కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేతులు జోడించాల్సిన చోట దోసిలి పడతాడని, దోసిలి పట్టి నమాజ్ చేయాల్సిన చోట చేతులు జోడించి ప్రార్థన చేస్తారని క్లెయిమ్ చేస్తూ రెండు ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ ఫోటోలలో రాహుల్ గాంధీ, మసీదులో చేతులు జోడించి నమస్కరిస్తున్నట్టు అలాగే, హిందూ దేవాలయంలో దోసిలి పట్టి నమాజ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రాహుల్ గాంధీ, మసీదులో చేతులు జోడించి నమస్కరించి, హిందూ దేవాలయంలో నమాజ్ చేస్తున్న ఫోటోలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన మొదటి ఫోటో, రాహుల్ గాంధీ 2016లో బరేలి లోని దర్గా-ఇ-అలా-హజ్రత్ ని సందర్శించినప్పుడు తీసినది. పోస్టులో షేర్ చేసిన మరొక ఫోటో, రాహుల్ గాంధీ గ్వాలియర్ లోని అచలేశ్వర మహాదేవ దేవాలయంలో అర్చకుడు ఇచ్చిన ప్రసాదాన్ని తింటున్నప్పుడు తీసినది. పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు రాహుల్ గాంధీ ఈ దేవాలయంలో దోసిలి పట్టి నమాజ్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
ఫోటో-1:
పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ కాంగ్రెస్ పార్టి 28 సెప్టెంబర్ 2016 నాడు ఒక ట్వీట్ చేసినట్టు తెలిసింది. రాహుల్ గాంధీ బరేలి లోని దర్గా-ఇ-అలా-హజ్రత్ ను సందర్శించినప్పుడు ఈ ఫోటో తీసినట్టు ట్వీట్ లో తెలిపారు. 2016లో రాహుల్ గాంధీ కిసాన్ ర్యాలి లో భాగంగా బరేలి లోని దర్గాను సందర్శించినట్టు పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.
ఫోటో-2:
పోస్టులో షేర్ చేసిన మరొక ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని మాజీ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా 15 అక్టోబర్ 2018 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని అచలేశ్వర మహాదేవ దేవాలయంలో, ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలని సింధియా తన ట్వీట్ లో తెలిపారు.
2018లో రాహుల్ గాంధీ అచలేశ్వర మహాదేవ దేవాలయంలో పూజలు నిర్వహించిన వీడియోని కాంగ్రెస్ పార్టీ తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసింది. ఈ వీడియోలో రాహుల్ గాంధీ అర్చకుడు ఇచ్చిన ప్రసాదాన్ని చేతిలో పట్టుకొని తిన్న దృశ్యాలని మనం చూడవచ్చు. పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టుగా రాహుల్ గాంధీ ఈ దేవాలయంలో దోసిలి పట్టి నమాజ్ చేయలేదు.
చివరగా, రాహుల్ గాంధీ దేవాలయంలో ప్రసాదం తీసుకుంటున్న ఫోటోని చూపిస్తూ హిందూ దేవాలయంలో రాహుల్ గాంధీ దోసిలి పట్టి నమాజ్ చేస్తున్నాడని షేర్ చేస్తున్నారు.