Fake News, Telugu
 

యూపీఏ ప్రభుత్వం హయాంలో కూడా భారత్ దగ్గర అమెరికా ట్రెజరీ సెక్యూరిటీలు ఉన్నాయి

0

భారత్ కి అమెరికా 216 బిలియన్ డాలర్లు అప్పు ఉందని, అప్పులు తీసుకునే స్థాయి నుండి అప్పులిచ్చే స్థాయికి భారతదేశ స్థాయిని పెంచింది నరేంద్ర మోదీ అని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అప్పులు తీసుకునే స్థాయి నుండి అమెరికాకి అప్పులిచ్చే స్థాయికి భారతదేశ స్థాయిని పెంచిన నరేంద్ర మోదీ.

ఫాక్ట్: యూపీఏ ప్రభుత్వం హయాంలో కూడా భారత్ దగ్గర అమెరికా ట్రెజరీ సెక్యూరిటీలు ఉన్నాయి. పోస్ట్ లో చెప్పినట్టు కేవలం మోదీ ప్రభుత్వం వచ్చాక మాత్రమే అమెరికా ట్రెజరీ సెక్యూరిటీలను భారత్ తీసుకోవడం మొదలుపెట్టలేదు. కావున పోస్ట్ లో ఆ వివరాలు చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారు.

అమెరికా దేశపు అప్పు సుమారు 27.9 ట్రిలియన్ డాలర్లు అని, భారత్ దగ్గర 216 బిలియన్ డాలర్లు విలువ చేసే అమెరికా ట్రెజరీ సెక్యూరిటీలు ఉన్నాయని చెప్తూ ఇంతకముందు FACTLY రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవొచ్చు. 216 బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికా ట్రెజరీ సెక్యూరిటీల్లో సుమారు 183 బిలియన్ డాలర్ల దీర్ఘకాలిక (‘Long-term’) సెక్యూరిటీలు మరియు 33 బిలియన్ డాలర్ల స్వల్పకాలిక (‘Short-term’) సెక్యూరిటీలు ఉన్నాయి. అంతేకాదు, అమెరికా ట్రెజరీ సెక్యూరిటీలు లిస్టులో భారత్ పైన ఇంకా చాలా దేశాలు ఉన్నట్టు గమనించవొచ్చు.

అయితే, పోస్ట్ లో చెప్పినట్టు మోదీ ప్రభుత్వం వచ్చాకనే అమెరికా ట్రెజరీ సెక్యూరిటీలను భారత్ తీసుకోవడం మొదలుపెట్టిందా అనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. 2000 సంవత్సరం నుండి వివిధ దేశాల దగ్గర ఎన్ని అమెరికా ట్రెజరీ సెక్యూరిటీలు ఉన్నాయనే సమాచారం ఇక్కడ చూడవొచ్చు. ఆ లిస్టుల్లో భారత్ కి సంబంధించి 2000, 2001, మరియు 2005 సంవత్సరాల డేటా లేదు. కాబట్టి, 2006 నుండి భారత్ కి సంబంధించిన సమాచారం తీసుకోబడింది. ఆ వివరాలు కింద గ్రాఫ్ లోచూడవొచ్చు.

యూపీఏ ప్రభుత్వం సమయంలో కూడా భారత్ దగ్గర అమెరికా ట్రెజరీ సెక్యూరిటీలు ఉన్నట్టు పై గ్రాఫ్ లో చూడవొచ్చు. కాబట్టి, పోస్ట్ లో చెప్పినట్టు కేవలం మోదీ ప్రభుత్వం వచ్చాక మాత్రమే అమెరికా ట్రెజరీ సెక్యూరిటీలను భారత్ తీసుకోవడం మొదలుపెట్టలేదు. అంతేకాదు, ప్రపంచ బ్యాంకు దగ్గర ఇండియా తీసుకున్న అప్పుల వివరాలు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, యూపీఏ ప్రభుత్వం హయాంలో కూడా భారత్ దగ్గర అమెరికా ట్రెజరీ సెక్యూరిటీలు ఉన్నాయి.

Share.

About Author

Comments are closed.

scroll