Fake News, Telugu
 

చెప్పినట్టు వినకుంటే కూతుళ్ల ఖర్చులను భరించాల్సిన అవసరం తండ్రికి లేదంటూ కోర్టు తీర్పును తప్పుగా అర్ధం చేసుకున్నారు

0

తండ్రి చెప్పినట్టు వినకుంటే కూతుళ్లకు అయ్యే ఖర్చులు భరించాల్సిన అవసరం తండ్రికి ఉండదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

క్లెయిమ్: చెప్పినట్టు వినకుంటే కూతుళ్ల చదువుకు, పెళ్లికి అయ్యే ఖర్చులను భరించాల్సిన అవసరం తండ్రికి లేదు.

ఫాక్ట్(నిజం): ఒక విడాకుల కేసుకు సంబంధించి తండ్రితో ఎలాంటి సంబంధం వద్దు అని కూతురు అనుకుంది కాబట్టే సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించింది. పైగా ఈ కేసులో విడాకుల సమయంలో భార్యకు ఇచ్చే భరణంలో కూతురు చదువు, మొదలైన ఖర్చులను కూడా కోర్టు లెక్కించింది. అంతేగానీ, తండ్రికి ఇష్టం లేకుండా పెళ్లిచేసుకున్నప్పుడో లేక తండ్రి మాట వినని సందర్భాలలో ఈ తీర్పు వర్తించదు. హిందూ వారసత్వ చట్టం, 2005 ప్రకారం తండ్రి ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోయిన సందర్భాలలో, ఆస్తిలో కొడుకులతో సమానంగా కూతుళ్లకు కూడా వాటా ఉంటుంది.   కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

తండ్రితో ఎటువంటి సంబంధం వద్దు అనుకుంది కాబట్టి కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది:

18 ఏళ్లు నిండిన కూతురు తండ్రితో బంధం తెంచుకుంటే ఆమె విద్య, పెళ్లికి అయ్యే ఖర్చులను తండ్రి భరించాల్సిన అవసరం లేదంటూ 2022 మార్చ్‌లో ఒక విడాకుల కేసుకు సంబంధించి ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.

కూతురు తన తండ్రితో ఎలాంటి సంబంధం కొనసాగించడం ఇష్టం లేదని చెప్పడం వల్ల కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ‘ఒకవేళ తల్లి కోరుకుంటే, విడాకుల సమయంలో భార్యకు చెల్లించాల్సిన భరణం మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు, కూతురు పెంపకానికి అవసరమయ్యే ఖర్చును కూడా పరిగణలోకి తీసుకుంటామని’ కోర్టు తెలిపింది. అంటే కోర్టు కూతురు ఖర్చులను పరోక్షంగా తండ్రితోనే కట్టించింది.

ఈ తీర్పును రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఈ కేసులో కేవలం కూతురు తండ్రితో అసలు ఎలాంటి సంబంధం వద్దు అనుకుంది కాబట్టి ఖర్చులు తండ్రి భరించాల్సిన అవసరంలేదని కోర్టు అభిప్రాయపడింది. పైగా కేవలం కూతురికే కాక ఆ స్థానంలో కుమారుడు ఉన్నా కూడా కోర్టు అభిప్రాయం వర్తిస్తుంది.

అంతేగాని తండ్రి మాట వినకపోతే చదువు, మొదలైన ఖర్చులు భరించాల్సిన అవసరం లేదని కోర్టు ఎక్కడా అనలేదు. కేవలం తండ్రితో ఎలాంటి సంబంధం వద్దు అనుకున్న సందర్భాలలో మాత్రమే ఇది వర్తిస్తుంది. కోర్టు వేరే (విడాకుల కేసు) సందర్భంలో చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకొని ఇలా షేర్ చేస్తున్నారు. 

తండ్రి ఆస్తిలో కూతుళ్లకు వాటా ఉంటుంది:

ఇదే తీర్పును తండ్రికి  ఇష్టం లేకుండా పెళ్లిచేసుకున్నప్పుడు కూతుళ్లకు ఆస్తిలో ఎలాంటి వాటా ఉండదు అనే అర్ధంలో కూడా షేర్ చేస్తున్నారు. కాని ఈ తీర్పుకు కూతుళ్లకు ఆస్తిలో వాటాకు ఎలాంటి సంబంధం లేదు.

హిందూ వారసత్వ చట్టం, 2005 ప్రకారం తండ్రి ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోయిన సందర్భాలలో, వారసత్వంగా వచ్చిన ఆస్తిలో కొడుకులతో సమానంగా కూతుళ్లకు కూడా వాటా ఉంటుంది. ఒకవేళ తండ్రికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న కూతుళ్లకు కూడా తండ్రి ఆస్తిలో వాటా ఉంటుంది.

ఒకవేళ కూతురు తండ్రికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకని వెళ్ళిపోయినా కూడా ఆ కూతురుకి తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. ఈ మధ్య కాలంలో అనేక సందర్భాలో తండ్రి ఆస్తిలో కూతుళ్లకు వాటా ఉంటుందని కోర్టు అభిప్రాయపడ్డ ఉదాహరణలు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, చెప్పినట్టు వినకుంటే కూతుళ్ల చదువుకు/పెళ్లికి అయ్యే ఖర్చులను భరించాల్సిన అవసరం తండ్రికి లేదంటూ కోర్టు తీర్పును తప్పుగా అర్ధం చేసుకున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll