Fake News, Telugu
 

భారత ఆర్ధిక వ్యవస్థ పై పోస్టులోని ఒక్క వాక్యం తప్ప మిగితా వ్యాఖ్యలను మోర్గాన్ స్టాన్లీ చేయలేదు

0

మోర్గాన్ స్టాన్లీ సంస్థ వారు తమ రీసెర్చ్ లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రధాని మోదీ పై చేసిన వ్యాఖ్యలు అని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రధాని మోదీ ని ప్రశంసిస్తు మోర్గాన్ స్టాన్లీ రీసెర్చ్ చేసిన వ్యాఖ్యలు.

ఫాక్ట్: 2027 నాటికి భారతదేశం యొక్క జీడీపీ 6 ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది అనే ఒక్క వాక్యం తప్ప, పోస్టులోని మిగితా వ్యాఖ్యలను మోర్గాన్ స్టాన్లీ చేయలేదు. ఆ ‘ఆరు ట్రిలియన్ డాలర్ల జీడీపీ’ వ్యాఖ్యాన్ని కూడా కోవిడ్-19 సంక్షోభం రాకముందు 2017 లో విడుదల చేసిన రిపోర్ట్ లో చెప్పారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని మెసేజ్ గురించి ఇంటర్నెట్ లో వెతకగా, అదే మెసేజ్ ఇంటర్నెట్ లో కనీసం 2018 నుండి షేర్ అవుతున్నట్టు తెలుస్తుంది. కొన్ని పాత పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. పోస్ట్ లోని మెసేజ్ పాతది కాబట్టి, దాంట్లో ఉన్న వ్యాఖ్యలు ప్రస్తుత భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి కావు.

పోస్ట్ లో చాలా వ్యాఖ్యలు ఉన్నాయి. ఒక్కో వాక్యం తీసుకొని దానిని మోర్గాన్ స్టాన్లీ వారు తమ రీసెర్చ్ లో పేర్కొన్నారో లేదో చూద్దాం.

‘ప్రపంచ బ్యాంకు నుండి గత మూడేళ్ళలో ప్రధాని మోదీ ఒక్క డాలర్ కూడా అప్పు తీసుకోలేదు’?

ఈ వ్యాఖ్య మోర్గాన్ స్టాన్లీ వారు చేసినట్టు ఎక్కడా కూడా ఆధారాలు దొరకలేదు. అసలు ఆ వ్యాఖ్యంలో ఎంతవరకు నిజముందో లేదో చూద్దాం. భారతదేశం తీసుకున్న అప్పుల గురించి ప్రపంచ బ్యాంకు వెబ్సైటులో చూడగా, 2014 నుండి 2020 మధ్యలో కూడా ప్రపంచ బ్యాంకు యొక్క ‘ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్’ మరియు ‘ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్’ నుండి వివిధ కేంద్ర మరియు రాష్ట్ర ప్రాజెక్టుల కోసం భారతదేశం అప్పులు తీసుకున్నట్టు తెలుస్తుంది. సంవత్సరాల వారీగా 2012-20 మధ్య భారతదేశం తీసుకున్న అప్పుల వివరాలు కింద చూడవొచ్చు.

తాజాగా, ‘Micro, Small and Medium Enterprises Emergency Response’ కోసం భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తీసుకుంది. కాబట్టి, ప్రపంచ బ్యాంకు నుండి మోదీ ప్రభుత్వం అసలు అప్పు తీసుకోలేదనేది అబద్ధం.

‘పది సంవత్సరాలలో భారతదేశం యొక్క జీడీపీ 6 ట్రిలియన్ డాలర్లను అధిగమిస్తుంది’?

ఈ విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, పై వ్యాఖాన్ని మోర్గాన్ స్టాన్లీ వారు 2017 లో విడుదల చేసిన తమ ‘India’s Digital Leap: The Multi-Trillion-Dollar Opportunity’ రిపోర్ట్ లో పేర్కొన్నట్టు తెలిసింది. పూర్తి రిపోర్ట్ ని ఇక్కడ చదవొచ్చు. రిపోర్ట్ ని మోర్గాన్ స్టాన్లీ వారు కోవిడ్-19 సంక్షోభం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయకముందు విడుదల చేసారు.

‘మోదీ కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా రెట్లు పెరుగుతుందని చెప్పిన ఫోర్బ్స్ మ్యాగజైన్’?

భారతదేశ ఆర్ధికవ్యవస్థ గురించి పై వ్యాఖ్యను ఫోర్బ్స్ లేదా మోర్గాన్ స్టాన్లీ వారు చేసినట్టు ఎక్కడా కూడా ఆధారాలు దొరకలేదు. ‘India: What’s Going On With Modi’s Economy?’ అనే టైటిల్ తో జనవరి 2020 లో ఫోర్బ్స్ వారు ప్రచురించిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

‘ఆర్థిక వృద్ధి పై ఇటీవల విడుదల చేసిన 137 దేశాల లిస్టులో భారత్ 31 స్థానాలు పెరిగి 40 వ స్థానంలో నిలిచింది’?

కేవలం ఆర్థిక వృద్ధి పై అలాంటి ర్యాంకింగ్ ఉన్నట్టు గానీ, పై వాక్యం మోర్గాన్ స్టాన్లీ వారు చేసినట్టు గానీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ‘The Global Competitiveness Index 2017-2018 edition’ ర్యాంకింగ్స్ లో భారత్ కి 40 వ ర్యాంకు (137 దేశాల్లో) వచ్చింది. 2014-15 లో వచ్చిన 71 వ ర్యాంకు (144 దేశాల్లో) తో పోలిస్తే 2017-18 లో భారత్ ర్యాంకు 31 స్థానాలు మెరుగు పడింది. కావున, పోస్ట్ లో ఇచ్చిన ర్యాంకు ఆర్థిక వృద్ధి పై కాదు.అంతే కాదు, భారత్ ర్యాంకు 31 స్థానాలు మెరుగు పడింది 2014-15 మరియు 2017-18 మధ్యలో. ‘The Global Competitiveness Report 2019’ ర్యాంకింగ్స్ లో భారత్ కి 68 వ ర్యాంకుకు (141 దేశాల్లో) పడిపోయింది.

చివరగా, భారత ఆర్ధిక వ్యవస్థ పై పోస్టులోని ఒక్క వాక్యం తప్ప మిగితా వ్యాఖ్యలను మోర్గాన్ స్టాన్లీ చేయలేదు. పోస్ట్ లోని కొన్ని వ్యాఖ్యలు కూడా తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll