“అఫ్గానిస్థాన్‌లో కొత్త చట్టం: మొబైల్ ఫోన్‌లు నిషేదించబడ్డాయి. మొబైల్‌లను స్వచ్చందంగా తాలిబాన్‌కు అప్పగించాలి. మొబైల్‌తో దొరికిన ఎవరైనా మరణశిక్షను ఎదుర్కొంటారు”, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అఫ్గానిస్థాన్‌లో మొబైల్ ఫోన్‌లను పూర్తిగా నిషేదించడంతో వాటిని అఫ్గాన్ అధికారులు ధ్వంసం చేస్తున్న వీడియో.
ఫాక్ట్: వీడియో అఫ్గానిస్థాన్‌కి సంబంధించింది కాదు. వీడియోలో పాకిస్థాన్ కస్టమ్ అధికారులు స్వాధీనం చేసుకున్న అక్రమ నిషిద్ధ వస్తువులను ధ్వంసం చేస్తున్నారు. అంతేకాదు, అఫ్గానిస్థాన్‌లో మొబైల్ ఫోన్‌లను పూర్తిగా నిషేదించినట్టు ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని వీడియోలో ఉన్న అధికారుల యూనిఫాం సరిగ్గా గమనిస్తే, యూనిఫాం మీద పాకిస్థాన్ లోగో ఉన్నట్టు చూడవచ్చు.

కొన్ని కీ-వర్డ్స్ సహాయంతో ఇంటర్నెట్‌లో వెతకగా, అలాంటి చాలా వీడియోలు (వెనకాల అదే నీలం రంగు కంటైనర్ ఉన్న వీడియోలు) సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చాయి. వాటిలో కొన్ని వీడియోలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. పాకిస్థాన్ కస్టమ్ అధికారులు (యూనిఫాం మీద లోగో గమనించవచ్చు) స్వాధీనం చేసుకున్న అక్రమ నిషిద్ధ వస్తువులను ధ్వంసం చేస్తున్నట్టు ఆ వీడియోల వివరణల్లో చదవచ్చు. అక్రమంగా తరలించడానికి చూసిన నిషిద్ధ వస్తువులను ధ్వంసం చేయటానికి అధికారులు అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని, వీడియోలో ఉన్నది అలాంటి ఒక కార్యక్రమం అని తెలిసింది. ఆ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.

అంతేకాదు, అఫ్గానిస్థాన్‌లో మొబైల్ ఫోన్‌లను పూర్తిగా నిషేదించినట్టు ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. కొన్ని ప్రదేశాల్లో మాత్రం కొన్ని పరిమితులు ఉన్నట్టు వార్తసంస్థలు రిపోర్ట్ చేసాయి. అంతేకానీ, దేశం మొత్తం నిషేధం ఉన్నట్టు ఎవరూ రిపోర్ట్ చేయలేదు.
చివరగా, పాక్ అధికారులు అక్రమ నిషిద్ధ వస్తువులను ధ్వంసం చేస్తున్న వీడియోని, ‘అఫ్గానిస్థాన్‌లో మొబైల్ ఫోన్‌లు నిషేదించబడ్డాయి’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.