Fake News, Telugu
 

‘ఈటల లేఖ నిజమే’ అంటూ ఈ ఫోటోలోని వార్తను ‘ఈనాడు’ ప్రచురించలేదు

0

తెలంగాణ సీఎం కేసీఆర్ కు తాజాగా బీజేపీ లో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాసిన లేఖ అంటూ ఒక లేఖ ఫోటో తాజగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ లేఖ ఫేక్ అని కొందరు, నిజమే అని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే, ‘ఈటల లేఖ నిజమే’ అంటూ ‘ఈనాడు’ వార్తాపత్రిక ప్రచురించిందని చెప్తూ, ఒక వార్త ఫోటోని సోషల్ మీడియాలో కొంతమంది షేర్ చేస్తున్నారు. ఆ వార్తని నిజంగానే ‘ఈనాడు’ ప్రచురించిందో లేదో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘కేసీఆర్ కి ఈటల రాసిన లేఖ’ నిజమేనని ‘ఈనాడు’ ప్రచురించిన వార్త ఫోటో.

ఫాక్ట్: ఫోటోలో ఉన్న వార్తని ‘ఈనాడు’ వార్తాపత్రిక వారు అసలు ప్రచురించలేదు. అది ఒక ఎడిటెడ్ ఫోటో. అయితే, కేసీఆర్ కి ఈటల రాసిన లేఖ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ నిజమో కాదో తెలియాల్సి ఉంది. ఫోటోలో ఉన్న వార్తను ఈనాడు వారు ప్రచురించలేదు కాబట్టి, పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ చేసిన ఫోటోలో ‘ఈనాడు’ లోగో ని చూడవొచ్చు. ‘ఈటల లేఖ నిజమే’ అంటూ ‘ఈనాడు’ వారు ఏమైనా వార్త ప్రచురించారా అని వెతకగా, ఆ వార్తను ‘ఈనాడు’ ప్రచురించలేదని తెలిసింది. ‘ఈటల పేరిట సీఎంకు లేఖ..తప్పుడు ప్రచారమంటూ ఠాణాలో మద్దతుదారుల ఫిర్యాదు’, అని మాత్రం ‘ఈనాడు’ వారు 26 జూన్ 2021 న ఒక వార్తను ప్రచురించినట్టు తెలిసింది. ఇలాంటి వార్తే ‘ఈటీవీ భారత్’ వారు 25 జూన్ 2021 న ప్రచురించినట్టు ఇక్కడ చూడవొచ్చు.

పోస్ట్ చేసిన ఫోటోలో ‘ఈనాడు’ లోగో పక్కన ‘సిరి’ ప్రకటన చూడవొచ్చు మరియు ‘ఈటల లేఖ’ ఫోటో గత వారం రోజుల్లో వైరల్ అయింది. కాబట్టి, ‘ఈనాడు’ లోగో కుడి పక్కన ‘సిరి’ ప్రకటన ఉన్న గత వారంలోని ‘ఈనాడు’ ప్రత్రికలు (తెలంగాణ ఎడిషన్) చూడగా, 22 జూన్ 2021 న మరియు 26 జూన్ 2021 న అలా ప్రకటన వచ్చినట్టు తెలిసింది. అయితే, పోస్ట్ లోని వార్త మాత్రం ఆ వార్తాపత్రికల్లో లేదు. 26 జూన్ వార్తాపత్రికలో పోస్ట్ లో ఉన్నట్టు ఒక డబ్బాలో వేరే వార్త ఉంది. ఆ వార్తను తీసేసి, ‘ఈటల లేఖ నిజమే’ అంటూ ఎడిట్ చేసి ఉండవొచ్చు. అయితే,  ‘కేసీఆర్ కి ఈటెల రాసిన లేఖ’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ నిజమో కాదో తెలియాల్సి ఉంది.

చివరగా, ‘ఈటల లేఖ నిజమే’ అంటూ ఫోటోలోని వార్తను ‘ఈనాడు’ ప్రచురించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll