ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఇటీవల జరుగుతున్న ఘర్షణలను ఉద్దేశిస్తూ, ఇజ్రాయెల్లో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ప్రజలు భారీ నిరసనలు జరుపుతున్నారనీ, అతన్ని నరహంతకుడు అని పిలిచారంటూ ఒక పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత వాస్తవముందో ఈ కధనం ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: ఇజ్రాయెల్లో ప్రధాని నెతన్యాహుకి వ్యతిరేకంగా ప్రజలు భారీ నిరసనలు తెలుపుతున్నారు
ఫాక్ట్(నిజం): ఇది 2023 ప్రారంభంలో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం ప్రతిపాదించిన న్యాయ సంస్కరణలను వ్యతిరేకిస్తూ, ప్రజలు చేసిన నిరసన యొక్క ఫోటో ఇది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న ఘర్షణల సందర్భంలో చేసిన నిరసన కాదు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతకగా, X పోస్ట్లు (ఇక్కడ మరియు ఇక్కడ) మరియు వార్త పత్రికల్లో (ఇక్కడ మరియు ఇక్కడ) ఈ దృశ్యం గురించి వివరించడం గమనించాం. ఇది 2023 ప్రారంభంలో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం ప్రతిపాదించిన న్యాయ సంస్కరణలను వ్యతిరేకిస్తూ, ప్రజలు చేసిన నిరసన యొక్క ఫోటో.

జనవరి 2023లో నెతన్యాహు ప్రభుత్వం ఇజ్రాయెల్లో న్యాయ సంస్కరణలు ప్రతిపాదించింది. పబ్లిక్ పాలసీపై, న్యాయవ్యవస్థపై సుప్రీం కోర్టు ప్రభావాన్ని అరికట్టడం, సుప్రీం కోర్టు న్యాయ సమీక్షను అమలు చేసే అధికారాన్ని పరిమితం చేయటం, న్యాయ వ్యవస్థ నియామకాలపై ప్రభుత్వ నియంత్రణను మంజూరు చేయడం, లీగల్ అడ్వైసర్ల అధికారాన్ని పరిమితం చేయడం ఈ సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశం అని, ఈ సంస్కరణలు ఇజ్రాయెల్ ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీస్తాయి అని ఇజ్రాయెల్ ప్రజలు భావిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. దీని గురించి వివరాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, నెతన్యాహు ప్రతిపాదించిన న్యాయ సంస్కరణలను వ్యతిరేకిస్తూ, 2023 ప్రారంభంలో ఇజ్రాయెల్ ప్రజలు చేసిన నిరసన యొక్క ఫోటోను ఇప్పుడు షేర్ చేస్తున్నారు.