దగ్గు టానికును పాలలో కలిపి తాగించడం వలన ఒక తల్లి ప్రమాదవశాత్తు తన నలుగురు పిల్లలని చంపుకుందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. దగ్గు సిరప్, పాల మిశ్రమం విషపూరితమైనదని క్లినికల్ పరిక్షలలో నిర్ధారించినట్టు ఈ పోస్టులో తెలుపుతున్నారు. పాలలో ఎటువంటి రసాయన పదార్ధాలను కలిపినా అది విషపూరితమవుతుందని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: దగ్గు టానికును పాలలో కలిపి తాగించడం వలన ఒక తల్లి ప్రమాదవశాత్తు తన నలుగురు పిల్లలని కోల్పోయింది.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో, 2019లో శ్రీలంక కోలంబోలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడులలో తమ బంధువులని కోల్పోయి విషాదంలో ఉన్న భాదితుల దృశ్యాలని చూపిస్తుంది. దగ్గు సిరప్‌ని పాలలో కలిపి ఇవ్వడం వలన నలుగురు పిల్లలు చనిపోయినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు. పాలలో దగ్గు టానిక్ లేదా మరే ఇతర డ్రగ్స్ కలిపి తీసుకోవడం వలన ఔషధాలు తమ సమర్ధత కోల్పోయి శరీరంలో ఫార్మోకోకేనిటిక్స్ రియాక్షన్లు పెంపొందించే అవకాశాలున్నట్టు వైద్యులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రోగి అసహనతకు గురి కావడం లేదా వాంతులు చేసుకునే అవకాశముందని వైద్యులు నిర్ధారించారు. కానీ, దగ్గు సిరప్-పాల మిశ్రమం విషపూరితమైనదని, ఈ మిశ్రమం తీసుకున్న వారి శరీరం విషపూరితమై చనిపోతారనే సమాచారంలో నిజం లేదని వైద్యులు స్పష్టం చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించి వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే, దగ్గు టానికును పాలలో కలిపి ఇవ్వడం ద్వారా ఒక తల్లి తన నలుగురు పిల్లలని కోల్పోయిందని రిపోర్ట్ చేస్తూ ఎటువంటి వార్తా లేదు. పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Reuters’ వార్తా సంస్థ 23 ఏప్రిల్ 2019 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసిందని తెలిసింది. 2019 ఏప్రిల్ నెలలో శ్రీలంక దేశం కోలంబోలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడులలో తమ బంధువులని కోల్పోయి విషాదంలో ఉన్న భాదితుల దృశ్యాలని ఈ ఫోటో చూపిస్తుంది. ఈ ఫోటోని ఇదే వివరణతో మరికొన్ని వార్తా సంస్థలు కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
దగ్గు సిరప్‌ని పాలలో కలపడం ద్వారా అది విషపూరితమయ్యే అవకాశముందా అని ఇంటర్నెట్లో వెతికితే, మెడికల్ డ్రగ్స్ మరియు పాల యొక్క మిశ్రమం ఫలితాలని తెలుపుతూ ‘Clinical Therapeutics’ వెబ్సైటు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. మెడికల్ డ్రగ్స్‌ని ఆహార పదార్ధాలలో కలిపి తీసుకోవడం ద్వారా ఆ ఔషధం తన సమర్ధత కోల్పోయే అవకాశముందని ఈ ఆర్టికల్‌లో తెలిపారు. డ్రగ్స పాలలో కలిపి తీసుకోవడం ద్వార శరీరంలో ఔషధాల ప్రభావ ప్రక్రియ దెబ్బతిని శరీరంలో ఫార్మోకోకేనిటిక్స్ రియాక్షన్లు పెంపొందించే అవకాశమున్నట్టు తెలిపారు. దీని వలన రోగిలో చికిత్స వైఫల్యం అయి అదనపు చికిత్స తీసుకోవలిసిన అవసరం పడుతుందని ఆర్టికల్‌లో తెలిపారు. ఇదే విషయాన్నీ ‘Science Direct’ వెబ్సైటు కూడా తమ ఆర్టికల్‌లో తెలిపింది. మెడికల్ డ్రగ్స్‌ని పాలలో కలపితే విషపూరితమవుతుందని ఈ ఆర్టికల్స్‌లో ఎక్కడా రిపోర్ట్ చేయలేదు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సమాచారానికి సంబంధించిన స్పష్టత కోసం ‘AFP ఫాక్ట్-చెకింగ్’ సంస్థ పలు డాక్టర్లను, వైద్య పరిశోధకులను సంప్రదించింది. దగ్గు సిరప్‌ని పాలలో కలిపి తాగడం ద్వారా రోగి అసహనతకు లోనవ్వడం లేదా వాంతులు చేసుకునే అవకాశాలున్నాయని వైద్య పరిశోధకులు ‘AFP’తో తెలిపారు. కానీ, ఈ మిశ్రమం మనుషుల ప్రాణాలు తీసేంత విషపూరితమైనది కాదని డాక్టర్లు స్పష్టం చేసారు. ఈ వివరాల ఆధారంగా, దగ్గు టానికుని పాలలో కలిపి తాగితే శరీరం విషపూరితమై చనిపోతరనే వాదన తప్పని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, దగ్గు సిరప్‌ని పాలలో కలిపి తాగడం వలన ఔషధ శక్తి తగ్గిపోయి రోగి అసహనతకు లోనయ్యే అవకాశాలున్నాయి. కాని, ఈ మిశ్రమం విషపూరితమైనది మాత్రం కాదు.