Fake News, Telugu
 

పాకిస్తాన్‌లో ఇద్దరు పిల్లలు విషపూరిత పాము ఉన్న బిందెలోని పాలు తాగి చనిపోయారని ఎటువంటి రుజువు లేదు.

0

పాకిస్తాన్‌లోని క్వెట్టాలో ఈ మధ్య ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు, నిద్రవేళలో విషపూరిత పాము ఉన్న బిందెలోని పాలు తాగి చనిపోయారని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్కెట్ నుండి ఆకుకూర కట్టను తెరవకుండానే ఫ్రిజ్‌లో పెట్టామని కుటుంబీకులు చెప్పారని, ఆ కట్టల నుండి ఒక పిల్ల పాము ఫ్రిజ్‌లో ఉన్న పాల బిందెలో పడి ఉండవచ్చు అని ఈ పోస్టులో ఉంది. ఇందులో ఎంత నిజముందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: విషపూరితమైన పాము ఉన్న బిందెలోని పాలు తాగి ఇద్దరు పిల్లల మృతి చెందారు. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని క్వెట్టాలో జరిగింది. 

ఫాక్ట్(నిజం): పాము విషం మనిషి యొక్క రక్త ప్రవాహంలో కలిసినప్పుడు అది చావుకి దారి తీస్తుంది. ఇది పాము కాటు వల్ల జరుగుతుంది.  పోస్టులో చెప్తున్నట్లుగా, పాము విషాన్ని తాగటం లేదా పాము ఉన్న బిందెలోని పదార్థాలు తాగటం ద్వారా కూడా విషం రక్త ప్రవాహంలోకి వెళ్లే అవకాశం ఉంది. కడుపులో అల్సర్లు, లేదా ఏవైనా గాయాలు ఉంటే ఇలా జరగవచ్చు. కాబట్టి, పాము విషం తాగటం అంత సురక్షితం కాదు. ఇదిలా ఉంచితే, ఇటువంటి సంఘటన జరిగి క్వెట్టాలో ఇద్దరు పిల్లలు చనిపోయారు అని చెప్పటానికి ఎటువంటి ఆధారాలు లేవు. అంతే కాక ఇదే సంఘటన భారతదేశంలో జరిగింది అని సోషల్ మీడియాలో  2015 నుండి పోస్టులు ఉన్నాయి. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

ముందుగా, క్వెట్టాలో ఇటువంటి సంఘటన ఏదైనా జరిగిందా అని తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతకడం జరిగింది. కానీ దీనికి రుజువుగా ఎటువంటి వార్త కథనాలు మాకు లభించలేదు. అంతే కాక ఇదే క్లెయిముతో 2015 నుండి సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయి అని మా పరిశోధనలో మాకు తెలిసింది. కానీ, అప్పటి పోస్టులలో ఈ సంఘటన భారత దేశంలో జరిగినట్లు ఉంది. మన దేశంలో ఇలాంటి సంఘటన జరిగినట్లు కూడా ఎటువంటి ఆధారాలు లేవు. దీని బట్టి, ఈ సంఘటన అవాస్తవం అని చెప్పొచ్చు.

కానీ ఈ పోస్టు హెచ్చరిస్తున్నట్లు, విషపూరితమైన పాము ఒకటి మన పాల బిందెలో కానీ పడి ఉండి మనం ఆ పాలను తాగితే మనం చనిపోతామా అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఒక విషపూరిహమైన పాము(venomous snake) మనల్ని కాటు వేసినప్పుడు దాని విషం మన రక్త ప్రవాహంలోకి వెళ్తుంది. అది మరణాన్ని కలుగ చేస్తుంది (ఇక్కడ). అయితే, ఒకవేళ పాము విషాన్ని కనుక మనం తాగితే ఏమౌతుంది అని చుస్తే, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా వారి ఆర్టికల్ ఒకటి లభించింది. అందులో వారు పాము విషం తాగితే, మనం చస్తామా అనే ప్రశ్నకు సమాధానం రాస్తూ, పాము కాటు వేస్తేనే అది ప్రాణాంతకం అని చెప్పారు, కానీ విషాన్ని తాగటాన్ని వారు సిఫార్సు చెయ్యలేదు. 

అలాగే, పాము విషాన్ని మనం తాగిప్పుడు, ఒకవేళ మన జీర్ణాశయంలో  ఎక్కడైనా గాయాలు లేదా అల్సర్లు ఉంటే వాటి ద్వారా ఆ విషం మన రక్త ప్రవాహంలోకి వెళ్లే అవకాశం ఉంది (ఇక్కడ మరియు ఇక్కడ ). ఒకసారి రక్త ప్రవాహంలో విషం చేరితే అది ప్రాణాంతకం అవుతుంది.

పోస్టులో చెప్తున్న కథనం లాంటి ఒక సంఘటనలో ఒక 68 సంవత్సరాల వృద్ధుడు, snake wine అనే మందు తాగి ఆసుపత్రి పాలయ్యాడు. అది తాగటం వల్ల తన ఒంట్లోకి విషం వెళ్ళింది. snake wine,  విషపూరిత పాములను rice wine లో నిండా ముంచి తయారు చేస్తారు.

పాము విషం తాగావచ్చా లేదా అనే విషయంపై, SciShow అనే వెరిఫైడ్ యూట్యూబ్ ఛానల్ వారు ఒక వీడియో చేసారు. దాన్ని ఇక్కడ చూసి ఈ విషయంపై మరింత సమాచారం పొందవచ్చు .

ఇదిలా ఉండగా మార్కెట్ నుండి మనం తెచ్చుకొనే ఆకు కూరల్లో హానికారక  germs (క్రిములు) ఉంటాయి అని CDC చెప్తుంది, వీటివల్ల రోగాలు వస్తాయి. ఈ రోగాలనుండి తప్పించుకోవాలి అంటే ఆకు కూరల్ని సరైన విధంగా వండుకోవాలని కూడా CDC సూచిస్తుంది. ఈజిప్ట్లోని బెన్హా నగరంలో లభించే ఆకు కూరల్లో హానికారక పరాన్నజీవులు ఉన్నాయి అని, అవి అమీబియాసిస్, అస్కేరియాసిస్, తదితర వ్యాధులు మనుషుల్లో కలుగచేస్తాయి అని ఒక పరిశోధనలో తేలింది. అపరిశుభ్రంగా ఈ ఆకుకూరల్ని పండించినా, లేదా సరిగ్గా వండకపోయినా, ఈ పరాన్నజీవులు మన ఒంట్లోకి వెళ్లే అవకాశం ఉంది అని ఆ పరిశోధన చెప్తుంది.

చివరిగా, పాకిస్తాన్‌లోని క్వెట్టాలో ఇద్దరు పిల్లలు విషపూరిత పాము ఉన్న బిందెలోని పాలు తాగి చనిపోయారని చెప్పటానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll