Fake News, Telugu
 

కంపెనీ వారు చెప్పినట్టు కోవిడ్ టెస్ట్ కిట్‌ను ఉపయోగించకుండా, నీరు పోసి, తప్పుడు ఫలితాలు వచ్చాయని ఫిర్యాదు చేస్తున్నారు

0

మెడికల్ మాఫియా: కుళాయి నీరు కూడా పాజిటివ్‌గా చూపిస్తున్న కరోనా కిట్లు”, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సరిగ్గా పనిచేయని కరోనా కిట్లతో మెడికల్ మాఫియా; కుళాయి నీరును కూడా పాజిటివ్‌గా చూపిస్తున్న కరోనా కిట్ వీడియో.

ఫాక్ట్: నాసికా రంధ్రాలలో నుండి సేకరించిన నమూనాలతో మాత్రమే ఆ కరోనా టెస్ట్ కిట్ ఉపయోగించాలని, నీరు లేదా ఏదైనా ఇతర ఆహారాలు మరియు ద్రవాలతో ఉపయోగించడం కోసం ఆ టెస్ట్ కిట్‌ను రూపొందించలేదని ‘Abbott’ సంస్థ వారు తెలిపారు. టెస్ట్ కిట్‌ను సరిగ్గా ఉపయోగించకుండా, తప్పుడు సమాచారం షేర్ చేయడం సరికాదని కూడా అన్నారు. ఇతర ద్రవాలు ఉపయోగిస్తే వాటి రసాయన లక్షణాల వల్ల టెస్ట్ కిట్ తప్పుడు ఫలితాలు చూపెట్టే అవకాశం ఉంది. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియోని సరిగ్గా గమనిస్తే, అందులో ఉన్నది  ‘Abbott Panbio COVID-19 Ag Rapid Test Device’ కరోనా టెస్ట్ కిట్ అని చూడవచ్చు.

ఏప్రిల్ 2021లోనే కొందరు పోస్ట్‌లోని వీడియోని పెట్టి, అందులో వచ్చిన టెస్ట్ ఫలితం గురించి ‘Abbott’ సంస్థను ప్రశ్నించగా, నాసికా రంధ్రాలలో నుండి సేకరించిన నమూనాలతో (Nasal swab) ఆ కరోనా టెస్ట్ కిట్ ఉపయోగించాలని, నీరు లేదా ఏదైనా ఇతర ఆహారాలు మరియు ద్రవాలతో ఉపయోగించడం కోసం ఆ టెస్ట్ కిట్‌ను రూపొందించలేదని ‘Abbott’ సంస్థ ట్వీట్ చేసారు. టెస్ట్ కిట్‌ను సరిగ్గా ఉపయోగించకుండా, తప్పుడు సమాచారం షేర్ చేయడం సరికాదని కూడా అన్నారు. ఇతర ద్రవాలు ఉపయోగిస్తే వాటి రసాయన లక్షణాల వల్ల టెస్ట్ కిట్ తప్పుడు ఫలితాలు చూపెట్టే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తాసంస్థతో ‘Abbott’ వారు తెలిపారు. ఆ టెస్ట్ కిట్‌ను ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూడవచ్చు.

‘Abbott Panbio’ కరోనా టెస్ట్ కిట్‌కి సంబంధించిన యూసర్ మాన్యువల్ చూడగా, అందులో కూడా వేరే ద్రవాలు ఉపయోగించకూడదని రాసి ఉన్నట్టు చదవచ్చు. అంతేకాదు, ఫలితం కోసం 15 నిమిషాలు వేచి ఉండాలని చెప్పారు.

కేవలం కుళాయి నీరు మాత్రమే కాదు, ఇతర పదార్థాలు మరియు ద్రవాలతో టెస్ట్ చేసి, ‘Abbott’ వారు చెప్పిన విధంగా కాకుండా ఆ టెస్ట్ కిట్‌ను వేరే విధంగా ఉపయోగిస్తే తప్పుడు ఫలితాలు ఎందుకు వస్తున్నాయో చెప్తూ రాసిన రీసెర్చ్ పేపర్‌ని ఇక్కడ చదవచ్చు.

మలమూత్ర విసర్జనల్లో మరియు మురికి నీరులో కరోనా వైరస్ ఉండే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వాలు నిర్వహించే సీరో సర్వేల్లో వాటిని పరీక్షిస్తారు. అయితే, వాటిలో ఉండే వైరస్ వల్ల కోవిడ్ సోకే అవకాశం చాలా తక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన వెబ్సైటులో రాసింది. అంతేకాదు, తాగే నీరు ద్వారా కూడా కరోనా వైరస్ సోకే అవకాశం లేదని తెలిపారు.

చివరగా, కంపెనీ వారు చెప్పినట్టు కోవిడ్ టెస్ట్ కిట్‌ను ఉపయోగించకుండా, నీరు పోసి, తప్పుడు ఫలితాలు వచ్చాయని ఫిర్యాదు చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll