పోస్ట్ లో ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ లో తమ వివరాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం నుండి ఉచితంగా లాప్ టాప్ పొందవచ్చని ఒక మెసేజ్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. కోవిడ్-19 కారణంగా పాఠశాలలు, కాలేజీలు మూసి ఉండడంతో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా లాప్ టాప్ ఇస్తున్నట్టు పోస్ట్ లో ఉంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్ (దావా): పోస్ట్ లో ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ లో తమ వివరాలు నింపడం ద్వారా ప్రభుత్వం నుండి ఉచితంగా లాప్ టాప్ పొందవొచ్చు.
ఫాక్ట్ (నిజం): అది ఒక ఫేక్ లింక్. ఆ లింక్ ని ఓపెన్ చేస్తే ఒక బ్లాగ్ కి వెళ్తుంది. దాంట్లో వ్యక్తిగత వివరాలు ఇచ్చిన తరువాత, రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి ఆ వెబ్ సైట్ లింక్ ను పది మందికి షేర్ చేయమని అడుగుతారు. ఇంతకముందు ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్లు , స్కాలర్షిప్లు ఇస్తుందని కొన్ని బ్లాగ్ల లింకులు షేర్ అయినప్పుడు, అవి ఫేక్ అని ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ (పీఐబీ) వారు పలుసార్లు తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లో ఇచ్చిన లింక్ ని ప్రెస్ చేస్తే ఒక బ్లాగ్ (“https://registration-for-your-laptop.blogspot.com/”) ఓపెన్ అవుతుంది. ఒక వేల నిజంగానే ప్రభుత్వం ఉచితంగా లాప్టాప్లు ఇస్తే, వాటి రిజిస్ట్రేషన్లు అధికారిక పోర్టల్ లో జరుగుతాయి; ఇలా ఒక బ్లాగ్ ద్వారా జరగవు. అంతేకాదు, ఆ బ్లాగ్ లో వ్యక్తిగత వివరాలు నింపిన తరువాత, రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి ఆ వెబ్ సైట్ లింక్ ను పది మందికి షేర్ చేయమని అడుగుతారు. ప్రభుత్వం ఎటువంటి పథకంలో కూడా రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి ఇలా ఒక వెబ్ సైట్ లింక్ ను వేరే వారికి షేర్ చేయమని అడగదు. కావున, అది ఒక ఫేక్ వెబ్ సైట్.
ఇలాంటి వెబ్ సైట్ లింక్ ఒకటి మార్చి నెలలో వైరల్ అయినప్పుడు, అది ఫేక్ అని చెప్తూ ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ (పీఐబీ) వారు పెట్టిన ట్వీట్ ని ఇక్కడ చూడవొచ్చు.
అంతేకాదు, ఎనిమిదవ తరగతి నుండి పీయూసీ 1 చదువుతున్న విద్యార్థులకు 3,500 రూపాయలకే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లాప్టాప్ ఇస్తున్నట్టు తాజాగా ఒక ప్రకటన వైరల్ అవ్వగా, అది కూడా ఫేక్ మెసేజ్ అని ‘పీఐబీ’ వారు తెలిపారు.
ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్ ఫోన్లు, స్కాలర్షిప్లు ఇస్తుందని చెప్తూ మరికొన్ని బ్లాగ్లు కూడా విద్యార్థుల వ్యక్తిగత వివరాలు తీసుకుంటున్నాయి. అవి కూడా ఫేక్ బ్లాగ్లు అని, వాటికి దూరంగా ఉండమని చెప్తూ ‘పీఐబీ’ వారు పోస్ట్ చేసిన ట్వీట్లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, ఉచితంగా స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్లు, స్కాలర్షిప్లు అందిస్తున్నట్టు చెప్తున్న ఫేక్ వెబ్ సైట్లకు దూరంగా ఉండండి. ప్రభుత్వం నిజంగా అలా ఫ్రీగా ఏమైనా ఇస్తే, వాటి రిజిస్ట్రేషన్లు అధికారిక వెబ్ సైట్ల ద్వారా జరుగుతాయి.