Fake News, Telugu
 

2019లో పెంచిన TSRTC బస్సుల ధరలని వై.యస్.జగన్ ప్రభుత్వం ఇటీవల APSRTC బస్సుల ధరలు పెంచినట్టు షేర్ చేస్తున్నారు

0

ఆంధ్రప్రదేశ్ లోని వై.యస్.జగన్ ప్రభుత్వం ఆర్టీసీ బస్ చార్జీలు పెంచినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ప్రజల కష్టాలని తీరుస్తానని మాట ఇచ్చిన జగన్, బస్ చార్జీలు పెంచి సామన్య ప్రజల కన్నీటికి కారణమైనట్టుగా ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ లోని వై.యస్.జగన్ ప్రభుత్వం కొత్తగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని ‘మనలోకం’ అనే వార్తా సంస్థ 03 డిసెంబర్ 2019 నాడు తమ ఫేస్బుక్ పేజీలో షేర్ చేసింది. ఫోటోలో కనిపిస్తున్న బస్ చార్జీలు తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కి సంబంధించినవి. 2019లో TSRTC ఉద్యోగులు సమ్మె తరువాత తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్ చార్జీలు పెంచింది. ఈ ఫోటోలో తెలుపుతున్న ధరలు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ (APSRTC) కి సంబంధించినవి కావు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ వెబ్సైటులో వెతకగా, బస్ చార్జీలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిసింది. వై.యస్.జగన్ ప్రభుత్వం ఒకవేళ ఆర్టీసీ బస్ చార్జీలు పెంచివుంటే, దానికి సంబంధించి పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. కాని, APSRTC చార్జీలను వై.యస్.జగన్ ప్రభుత్వం పెంచినట్టుగా ఇటీవల ఇంటర్నెట్ లో ఒక్క న్యూస్ ఆర్టికల్ కూడా పబ్లిష్ అవ్వలేదు.

ఫోటోలో కనిపిస్తున్న ‘మనలోకం’ పేరు ఆధారంగా ఆ ఫోటోకి సంబంధించిన వివరాల కోసం వెతకగా, ఈ ఫోటోని  ‘మనలోకం’ అనే వార్తా సంస్థ 03 డిసెంబర్ 2019 నాడు తమ ఫేస్బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. ఫోటోలో తెలిపిన ధరలు తెలంగాణ ఆర్టీసీ బస్ చార్జీలకు సంబంధించినవి అని ఈ పోస్టులో స్పష్టంగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం TSRTC బస్సుల ధరలని పెంచిన విషయాన్నీ ‘మనలోకం’ న్యూస్ సంస్థ 28 డిసెంబర్ 2019 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో కూడా రిపోర్ట్ చేసారు.

TSRTC ఉద్యోగులు సమ్మె తరువాత తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్ చార్జీలు పెంచిన విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ డిసెంబర్ 2019లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్ మరియు వీడియోని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా ఫోటోలో తెలిపిన ధరలు TSRTC బస్సులకు కి సంబంధించినవి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. TSRTC పెరిగిన బస్ చార్జీల పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు.

చివరగా,  2019లో తెలంగాణ ప్రభుత్వం పెంచిన TSRTC బస్ చార్జీలను వై.యస్.జగన్ ప్రభుత్వం ఇటీవల APSRTC బస్ చార్జీలు పెంచినట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll