Fake News, Telugu
 

ఎడిట్ చేసిన ఫోటోని ముస్లిం మహిళ ప్లకార్డు పట్టుకొని హిందువులకు సందేశమిస్తున్న దృశ్యమంటూ షేర్ చేస్తున్నారు

0

ముస్లింలను నమ్మడం హిందువుల మూర్ఖత్వమని ఒక ముస్లిం మహిళ ప్లకార్డు పట్టుకొని హిందువులకు సందేశమిస్తున్న దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. ఒకే ముస్లిం మతానికి చెందిన సున్ని, షియా వర్గాలే ఇంతవరకు కలవలేదు, అటువంటిది హిందూ-ముస్లిం భాయ్-భాయ్ అవుతారని ఎలా నమ్ముతున్నారంటూ ఈ ముస్లిం మహిళ తన ప్లకార్డు ద్వారా తెలిపినట్టు పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముస్లింలను నమ్మడం హిందువుల మూర్ఖత్వమని ఒక ముస్లిం మహిళ ప్లకార్డు పట్టుకొని సందేశమిస్తున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది. ఒరిజినల్ ఫోటోలో ఈ ముస్లిం మహిళ పట్టుకున్న ప్లకార్డు పై, “నేను ముస్లింని కానీ, అరబ్బుని కాదు”, అని రాసి ఉంది.  కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ముస్లిం మహిళ ప్లకార్డు పట్టుకొని ఉన్న ఇదే ఫోటో ‘One Beauty of Islam’ అనే బ్లాగ్ సైటులో దొరికింది. కాని ఒరిజినల్ ఫోటోలో ఈ ముస్లిం మహిళ పట్టుకున్న ప్లకార్డుపై “నేను ముస్లింని కానీ, అరబ్బుని కాదు”, అని రాసి ఉంది. ముస్లిం మతం పేరుతో తనని స్టీరియోటైప్ లేదా జడ్జ్ చేయవద్దని ఈ మహిళ తన ప్లకార్డులో పేర్కొంది. ముస్లింలను నమ్మడం హిందువుల మూర్ఖత్వమని ఈ ప్లకార్డులో ఎక్కడా రాసి లేదు.

2012లో యూనివర్శిటీ ఆఫ్ మేరీ వాషింగ్టన్‌కు చెందిన ఇస్లామిక్ స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్ధులు, అమెరికాలో ముస్లింలను క్రూరమైన వ్యక్తులుగా పరిగణిస్తున్న తీరుని నిరసిస్తూ ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముస్లిం మతానికి చెందిన పురుషులు అలాగే, మహిళలు వివిధ ప్లకార్డులు పట్టుకొని స్టీరియోటైపింగ్ అలాగే, ముస్లింలను జడ్జ్ చేస్తున్న విధానాలని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన మరికొన్ని ఫోటోలని ఇక్కడ చూడవచ్చు.

2019లో ఇదే ఫోటోని ఎడిట్ చేసి ముస్లిం మహిళ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు తెలుపుతున్న చిత్రమంటూ సోషల్ మీడియాలో షేర్ చెసినప్పుడు, AFP దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరగా, ఎడిట్ చేసిన ఫోటోని ముస్లిం మహిళ ప్లకార్డు పట్టుకొని ముస్లింలను నమ్మవద్దని హిందువులకు సందేశమిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll