Fake News, Telugu
 

BJPతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలకు బడ్జెట్ లో ఎక్కువ శాతం కేటాయించింది

0

‘గత ప్రభుత్వాల సమయంలో దేశ రక్షణ బడ్జెట్ 2 లక్షల కోట్లుకాగా ఇప్పుడు BJP ప్రభుత్వం 5 లక్షల కోట్లు రక్షణ బడ్జెట్ ఖర్చు చేస్తుందని, జాతీయ ఉపాధి హామీ పథకం కోసం లక్షల కోట్ల రూపాయలు డబ్బులు, గ్రామాల్లో పీఎం గ్రామ్ సడక్ యోజన కింద సిమెంట్ రహదారుల నిర్మాణం మరియు ఇతర కర్యయక్రమాలు లేదా పథకాల కోసం ఖర్చు చేస్తుందని’  చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో ఇటీవల పెట్రోల్ ధరలు వరసగా పెరుగతున్న నేపథ్యంలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే రక్షణ మరియు ఇతర రంగాలకు BJP ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేసింది.

ఫాక్ట్(నిజం): బడ్జెట్ లో రక్షణ రంగానికి, జాతీయ ఉపాధి హామీ పథకానికి మరియు ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన మొదలైన వాటికి 2009 నుండి 2020 వరకు కేటాయింపుల విలువ పెరిగినప్పటికి, ఆయా బడ్జెట్లలో ఈ రంగాలకు కేటాయించిన శాతం మాత్రం తగ్గుతూ వస్తుంది. 2014-19లోని BJP ప్రభుత్వంతో పోలిస్తే 2009-14 కాలంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రంగాలకు మొత్తం GDPలో ఎక్కువ శాతం కేటాయించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో చెప్తున్న వివిధ పథకాలకు మరియు ఇతర విషయాలకి ఇంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డబ్బులు కేటాయించింది, ఇప్పుడు ప్రత్యేకంగా BJP మాత్రమే కేటాయించాట్లేదు. 2009-2020 బడ్జెట్ కేటాయింపుల్ని పరిశీలిస్తే ఆయాసంవత్సరాలలో మొత్తం GDPలో పోస్టులో చెప్తున్న కొన్ని పథకాలకు మరియు రక్షణ రంగానికి కేటాయించే నిష్పత్తి తగ్గుతూవస్తుంది. ఉదాహారణకి కొన్ని రంగాలకు సంబంధించి 2009 నుండి 2020 వరకు జరిగిన బడ్జెట్ కేటాయింపులు కింద చూడొచ్చు.

రక్షణ బడ్జెట్:

2009లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ బడ్జెట్ కి రూ. 1,66,663 కోట్లు కేటాయించగా అప్పటిని నుండి ప్రతి సంవత్సరం కేటాయింపులు పెరుగుతూ వస్తున్నాయి. 2020లో BJP ప్రభుత్వం రూ. 4,71,378 కోట్లు కేటాయించింది. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పెరుగుదల అనేది సాదారణంగా జరిగేదే, ప్రతీ సంవత్సరం GDP విలువ పెరుగుతుండడంతో దానికి అనుగుణంగా రక్షణ బడ్జెట్ కేటాయింపులు పెరుగుతున్నాయే తప్ప నిజంగా బడ్జెట్ లో ప్రభుత్వం వివిధ రంగాలపై చేస్తున్న వ్యయ శాతంలో గాని లేక మొత్తం GDP విలువలో  రక్షణ రంగానికి కేటాయిస్తున్న శాతం మాత్రం పెరగడంలేదు. ఉదాహరణకి 2009-10 బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి GDP విలువలో 2.8% రక్షణ రంగానికి కేటాయించగా, అప్పటి నుండి (2012-13 బడ్జెట్ మినహాయిస్తే) ప్రతీ సంవత్సరం మొత్తం GDPలో రక్షణ రంగానికి కేటాయించిన శాతం క్రమేపి తగ్గుతూ వస్తుంది. 2019-20 బడ్జెట్ లో మొత్తం GDP విలువలో రక్షణ రంగానికి 2% కేటాయించగా, 2020-21లో ఇది 2.1% కి పెరిగింది. 2009-14 కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం GDPలో రక్షణ రంగానికి కేటాయించిన నిష్పత్తి కన్నా తక్కువగా 2014-20 కాలంలో BJP ప్రభుత్వం కేటాయించింది.

అదే విధంగా 2009 నుండి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో వివిధ రంగాలలో చేసిన వ్యయంలో (government expenditure) రక్షణ రంగానికి కేటాయిస్తున్న నిష్పత్తి కూడా తగ్గుతూ వస్తుంది. 2009-10లో అప్పటి ప్రభుత్వం వివిధ రంగాలలో చేసిన వ్యయంలో 17.6% రక్షణ రంగంలో చేయగా అదే 2020-21కి వచ్చే సరికి 15.5%కి పడిపోయింది. పైన తెలిపినవన్ని బడ్జెట్ కేటాయింపులు మాత్రమే, అసలు ఖర్చు వాటికన్నా తక్కువ లేదా ఎక్కువ ఉండొచ్చు. దిన్నిబట్టి 2009 నుండి 2020 వరకు రక్షణ రంగ కేటాయింపుల్లో శాతాల వారీగా పెద్దగా తేడా లేదని గమనించొచ్చు.

జాతీయ ఉపాధి హామీ పథకం కోసం లక్షల కోట్ల రూపాయలు:

జాతీయ ఉపాధి హామీ పథకానికి (NREGS) సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు కూడా GDPలో వాటా పరంగా చూస్తే 2009 నుండి తగ్గుతూనే ఉంది. 2009-10 బడ్జెట్ లో ఉపాధి హామీ పథకానికి రూ. 39,100 కోట్లు కేటాయించారు, అప్పటి GDPలో అది 0.65%. 2009 నుండి ఈ పథకానికి కేటాయించిన మొత్తం విలువ పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నప్పటికీ GDPలో ఈ పథకానికి కేటాయిస్తున్న నిష్పత్తి ప్రతీ సంవత్సరం తగ్గుతూ వచ్చింది. 2020-21 బడ్జెట్ లో ఈ పథకానికి GDPలో 0.27% (రూ. 61,500 కోట్లు) కేటాయించారు.

దీన్నిబట్టి ఈ పథకానికి కేటాయించిన వాటాని GDPలో నిష్పత్తి ఆధారంగా పోల్చితే కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో కేటాయించిన దానికంటే BJP ప్రభుత్వం తక్కువగా కేటాయించిందని అర్ధమవుతుంది. 

పీఎం గ్రామ్ సడక్ యోజన(PMGSY):

ఈ పథకానికి 2009-10 బడ్జెట్ లో GDPలో 0.2%, అంటే రూ. 12,000 కోట్లు కేటాయించగా, 2020-21 బడ్జెట్ లో ఈ కేటాయింపులు రూ. 19,500 కోట్లతో 0.09% కి చేరుకున్నాయి. మధ్యలో 2011-12 మరియు 2012-13 మినహాయిస్తే GDPలో పీఎం గ్రామ్ సడక్ యోజనకి నిధులు కేటాయించే నిష్పత్తి తగ్గుతూనే వస్తుంది. 2014 నుండి GDPలో ఈ పథకానికి కేటాయించిన డబ్బుల శాతం గణనీయంగా తగ్గడం గమనించొచ్చు.

చివరగా, BJPతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలకు బడ్జెట్ లో ఎక్కువ శాతం కేటాయించింది.

Share.

About Author

Comments are closed.

scroll