‘ఢిల్లీలో కేజ్రివాల్ ప్రభుత్వంలోని మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ ఇంట్లో 630 ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకున్న ఢిల్లీ పోలీస్’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ‘ఢిల్లీలో కేజ్రివాల్ ప్రభుత్వంలోని మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ ఇంట్లో 630 ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకున్న ఢిల్లీ పోలీస్’.
ఫాక్ట్ (నిజం): AAP ప్రభుత్వంలోని మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ ఇంటి నుండి 630 ఆక్సిజన్ సిలిండర్లను ఢిల్లీ పోలీస్ జప్తు చేసినట్టు గాని లేక అక్రమ ఆక్సిజన్ సిలిండర్లు నిలువ చేసినందుకు ఇమ్రాన్ హుస్సేన్ ని అరెస్ట్ చేసినట్టు గాని ఎటువంటి వార్తా కథనాలు లేవు. కేవలం తన కార్యాలయం వద్ద ప్రజలకు పంచిన ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడి ఉంది వచ్చాయో విచారణ జరపాలని ఒక వ్యక్తి ఢిల్లీ హై కోర్ట్ లో PIL వేయగా, 10 మే 2021న విచారణకు హాజరైన ఇమ్రాన్ హుస్సేన్ తను ఈ ఆక్సిజన్ ని ఫరిదాబాద్ నుండి సేకరించినట్టు కోర్టుకి తెలిపాడు, ఈ విషయమై ఇంకా విచారణ పూర్తి కావాల్సి ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఢిల్లీలో AAP ప్రభుత్వంలోని మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ ఇంటి నుండి 630 ఆక్సిజన్ సిలిండర్లను ఢిల్లీ పోలీస్ జప్తు చేసినట్టు గాని లేక అక్రమ ఆక్సిజన్ సిలిండర్లు నిలువ చేసినందుకు ఇమ్రాన్ హుస్సేన్ ని అరెస్ట్ చేసినట్టు గాని ఎటువంటి వార్తా కథనాలు లేవు.
కాకపోతే ఢిల్లీ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ తన కార్యాలయం వద్ద ప్రజలకి ఆక్సిజన్ సిలిండర్లు అందజేస్తున్న ఫోటోలని AAP ఢిల్లీ తమ ఫేస్ బుక్ ఎకౌంటులో షేర్ చేసుకుంది. ఐతే ఈ ఫోటోల ఆధారంగా వేదాన్ష్ ఆనంద్ అనే వ్యక్తి అసలు ఇమ్రాన్ హుస్సేన్ కి ఆ ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడి నుండి వచ్చాయని, అతను ఈ సిలిండర్లు ఎవరికీ పంచుతున్నాడని, అతను అక్రమంగా ఈ ఆక్సిజన్ సిలిండర్లను కలిగి ఉన్నాడో లేదో విచారణ జరపాలని ఢిల్లీ హై కోర్ట్ లో ఒక పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ ధాఖలు చేసాడు.
ఐతే 07 మే 2021న ఈ లిటిగేషన్ కి ఢిల్లీ హైకోర్ట్ స్పందిస్తూ ఈ విషయానికి సంబంధించి 10 మే 2021న జరిగే విచారణకు మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ నేరుగా హాజరు కావాలని కోర్ట్ తెలిపింది. ఐతే ఈ కేసుని పరిశీలిస్తున్న జస్టిస్ విపిన్ సాంఘి మరియు జస్టిస్ రేఖా పిళ్ళై వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నారు ‘ముందుగా ఇమ్రాన్ హుస్సేన్ కి ఈ ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడి నుండి వచ్చయో తెలుసుకోవాలని, ఒకవేళ ఇమ్రాన్ హుస్సేన్ ఢిల్లీ వెలుపలి నుండి తన సొంతంగా ఈ ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేస్తే అందులో తప్పు పట్టడానికి ఏమి లేదని, దీనిపై విచారణ జరపాల్సిన అవసరం లేదని, పైగా తను ఢిల్లీలోని ఆక్సిజన్ కొరతను తీరుస్తున్నట్టని అభిప్రాయపడింది. అదే ఒకవేళ తను ఆసుపత్రులకు లేదా నర్సింగ్ హోమ్లకు కేటాయించిన ఆక్సిజన్ సిలిండర్లను అక్రమంగా తరలించి ఉంటే అప్పుడు ఈ విషయమై విచారణ జరపొచ్చని అభిప్రాయపడింది.
ఐతే 10 మే 2021న జరిగిన విచారణకి కోర్టుకి హాజరైన ఇమ్రాన్ హుస్సేన్ తను ఈ ఆక్సిజన్ ని ఢిల్లీ వెలుపల ఫరిదాబాద్ నుండి సేకరించినట్టు కోర్టుకి తెలిపాడు. ఐతే తను ఈ ఆక్సిజన్ ని ఫరిదాబాద్ నుండి సేకరించినట్టు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. అందువలన కోర్టు తన వాదనకి మద్దతుగా ఈ ఆక్సిజన్ ని ఫరిదాబాద్ నుండి సేకరించినట్టు రుజువు చేసే పత్రాలు ఫైల్ చేయాలనీ ఇమ్రాన్ హుస్సేన్ ని ఆదేశిస్తూ కేసుని వాయిదా వేసింది.
పైన తెలిపిన వివరాల ప్రకారం ఇమ్రాన్ హుస్సేన్ ఇంటి నుండి ఢిల్లీ పోలీస్ 630 అక్రమ సిలిండర్లు జప్తుచేయలేదని, కేవలం తన ఆఫీస్ వద్ద తను పంచిన ఆక్సిజన్ సిలిండర్లకు సంబంధించి అవి ఎక్కడి నుండి వచ్చాయన్న విషయంపై విచారణ జరుగుతుందని అర్ధం అవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తన ఆఫీస్ వద్ద పంచిన ఆక్సిజన్ యొక్క పరిమాణం ఎంతో కూడా వార్తా కథనాలు ప్రచురించలేదు, దీన్నిబట్టి ప్రచారంలో ఉన్నట్టు 630 అక్రమ సిలిండర్లు అన్నది కల్పితం అనే అర్ధం చేసుకోవచ్చు.
చివరగా, AAP మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ ఇంట్లో 630 అక్రమ ఆక్సిజన్ సిలిండర్లు లభించాయనే వార్తలో నిజం లేదు.