కేంద్రం రోజుకి కొన్ని వేల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ డోసులని పంపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని జనాలకు చేరకుండా నదిలో పారేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. నదిలో పారేసిన ఈ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రభుత్వ ఆసుపత్రిలో వాడినట్టుగా లెక్కలు రాసి ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. అంతేకాదు, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక MLA ఇంట్లో 630 ఆక్సిజన్ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకునట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కేంద్రం పంపించిన కొన్ని వేల రెమ్‌డెసివిర్ మందుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు నదిలో పారేసి వృధా చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): రెమ్‌డెసివిర్ మందులు నదిలో కొట్టుకుపోతున్న ఈ ఘటన పంజాబ్ రాష్ట్రం లోని రూప్ నగర్ సమీపంలో చోటుచేసుకుంది. బాక్ర నదిలో కొట్టుకుపోతూ కనిపిస్తున్న ఈ రెమ్‌డెసివిర్ వయల్స్ నకిలీవి అని డ్రగ్స్ కంట్రోలర్ ఆఫీసర్ తెజిందర్ సింగ్ నిర్ధారించారు. ఈ రెమ్‌డెసివిర్ వయల్స్ తో కేంద్ర ప్రభుత్వానికి గాని రాష్ట్ర ప్రభుత్వాలకి గాని ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని BJP అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసినట్టు తెలిసింది. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల రెమ్‌డెసివిర్ వయల్స్ ని భాక్రా నదిలో పారేసి వృధా చేస్తున్నట్టు సంబిత్ పాత్ర తన ట్వీట్ లో ఆరోపించారు. ఈ వీడియోని ఇదే వివరణతో చాలా మంది సోషల్ మీడియా యూసర్లు ఇటివల పోస్ట్ చేసారు. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో గురించిన మరింత సమాచారం కోసం వెతకగా, భాక్రా నదిలో కొట్టుకుపోతూ కనిపించిన ఈ రెమ్‌డెసివిర్ వయల్స్ గురించి ‘The Tribune’ న్యూస్ సంస్థ 07 మే 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. పంజాబ్ రాష్ట్రం రూప్ నగర్ సమీపంలో ప్రవహిస్తున్న బాక్ర నదిలో 621 నకిలీ రెమ్‌డెసివిర్ వయల్స్ ని డంప్ చేసినట్టు ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. కోవిడ్-19 ఎమర్జెన్సీ పేషెంట్ల కోసం ఈ రెమ్‌డెసివిర్ వయల్స్ వాడుతారు. 621 రెమ్‌డెసివిర్ వయల్స్ తో పాటు 1,456 సెఫపెరజోన్ ఇంజక్షన్ వయల్స్ కూడా ఈ నదిలో దొరికినట్టు రూప్ నగర్ పోలీసులు మీడియాకి సమాచారం ఇచ్చారు. భాక్రా నదిలో దొరికిన ఈ రెమ్‌డెసివిర్ వయల్స్ ని పరిశోధించిన డ్రగ్స్ కంట్రోలర్ ఆఫీసర్ తెజిందర్ సింగ్, ఈ ఇంజక్షన్ వియల్స్ నకిలీవి అని నిర్ధారించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుపుతూ పబ్లిష్ చేసిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. దేశంలో చలామణి అవుతున్న నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ వయల్స్ కు సంబంధించి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ DCP మౌనిక భరద్వాజ్ 26 ఏప్రిల్ 2021 నాడు ఒక ట్వీట్ పెట్టారు. నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ వయల్స్ కి ఒరిజినల్ రెమ్‌డెసివిర్ వయల్స్ మధ్య వ్యత్యాసాలు తెలుపుతూ DCP మౌనిక భరద్వాజ్ తన ట్వీట్ లో రెండు ఫోటోలు షేర్ చేసారు.
DCP మౌనిక భరద్వాజ్ షేర్ చేసిన ఈ ఫోటోల ఆధారంగా భాక్రా నదిలో దొరికిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ వయల్స్ ని పరిశీలింఛి చూస్తే, అవి నకిలీవని నిర్ధారణ అయ్యింది. భాక్రా నదిలో దొరికిన ఈ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ వయల్స్ పై ‘Remdesivir’ పేరు ముందు ‘Rx’ అని రాసి లేకపోవడం, ‘Vial’ అనే పదంలోని మొదటి అక్షరం ‘V’ పెద్ద అక్షరంలో లేకపోవడం, అలాగే, ఈ రెమ్‌డెసివిర్ వయల్స్ కవర్ల పై రాసి ఉన్న పదాలు సరిగా అలైన్ అయి లేకపోవడం బట్టి ఈ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ వయల్స్ నకిలీవని ఖచ్చితంగా చెప్పవచ్చు.
Alt News ఫాక్ట్ చెకింగ్ సంస్థ ఈ కేసుకి సంబంధించిన వివరాల కోసం రూప్ నగర్ పోలీసులని సంప్రదించగా, రూప్ నగర్ SSP అఖిల్ చౌదరి వారితో “భాక్రా నదిలో మాకు పట్టుబడిన రేమిదిసివిర్ ఇంజక్షన్ వియల్స్ పై FIR ఫైల్ చేసి విచారణ మొదలుపెట్టడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి అన్ని కోణాలను దృష్టిలో ఉంచుకొని విచారణ చేస్తున్నాము. ఈ కేసు విచారణ కోసం కావలిసిన లీడ్స్ మా దగ్గర ఉన్నప్పటికీ బలమైన ఆధారాల కోసం ఎదురు చుస్తున్నాము. SP-ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలోని ఒక బృందం ఈ కేసుని విచారిస్తుంది”, అని తెలిపారు. ఈ కేసుకి సంబంధించి SSP అఖిల్ చౌదరి తెలిపిన ఈ సమాచారాన్ని Alt News పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ లోచూడవచ్చు. FACTLY కూడా ఈ కేసుకి సంబంధించిన వివరాల కోసం రూప్ నగర్ పోలీసులని సంప్రదించింది. వారి రెస్పాన్స్ వచ్చిన వెంటనే ఈ ఆర్టికల్ ని అప్డేట్ చేస్తాము.
పోస్టులో మరొక ఆరోపణలో పేర్కొన్నట్టు, ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న ఇమ్రాన్ హుస్సేన్ ఇంట్లో, 630 ఆక్సిజన్ సిలిండర్లను ఢిల్లీ పోలీస్ జప్తు చేసినట్టు గాని, అక్రమ ఆక్సిజన్ సిలిండర్లు నిలువ చేసినందుకు ఇమ్రాన్ హుస్సేన్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు గాని ఎటువంటి వార్తా కథనాలు లేవు. AAP మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ తన కార్యాలయంలో ప్రజలకు పంచిన ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ జరపాలని ఒక వ్యక్తి ఢిల్లీ హై కోర్ట్ లో PIL వేయడంతో, 10 మే 2021 నాడు ఢిల్లీ హై కోర్ట్ లో జరిగిన విచారణకు ఇమ్రాన్ హుస్సేన్ హజరయ్యారు. తను ఆ ఆక్సిజన్ సిలిండర్ల ని ఫరిదాబాద్ నుండి సేకరించినట్టు ఇమ్రాన్ హుస్సేన్ కోర్టుకి తెలిపాడు. ఈ విషయమై ఇంకా విచారణ పూర్తి కావాల్సి ఉంది. FACTLY ఈ క్లెయిమ్ కు సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, పంజాబ్ రాష్ట్రం భాక్రా నదిలో కొట్టుకుపోతున్నఈ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ వయల్స్ నకిలీవి అని డ్రగ్స్ కంట్రోలర్ ఆఫీసర్ నిర్ధారించారు.