రభుత్వం తిరిగి ఇన్సెంటివ్ రూపంలో ఇచ్చే కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు, పైగా ఇదే కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుందన్న వాదనలో వాస్తవం లేదు.