మహాత్మా గాంధీ యూనిఫాంలో ఉన్న ఒక గ్రూప్ ఫోటోని షేర్ చేస్తూ, గాంధీ బ్రిటిష్ ఆర్మీలో పని చేసాడని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: గాంధీ బ్రిటిష్ ఆర్మీలో పని చేసాడు; గాంధీ బ్రిటిష్ ఆర్మీ యూనిఫాంలో ఉన్న ఫోటో.
ఫాక్ట్ (నిజం): సౌత్ ఆఫ్రికాలో రెండోవ బోయర్ యుద్ధ (1899 – 1902) సమయంలో గాయపడ్డ బ్రిటిష్ సైనికులను స్ట్రెచర్లపై మోయడానికి ఇండియన్ అంబులెన్స్ కార్ప్స్ అనే ఒక సంస్థని గాంధీ స్థాపించారు. ఈ ఫోటో ఆ యుద్ద సమయంలో ఇండియన్ అంబులెన్స్ కార్ప్స్ సభ్యులతో కలిసి దిగింది. గాంధీ ఎప్పుడు బ్రిటిష్ ఆర్మీలో పనిచేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
19వ శతాబ్దం చివరిలో సౌత్ ఆఫ్రికాలోని బోయర్ అనబడే కొన్ని స్వతంత్ర రాజ్యాలకు మరియు బ్రిటిష్ సామ్రాజ్యానికి మధ్య ఆధిపత్యం కోసం యుద్దాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే 1899 – 1902 మధ్యలో రెండోవ బోయర్ యుద్ధం జరిగింది. ఐతే ఈ యుద్ద సమయంలో గాయపడ్డ బ్రిటిష్ సైనికులను స్ట్రెచర్లపై మోయడానికి ఇండియన్ అంబులెన్స్ కార్ప్స్ అనే ఒక సంస్థని గాంధీ స్థాపించారు. పోస్టులోని ఫోటో రెండోవ బోయర్ యుద్ధ సమయంలో గాంధీ ఇండియన్ అంబులెన్స్ కార్ప్స్ సభ్యులతో కలిసి దిగింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఇదే ఫోటోని అలామి వెబ్సైటులో దొరికింది. ఈ వెబ్సైటులో గాంధీ ఇండియన్ అంబులెన్స్ కార్ప్స్ సభ్యులతో దిగిన మరికొన్ని ఫోటోలు కూడా చూడొచ్చు.
భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కల్చర్ వెబ్సైటులో పోస్టులోని ఫోటోలో కేవలం గాంధీని మాత్రమే క్రాప్ చేసిన ఫోటో ఉంది. ఈ ఫోటోకి సంబంధించి ఇచ్చిన వివరణలో కూడా ఇది రెండోవ బోయర్ యుద్ధ సమయంలో ఇండియన్ అంబులెన్స్ కార్ప్స్ సభ్యులతో గాంధీ ఉన్నప్పటి ఫోటో అంటూ పేర్కొన్నారు. గాంధీ ఎప్పుడూ కూడా బ్రిటిష్ సైన్యంలో పనిచేయలేదు.
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో గాంధీ బహిరంగగానే బ్రిటిష్‌కి మద్దతు తెలిపాడు. రెండో ప్రపంచ యుద్ద సమయంలో బ్రిటిష్ భారత మద్దతు కోరింది. ఈ విషయంపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్ధాలో జరిపిన మీటింగ్‌లో గాంధీ బ్రిటిష్‌కే తన సానుభూతి ఉంటుందని తన అభిప్రాయాన్ని తెలిపినప్పటికీ, భారత దేశానికి పూర్తి స్వతంత్రం ప్రకటిస్తేనే బ్రిటిష్‌కి తమ మద్దతు ఉంటుందని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తీర్మానం చేసింది.
చివరగా, గాంధీ ఎప్పుడూ బ్రిటిష్ ఆర్మీలో పని చేయలేదు, ఈ ఫోటో గాంధీ సౌత్ ఆఫ్రికాలో ఇండియన్ అంబులెన్స్ కార్ప్స్ సభ్యులతో కలిసి దిగింది.