Fake News, Telugu
 

ఈ ఫొటోలోని సరస్వతి విగ్రహాం కొన్ని సంవత్సరాల క్రితమే ప్రమాదవశాత్తు ధ్వంసం అయింది, ఇప్పుడు కాదు

0

ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు, తాజాగా నరసరావుపేటలోని శృంగేరీ శంకర మఠం సమీపంలో ఉన్న సరస్వతీ విగ్రహాన్ని దారుణంగా ధ్వంసం చేసారని చెప్తూ దీనికి సంబంధించిన ఫోటో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల కాలంలో నరసరావుపేటలోని శృంగేరీ శంకర మఠం సమీపంలో ఉన్న సరస్వతీ విగ్రహాన్ని దారుణంగా ధ్వంసం చేసారు.

ఫాక్ట్ (నిజం): పోలీస్ విచారణలో కృష్ణవేణి కాలేజీ వారు ఏర్పాటు చేసుకున్న ఈ విగ్రహం కొన్ని సంవత్సరాల క్రితమే ధ్వంసమైందని తేలింది. ఆ స్థల యజమాని, కృష్ణవేణి కాలేజీ ప్రిన్సిపాల్ కూడా ఇదే చెప్పారు. గుంటూరు పోలీస్ ఇదే ధ్రువీకరిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసారు. గుంటూరు SP ప్రెస్ మీట్ లో కూడా ఇదే చెప్పారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో చెప్పిన విషయం గురించి గూగుల్ లో వెతకగా ఈ విగ్రహా ద్వంసం గురించి గుంటూరు రూరల్ పోలీస్ వారు తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇచ్చిన వివరణ మాకు కనిపించింది. ఈ ట్వీట్ లో ఆ విగ్రహం ఉన్న స్థల యజమాని మాట్లాడిన వీడియో షేర్ చేసారు, ఆ స్థల యజమాని చెప్పినదాని ప్రకారం ఈ స్థలాన్ని వారు కృష్ణవేణి కాలేజీకి లీజ్ కి ఇచ్చారు, ఐతే కాలేజీ వారు రెండేళ్ల క్రితం ఈ స్థలంలో ఉన్న బిల్డింగ్ కూల్చే క్రమంలో పోస్టులో చూపించిన విగ్రహం కూడా ధ్వంసం అయింది అని, ఈ విగ్రహo ఈ మధ్య కాలంలో ధ్వంసం అయిందన్నది పూర్తి  అవాస్తవం అని ఆ స్థల యజమాని స్పష్టం చేసాడు.

ఈ విషయంపై గుంటూరు పోలీస్ విడుదల ఒక  ప్రెస్ నోట్ విడుదల చేసారు. పోలీస్ దర్యాప్తులో భాగంగా కృష్ణవేణి కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్స్ ని సంప్రదించినప్పుడు వారు కూడా ఈ విగ్రహం నాలుగు సంవత్సరాల క్రితం ధ్వంసమైందని స్పష్టం చేసారని ఉంది. ఇంకా ఈ వార్తని ఇప్పుడు కావాలనే ఎవరో దురుద్దేశంతో ప్రచారం చేస్తున్నారని ఉంది.

ఇదే విషయం గురించి పోలీస్ వారు ప్రెస్ మీట్ లో ఇచ్చిన వివరణ వీడియో ఇక్కడ చూడొచ్చు. గుంటూరు SP ప్రెస్ మీట్ ద్వారా ఈ వివాదం గురించి ఇచ్చిన వివరణ ఇక్కడ చూడొచ్చు.  ఇదే విషయాన్నీ తెలుపుతున్న వార్త కథనం ఇక్కడ , ఇక్కడ  చూడొచ్చు.

నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ వారిని FACTLY ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు వారు కూడా ఈ విగ్రహం కొన్ని సంవత్సరాల క్రితమే ధ్వంసమైందని, ఇప్పుడు కాదని చెప్పారు.

ఇటీవలే కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని అంతర్వేదిలో గుడికి సంబంధించిన రథం కాలిపోయిన తర్వత జరిగిన సంఘటనల నేపథ్యంలో పోస్టులో ఉన్నటువంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. 

చివరగా, పోస్టులో ఉన్న విగ్రహం కొన్ని సంవత్సరాల ముందే ధ్వంసం అయింది.

Share.

About Author

Comments are closed.

scroll