Fake News, Telugu
 

దేశంలోని క్రైస్తవ ముఖ్యమంత్రుల జాబితా అంటూ షేర్ చేస్తున్న ఈ సమాచారం తప్పు

0

దేశంలోని క్రైస్తవ ముఖ్యమంత్రుల జాబితా, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేరళ సిఎం పినరయి విజయన్, జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్, తమిళనాడు సిఎం MK స్టాలిన్, మిజోరాం సిఎం జోరాంతంగా, మేఘాలయ సిఎం కొన్రాడ్ సంగ్మా, నాగాలాండ్ సిఎం నెఫ్యు రియో, పంజాబ్ సిఎం భగవంత్ మాన్ మరియు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్  క్రైస్తవ మతానికి సంబంధించిన వారని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: దేశంలో క్రైస్తవ ముఖ్యమంత్రులు జాబితాను తెలుపుతున్న పోస్ట్.

ఫాక్ట్ (నిజం): పోస్టులో తెలుపుతున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హిమంత్ సోరెన్ క్రైస్తవ మతానికి సంబంధించిన వారు కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో తెలిపిన ముఖ్యమంత్రుల జాబితాలోని ముఖ్యమంత్రుల మతపరమైన వివరాలని ఒక్కొకటిగా తెలుసుకుందాం.

పినరయి విజయన్:

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హిందూ మతానికి సంబంధించిన తియ్యా లేదా ఎజవా కులానికి చెందిన కుటుంబంలో జన్మించారు. 2018లో తన కుల వృత్తిని హైలైట్ చేస్తూ జన్మభూమి అనే వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఒక కార్టూన్‌పై స్పందీస్తూ పినరయి విజయన్, “కొందరు నా కుల వృత్తిని పదే పదే గుర్తుచేస్తారు. నేను ఒక టాడి టాపర్ (తాటి కల్లు తీసే వ్యక్తి) కొడుకుని. కాబట్టి, నేను కూడా అదే కుల వృత్తి చేయాలని వారు నమ్ముతున్నారు”, అని తెలిపారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అనుసరించే పినరయి విజయన్ స్వతహాగా ఒక నాస్తికుడని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. పినరయి విజయన్ క్రైస్తవ మతానికి సంబంధించినవాడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

హేమంత్ సోరెన్:

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హిందూ మతానికి సంబంధించిన ఆదివాసీ తెగకు చెందిన కుటుంబంలో జన్మించారు. ఆదివాసులు హిందూ మతంలో భాగం కాదని, ఆదివాసులు ప్రకృతిని మాత్రమే పూజిస్తారని 2021లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నిర్వహించిన ఒక కాన్ఫరెన్సులో తెలిపారు. సేన్సస్ 2021 లెక్కలలో ఆదివాసులను ‘సర్నా’ అనే ప్రత్యేక మతం కింద గుర్తించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ హేమంత్ సోరెన్ ప్రభుత్వం 2020లో ఝార్ఖండ్ అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా పాస్ చేసింది. హేమంత్ సోరెన్ తాను క్రైస్తవ మతానికి చెందిన వాడని ఎప్పుడూ ఎక్కడా తెలుపలేదు.

MK స్టాలిన్:

తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ తాను ఒక నాస్తికుడినని పలు సందర్భాలలో మీడియాకి స్పష్టం చేశారు. MK స్టాలిన్ తండ్రి, డిఎంకే పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన కరుణానిధి, హిందూ మతానికి సంబంధించిన ఇసై-వెల్లర్ అనే కులానికి చెందిన కుటుంబంలో జన్మించారు. ద్రవిడ మాడెల్ ఆఫ్ గవర్నన్స్ సిద్దాంతంతో స్థాపించిన డిఎంకే పార్టీకి దశాబ్దాలుగా అధ్యక్షుడిగా ఉన్న కరుణానిధి కూడా ఒక నాస్తికుడని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

అరవింద్ కేజ్రీవాల్:

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలు సందర్భాలలో తాను హిందూ ధర్మాన్ని పాటిస్తానని మరియు హనుమంతుని భక్తుడినని ప్రకటించారు. 24 ఏళ్ల వయసులో మిషనరీ ఆఫ్ చారిటీలో వాలంటీరుగా పని చేసినట్టు అరవింద్ కేజ్రీవాల్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ, తను హిందూ ధర్మాన్ని వదిలి క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. కేజ్రీవాల్ క్రిప్టో క్రిస్టియన్ అంటూ ఇదివరకు సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు ఫాక్ట్‌లీ పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు.

భగవంత్ మాన్:

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిక్కు మతం జాట్ కమ్యూనిటికి చెందిన కుటుంబంలో జన్మించినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. భగవంత్ మాన్ క్రైస్తవ మతానికి చెందిన వాడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పోస్టులో తెలిపిన మిగితా ముఖ్యమంత్రులు క్రైస్తవ మతానికి సంబంధించిన వారు అయినప్పటికీ, ఈ జాబితాలో తెలిపిన చాలా మంది ముఖ్యమంత్రులు క్రైస్తవ మతానికి సంబంధించిన వారు కాదని పై వివరాల ఆధారంగా స్పష్టంగా చెప్పవచ్చు.

చివరగా, దేశంలోని క్రైస్తవ ముఖ్యమంత్రుల జాబితా అంటూ షేర్ చేస్తున్న ఈ సమాచారం తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll