Fake News, Telugu
 

ఈ వీడియోలో పోలీసులు ఒక వ్యక్తిని కొడుతున్నది ఫోన్ దొంగలించిన ఆరోపణలు వచ్చినందుకు, ఆవు దూడను హింసించినందుకు కాదు

0

లేగ దూడను హింసించినందుకు పోలీసులు ఒక వ్యక్తిని కొడుతున్న ద్రుశ్యాలంటూ షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో ఎడమ వైపున ‘ఒక వ్యక్తి లేగ దూడని హింసిస్తున్న దృశ్యాలు, మరియు కుడి వైపున పోలీసులు ఒక వ్యక్తిని కొడుతున్న దృశ్యాలు చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: లేగ దూడను హింసించినందుకు పోలీసులు ఒక వ్యక్తిని కొడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వైరల్ వీడియోలో పోలీసులు కొడుతున్న దృశ్యాలకు మరియు ఆవు దూడను హింసించిన దృశ్యాలకు  ఎటువంటి సంబంధంలేదు. నిజానికి పోలీసులు కొడుతున్నది ఫోన్ దొంగతనం ఆరోపణలు వచ్చినందుకు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో జరిగింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా.

వైరల్ వీడియోలో పోలీసులు ఒక వ్యక్తిని కొడుతున్న వీడియో ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో జరిగిన ఒక పాత ఘటనకు సంబంధించింది. పోలీసు కొడుతున్న దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేసిన పలు పాత వార్త కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

ఈ కథనాల ప్రకారం పోలీసులు కొడుతున్న ఈ దృశ్యాలు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో ఫోన్ దొంగలించిన ఆరోపణపై పోలీసులు ఒక వ్యక్తిని కొట్టిన ఘటనకు సంబంధించినవి. ఐతే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులను సస్పెండ్ చేసినట్టు తెలిసింది.

ఆవు దూడను హింసించినందుకే పోలీసులు ఆ వ్యక్తిని కొడుతున్నారని సోషల్ మీడియాలో ఇదే వీడియో వైరల్ అవడంతో, చందౌలీ పోలీసులు ఈ వీడియోకి సంబంధించి వివరణ ఇస్తూ ఈ దృశ్యాలు ఫోన్ దొంగలించిన ఆరోపణలకు సంబంధించినవని స్పష్టం చేసారు. దీన్నిబట్టి వైరల్ వీడియోలో కుడివైపు ఉన్న దృశ్యాలకు ఎడమ వైపు ఉన్న లేగ దూడను హింసించే దృశ్యాలకు ఎటువంటి సంబంధంలేదని స్పష్టమవుతుంది.

ఐతే వైరల్ వీడియోలో ఆవు దూడను హింసించే వీడియో ఎక్కడిదో అన్న కచ్చితమైన సమాచారం మాకు లభించినప్పటికీ ఈ దృశ్యాలకు మరియు కుడి వైపు ఉన్న పోలీసులు కొట్టే ఘటనకు ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు. పైగా పోలీసులు కొడుతున్న ఈ వీడియో గతంలో వేరొక క్లెయిమ్‌తో వైరల్ అయినప్పుడు, ఆ క్లెయిమ్‌ను ఫాక్ట్-చెక్ చేస్తూ FACTLY రాసిన కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.

చివరగా, ఈ వీడియోలో పోలీసులు ఒక వ్యక్తిని కొడుతున్నది ఫోన్ దొంగలించిన ఆరోపణలు వచ్చినందుకు, ఆవు దూడను హింసించినందుకు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll