Fake News, Telugu
 

ఇజ్రాయెల్ తమ F-16 యుద్ధ విమానాలకు హమాస్ దాడులలో మరణించిన కేరళ యువతి సౌమ్య సంతోష్ పేరు పెట్టలేదు

0

ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ పాలస్తీనా పై ప్రయోగించే F-16 యుద్ధ విమానాలకు హమాస్ ఉగ్రవాదులు దాడిలో మరణించిన భారత మహిళ సౌమ్య సంతోష్ పేరు పెట్టినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. అంతేకాదు, హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడులకి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న దాడులకి ‘ఆపరేషన్ సౌమ్య’ అని పేరు పెట్టినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ పాలస్తీనా పై ప్రయోగించే F-16 యుద్ధ విమానాలకు హమాస్ ఉగ్రవాదులు దాడిలో మరణించిన భారత మహిళ సౌమ్య సంతోష్ పేరు పెట్టింది.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది. ఈ ఫోటోలో కనిపిస్తున్నది చైనా దేశానికి సంబంధించిన J-10C యుద్ధ విమానం. ఇజ్రాయెల్ ఉపయోగించే F-16 యుద్ధ విమానం కాదు. ఒరిజినల్ ఫోటోలో కనిపిస్తున్న J-10C ఫైటర్ జెట్ పై  సౌమ్య సంతోష్ అనే పేరు రాసి లేదు. పాలస్తీనా పై నిర్వహిస్తున్న దాడులకి ‘ఆపరేషన్ సౌమ్య’ అనే పేరు పెడుతున్నట్టు కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే దృశ్యం కలిగిన ఫోటోని ‘World Defence’ వెబ్సైటు తమ ఆర్టికల్ లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఆర్టికల్ పబ్లిష్ చేసిన ఫోటోలోని ఫైటర్ జెట్ పై సౌమ్య సంతోష్ అనే పేరు రాసి లేదు. ఈ ఫోటోలో కనిపిస్తున్నది చైనా ఎయిర్ ఫోర్సు ఉపయోగిస్తున్న చెంగ్డు J-10C ఫైటర్ జెట్ అని ఆర్టికల్ లో తెలిపారు. చైనా J-10C ఫైటర్ జెట్ కి సంబంధించిన ఈ ఒరిజినల్ ఫోటోని మరొక న్యూస్ వెబ్సైటు కూడా తమ ఆర్టికల్ లో పబ్లిష్ చేసింది.

చైనా దేశానికి సంబంధించిన ‘Gushiciku’  వెబ్సైటు కూడా ఫోటోలో కనిపిస్తున్న యుద్ద విమానం చైనా J-10C ఫైటర్ జెట్ అని రిపోర్ట్ చేసింది. చెంగ్డు J-10C ఫైటర్ జెట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

హమాస్ దాడులలో భారత మహిళ సౌమ్య సంతోష్ మృతి చెందడం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ ఇజ్రాయెల్ రాయభారి రోన్ మాల్క 12 మే 2021 నాడు ట్వీట్ పెట్టారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ర్యువెన్ రివ్లిన్ సౌమ్య సంతోష్ కుటుంబానికి ఫోన్ చేసి సానుభూతి తెలిపినట్టు ఇజ్రాయెల్ అధికారులు PTI కి సమాచారం ఇచ్చారు. కాని, పాలస్తీనా పై నిర్వహిస్తున్న దాడులకి ‘ఆపరేషన్ సౌమ్య’ అనే పేరు పెడుతున్నట్టు ఇజ్రాయెల్ అధికారులు ఎక్కడా ప్రకటించలేదు. ఈ విషయాన్నీ దృవికరిస్తూ ఇజ్రాయెల్ డిఫెన్సు ఫోర్సు కూడా ఎటువంటి ట్వీట్ పెట్టలేదు.

హమాస్ ఉగ్రవాదులు 11 మే 2021 నాడు ఇజ్రాయెల్ పై జరిపిన రాకెట్ దాడులలో భారత మహిళ సౌమ్య సంతోష్ మరణించింది. కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాకు చెందిన సౌమ్య సంతోష్, గత ఏడు సంవత్సరాలుగా ఇజ్రాయెల్ దేశంలో కేర్ గివర్ గా పనిచేస్తోంది. కేరళలో జరిగిన సౌమ్య సంతోష్ అంత్యక్రియలకి ఇజ్రాయెల్ దౌత్యవేత్త జోనాథన్ జాడ్క హజరైయ్యారు.

చివరగా, ఎడిట్ చేసిన ఫోటోని చూపిస్తూ పాలస్తీనా పై ప్రయోగించే F-16 యుద్ధ విమానాలకు ఇజ్రాయెల్ సౌమ్య సంతోష్ పేరు పెట్టినట్టుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll