కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన PM వైభవ్ లక్ష్మి యోజన అనే పథకం ద్వారా ప్రతీ మహిళా రూ.4, 00,000 వరకు వడ్డీలేని రుణం పొందవచ్చు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం PM వైభవ్ లక్ష్మి యోజన అనే పథకం ద్వారా ప్రతీ మహిళకు రూ. 4,00,000 వరకు వడ్డీలేని రుణాలు అందిస్తుంది.
ఫాక్ట్ (నిజం): కేంద్ర ప్రభుత్వం PM వైభవ్ లక్ష్మి యోజన అనే పథకం ఏమి మొదలు పెట్టలేదు. ఈ పథకానికి సంబంధించిన సమాచారం మాకు ఎక్కడా లభించలేదు. ఇలాంటిదే PM ధనలక్ష్మి యోజన అనే వార్త వైరల్ అయినప్పుడు ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB)’ వారు అది ఫేక్ అని నిర్ధారించారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
పోస్ట్ లో చెప్పిన పథకం గురించి మేము మహిళల మరియు శిశు సంక్షేమానికి నోడల్ మినిస్ట్రీ అయిన ‘మినిస్ట్రీ అఫ్ విమెన్ & చైల్డ్ డెవలప్మెంట్’ వారి వెబ్సైటు లో వెతకగా ఈ పథకానికి సంబంధించిన సమాచారం ఏది కూడా మాకు దొరకలేదు. ఈ వెబ్సైటు లో మహిళలకు సంబంధించిన పథకాల లిస్టు లో ఈ పథకం పేరు కూడా లేదు.
పోస్ట్ లో ఉన్న వీడియోలో ఈ పథకం ద్వారా లబ్ది పొందడానికి ఏదైనా SBI బ్రాంచ్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారు. ఐతే మేము SBI వెబ్సైటు లో వెతకగా ఈ పథకానికి సంబంధించిన సమాచారం ఏదీ మాకు దొరకలేదు. ఈ పథకానికి సంబంధించి ఎటువంటి వార్తలు , ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ కథనాలు కూడా మాకు లభించలేదు.
PM ధనలక్ష్మి యోజన పేరుతో వైరల్ అయిన ఇలాంటి ఒక వార్తను ఖండిస్తూ ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB)’ వారు 12 జూన్ 2020న ఒక ట్వీట్ చేసారు. వారి ట్వీట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి పథకం ప్రారంభించే ఉద్దేశం లేదని స్పష్టం చేసారు. అలాగే వారు ఈ వార్తని ఫేక్ అని తేల్చి చెప్పారు.
‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్’ వెబ్సైటు లో కూడా పైన పేర్కొన్న పథకం గురించిన సమాచారం ఏమి లేదు. ఇంకా ఏ ప్రభుత్వ పోర్టల్ లో కూడా ఈ పథకానికి సంబంధించిన సమాచారం మాకు దొరకలేదు.
చివరగా, కేంద్ర ప్రభుత్వం PM వైభవ్ లక్ష్మి యోజన అనే పథకాన్ని మొదలుపెట్టలేదు.