Fake News, Telugu
 

అఫ్గానిస్తాన్ మాజీ మంత్రి సయ్యద్ అహ్మద్‌ షా సాదత్ 2020లో దేశం విడిచి వెళ్లారు, తాలిబన్ల ఇటీవల ఆక్రమణ తరువాత కాదు

0

అఫ్గానిస్తాన్‌ మాజీ ఐటి శాఖ మంత్రి అహ్మద్ సయ్యద్ జర్మనీ దేశంలో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న దృశ్యాలు, అంటూ రెండు ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. తాలిబాన్లు ఇటీవల అఫ్గానిస్తాన్‌ దేశాన్ని ఆక్రమించిన తరువాత అహ్మద్ సయ్యద్ తన దేశం విడిచి జర్మనీ దేశంలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తాలిబాన్లు ఆక్రమణ తరువాత అఫ్గాన్ మాజీ ఐటి శాఖ మంత్రి అహ్మద్ సయ్యద్ తన దేశం విడిచి జర్మనీ దేశంలో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు.

ఫాక్ట్ (నిజం): అఫ్గానిస్తాన్ మాజీ మంత్రి సయ్యద్ అహ్మద్ షా సాదత్, అఫ్గాన్ దేశం విడిచి జర్మనీ దేశంలో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న మాట వాస్తవమే కానీ, సయ్యద్ అహ్మద్ అఫ్గాన్ దేశం విడిచి వెళ్ళింది 2020లో, ఇటీవల తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ దేశాన్ని ఆక్రమించిన తరువాత కాదు. 2020లో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సయ్యద్, తన కుటుంబంతో కలిసి జర్మనీ దేశంలో స్థిరపడ్డారు. అహ్మద్ సయ్యద్ ప్రస్తుతం లిప్‌జిగ్ నగరంలో ‘లిఫెరాండో’ అనే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.  

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, ఇవే ఫోటోలని షేర్ చేస్తూ ‘Al Jazeera’ న్యూస్ సంస్థ 24 ఆగష్టు 2021 నాడు ట్వీట్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. అఫ్గానిస్తాన్‌ మాజీ కమ్యూనికేషన్స్, టెక్నాలజీ శాఖ మంత్రి సయ్యద్ అహ్మద్ షా సాదత్ జర్మనీ దేశంలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న దృశ్యాలంటూ ఈ ట్వీట్లో తెలిపారు. 2020లో సయ్యద్ అహ్మద్ అఫ్గాన్ దేశం విడిచి జర్మనీ దేశంలో స్థిరపడినట్టు ఈ ట్వీట్లో తెలిపారు. ఇదే విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ ‘Independent’ న్యూస్ సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు.

సయ్యద్ అహ్మద్ షా సాదత్ 2018 నుండి 2020 వరకు అష్రఫ్ ఘని నేతృత్వంలోని అఫ్గానిస్తాన్ ప్రభుత్వంలో కమ్యూనికేషన్స్, టెక్నాలజీ శాఖ మంత్రిగా పనిచేసారు. 2020లో మంత్రి పదవికి రాజీనామ చేసిన సయ్యద్ అహ్మద్, తన కుటుంబంతో కలిసి దేశం విడిచి జర్మనీ దేశంలో స్థిరపడ్డారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఇటీవల పబ్లిష్ అయిన న్యూస్ అర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ డిగ్రి పూర్తి చేసిన సయ్యద్ అహ్మద్‌కు భాషాపరమైన ఇబ్బందుల కారణంగా జర్మనీ దేశంలో ఉద్యోగ అవకాశాలు రాలేదు. దీనితో, సయ్యద్ అహ్మద్‌ తన కుటుంబ పోషణ కోసం ‘లిఫెరాండో’ అనే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపనీలో ప్రస్తుతం డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్టు CRUX మీడియా సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ ఫోటోలని ఒక జర్మన్ లోకల్ జర్నలిస్ట్ తీసి మొట్టమొదటగా తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసారు. ఈ వివరాల ఆధారంగా అఫ్గానిస్తాన్ మాజీ మంత్రి సయ్యద్ అహ్మద్‌ షా సాదత్ అఫ్గాన్ దేశం విడిఛి వెళ్ళింది 2020లో అని, తాలిబన్లు ఇటీవల అఫ్గానిస్తాన్ దేశాన్ని ఆక్రమించిన తరువాత పారిపోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, అఫ్గానిస్తాన్ మాజీ మంత్రి సయ్యద్ అహ్మద్‌ షా సాదత్ అఫ్గాన్ దేశం విడిఛి వెళ్ళింది 2020లో, ఇటివల తాలిబాన్లు అఫ్గానిస్తాన్ దేశాన్ని ఆక్రమించిన తరువాత కాదు.

Share.

About Author

Comments are closed.

scroll