Fake News, Telugu
 

కలబుర్గిలో జరిగిన శోభా యాత్రకి సంబంధించిన పాత వీడియోని ఎడిట్ చేసి ఉజ్జెయిన్‌లో జరిగిందంటూ షేర్ చేస్తున్నారు

0

ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఉజ్జెయిన్‌లో మొహర్రం సందర్భంగా జరిగిన ఊరేగింపులో కొందరు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసారని వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి విచారణ కూడా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నట్టు ఉండే ఒక హిందువుల ఊరేగింపు వీడియోని షేర్ చేస్తూ, ఈ ఊరేగింపు ఇటీవల ఉజ్జెయిన్‌లో జరిగిన ఊరేగింపుకి ప్రతిగా అదే ప్రదేశంలోనే జరిగిందంటూ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ వీడియోలో పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టు కూడా వినవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మొహారం రోజున ఉజ్జెయిన్‌లో పాకిస్తాన్‌కి అనుకూల నినాదాలు చేసిన చోటే హిందువులు ర్యాలీ చేసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో కర్ణాటకలోని కలబుర్గిలో జరిగిన శోభా యాత్రకి సంబంధించింది. ఈ వీడియో 2018 నుండే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. పైగా ఈ యాత్రలో పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం యూట్యూబ్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా అచ్చం పోస్టులో షేర్ చేసిన వీడియోలోని విజువల్స్ పోలిన 30 సెకండ్ల నిడివి గల వీడియో ఒకటి మాకు కనిపించింది, ఈ వీడియో 2018లో అప్లోడ్ చేసినట్టు ఉంది. ఈ వీడియో టైటిల్ ప్రకారం ఇది 2018లో కలబుర్గిలో శోభా యాత్రకి సంబంధించిన వీడియో. 2018లో కలబుర్గిలో శోభా యాత్ర అనే టైటిల్ తో అచ్చం ఇలాంటిదే మరొక హై రిజల్యూషన్ గల వీడియో కూడా యూట్యూబ్‌లో ఉంది, ఈ వీడియోలో పోలీస్ వాహనంపై ‘Karnataka State Reserve Police’ అని రాసి ఉండడం స్పష్టంగా కనిపిస్తుంది.

గతంలో కూడా అచ్చం ఇలాంటిదే (ఇదే ప్రదేశంలో) మరొక వీడియోని ఉజ్జెయిన్‌లో జరిగిన హిందువుల యాత్రదంటూ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, FACTLY ఈ వీడియోని డీబంక్ చేసి, ఇది కలబుర్గిలో జరిగిన శోభా యాత్రకి సంబంధించిందని నిర్దారిస్తూ రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు.

ఐతే అందుబాటులో ఉన్న ఈ ఆధారాలను బట్టి ఈ వీడియో ఎప్పుడు తీసిందో కచ్చితంగా చెప్పలేనప్పటికి, ఈ వీడియో మాత్రం కర్ణాటకలోని కలబుర్గిలో తీసిందని, ఈ వీడియోకి ఉజ్జెయిన్‌కి ఎటువంటి సంబంధంలేదని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. పైగా ఈ యాత్రలో పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు, దీన్నిబట్టి పోస్టులోని వీడియోలో ఉన్న ఆడియోని డిజిటల్ గా ఎడిట్ చేసి అతికించినట్టు అర్ధం చేసుకోవచ్చు.

అలాగే ఉజ్జెయిన్‌లో ఇలా పోస్టులో చెప్తున్నట్టు పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హిందువులు ఊరేగింపు జరిపినట్టు ఎటువంటి వార్తా కథనాలు గాని లేక ఇతర సమాచారం గాని లేదు.

చివరగా, కలబుర్గిలో జరిగిన శోభా యాత్రకి సంబంధించిన పాత వీడియోని డిజిటల్‌గా ఎడిట్ చేసి ఉజ్జెయిన్‌లో  జరిగిందంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll