తమిళనాడుకి చెందిన DMK ఎంపీ టీ.ఆర్.బాలు తను హిందూ వ్యతిరేక విధానాల గురించి గర్వంగా చెప్తున్నాడన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ పోస్టులో బాలు తాను 100 ఏళ్ళ చరిత్ర ఉన్న గుడిని ధ్వంసం చేశానని, అలాగే ‘నేను ఎప్పుడూ హిందువుల ఓట్ల గురించి పట్టించుకోలేదు, అసలు నేను హిందువుల గురించి కూడా పట్టించుకోను’ అని వ్యాఖ్యానించినట్టు చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: DMK ఎంపీ టీ.ఆర్. బాలు తను 100 ఏళ్ళ చరిత్ర ఉన్న గుడిని ధ్వంసం చేశానని గర్వంగా చెప్పుకున్నాడు.
ఫాక్ట్(నిజం): టి.ఆర్. బాలు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఒకసారి బెంగాల్‌లో హైవే నిర్మాణంలో భాగంగా ఎలా 100 ఏళ్ళ నాటి మసీదులు, గుడులు పడగొట్టాల్సి వచ్చిందో చెప్పే సందర్భంలో ‘తన సొంత నియోజికవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం సరస్వతీ, లక్ష్మీ, పార్వతి ఆలయాలని పడగొట్టాల్సి వచ్చిందని చెప్తూ, ఇలా చేస్తే ఓట్లు రావని నాకు తెలుసు, కానీ వాటిని ఎలా రాబట్టాలో కూడా నాకు తెలుసని, మీకు కావాల్సింది దేవాలయం కాబట్టి వారికి వేరే చోట ఇంకా మంచి ఆలయాన్ని నిర్మించి ఇచ్చానని, ఈ విషయాన్ని సంబంధించిన పూజారులతో చర్చించి, ఒప్పించానని’ బాలు అన్నారు. ఈ ప్రసంగంలో బాలు ఎక్కడా కూడా హిందూ దేవాలయాలు పడగొట్టానని గర్వంగా చెప్పడం గానీ, నాకు హిందువుల ఓట్లు అవసరం లేదని గానీ అనలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది
టి.ఆర్.బాలు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్తున్న ప్రసంగం, ఇటీవల 28 జనవరి 2023 నాడు మధురైలో సేతుసముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక కార్యక్రమంలో చేసింది. ఈ విషయానికి సంబంధించిన వివరాల కోసం గూగుల్‌లో వెతకగా, ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ లభించింది.
ఐతే ఈ ప్రసంగంలో అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా తాను దేవాలయాలను పడగొట్టాను అని అన్నాడే తప్ప, హిందువులకు వ్యతిరేకంగా తాను ఈ పని చేసినట్టు గర్వంగా అనలేదు. ఒకసారి బెంగాల్‌లో హైవే నిర్మాణంలో భాగంగా ఎలా 100 ఏళ్ళ నాటి మసీదులు, గుడులు పడగోట్టాల్సి వచ్చిందో చెప్పే సందర్భంలో ఈ మాటలు అన్నాడు.
అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు ఈ విషయానికి సంబంధించి తమ ఎంపీలతో మాట్లడమన్నప్పుడు, బాలు వారితో ‘తన సొంత నియోజికవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం సరస్వతీ, లక్ష్మీ, పార్వతి ఆలయాలని పడగొట్టాల్సి వచ్చిందని చెప్తూ, ఇలా చేస్తే ఓట్లు రావని నాకు తెలుసు, కానీ వాటిని ఎలా రాబట్టాలో కూడా నాకు తెలుసని. మీకు కావాల్సింది దేవాలయం కాబట్టి వారికి వేరే చోట ఇంకా మంచి ఆలయాన్ని నిర్మించి ఇచ్చానని. ఈ విషయాన్ని సంబంధించిన పూజారులతో చర్చించి, ఒప్పించానని’ అన్నాడు.
ఐతే పైన చెప్పినట్టు బాలు ఈ ఉపన్యాసంలో ‘గుళ్ళు పడగొట్టడం చేస్తే ఓట్లు రావని నాకు తెలుసు, కానీ వాటిని ఎలా రాబట్టాలో కూడా నాకు తెలుసని’ అన్నాడే తప్ప ఎక్కడ కూడా ‘నేను ఎప్పుడు హిందువుల ఓట్ల గురించి పట్టించుకోలేదు, అసలు నేను హిందువుల గురించి కూడా పట్టించుకోను’ అని అనలేదు.
ఐతే పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు బాలు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడాడని కొన్ని ఎడిట్ చేసిన వీడియోలు షేర్ అవడంతో, బాలు హిందూ వ్యతిరేక నేపథ్యంలో చేసినవి కావని, తన మాటలను వక్రీకరించినట్టు రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
చివరిగా, దేవాలయాలను పడగొట్టడానికి సంబంధించి DMK ఎంపీ టి.ఆర్.బాలు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు.