యోగి అదిత్యనాథ్ పాలనలో ఉత్తర ప్రదేశ్ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండగా కె. చంద్రశేఖరరావు పాలనలో మాత్రం తెలంగాణ ₹5 లక్షల కోట్లు అప్పులు ఉన్న రాష్ట్రంగా మారిందని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: యోగి అదిత్యనాథ్ పాలనలో ఉత్తర ప్రదేశ్ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండగా కె. చంద్రశేఖరరావు పాలనలో తెలంగాణ ₹5 లక్షల కోట్లు అప్పులు ఉన్న రాష్ట్రంగా మారింది.
ఫాక్ట్: ఉత్తర ప్రదేశ్ రెవెన్యూ మిగులు గణాంకాలను, తెలంగాణ రాష్ట్ర అప్పుల గణాంకాలతో పోల్చడం సరైన విధానం కాదు. అవి రెండూ వేరు వేరు ఆర్థిక కొలమానాలు. RBI గణాంకాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ 2020-21 లో రెవెన్యూ లోటుని నమోదు చేయగా తెలంగాణ 2019-20, 2020-21 రెవెన్యూ లోటు రాష్ట్రంగా ఉంది. 2022-23 బడ్జెట్ అంచనా ప్రకారం(కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు కాకుండా), ఉత్తరప్రదేశ్ అప్పు ₹7.1 లక్షల కోట్ల రూపాయలుగా ఉండగా, తెలంగాణ అప్పు ₹3.66 లక్షల కోట్లుగా ఉంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా, ఒక రాష్ట్రం యొక్క రెవెన్యూ మిగులుని (Revenue Surplus) మరొక రాష్ట్రం యొక్క అప్పుతో పోల్చి చూడటం సరైన విధానం కాదు, ఎందుకంటే రెండూ వేరు వేరు ఆర్థిక కొలమానాలు. ఈ కథనం ద్వారా యోగి అదిత్యనాథ్ & కేసీఆర్ పాలనలలో ఉత్తర ప్రదేశ్ & తెలంగాణలు ఎలాంటి వృద్ధిని నమోదు చేశాయో ఇప్పుడు చూద్దాం.
రెవెన్యూ మిగులు/లోటు:
ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఖర్చు కంటే ఎక్కువ ఉంటే, ఆ మిగిలిన సొమ్ముని రెవెన్యూ మిగులు అంటారు. అలాగే, ఒకవేళ ఖర్చు ఆదాయం కంటే ఎక్కువ ఉంటే, ఆ వ్యత్యాసాన్ని రెవెన్యూ లోటుగా పరిగణిస్తారు. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం 2006-07 నుంచే, అనగా యోగి అదిత్యనాథ్ ముఖ్యమంత్రి అవ్వడానికి దాదాపు పదేళ్ల ముందు నుంచే రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని ఇక్కడ చూడవచ్చు. ఇక RBI, CAG నివేదికల ప్రకారం యోగి మరియు కేసీఆర్ పాలనలో ఇరు రాష్ట్రాల రెవెన్యూ మిగులు/లోటు వివరాలను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
రెవెన్యూ మిగులు(+)/ లోటు(-) (కోట్ల రూపాయలలో)
ఆర్థిక సంవత్సరం | ఉత్తర ప్రదేశ్ | తెలంగాణ |
2014-15 | +22,390* | +370 |
2015-16 | +14,340* | +240 |
2016-17 | +20,283* | +1,390 |
2017-18 | +12,552 | +3,459 |
2018-19 | +28,520 | +4,337 |
2019-20 | +67,560 | -6,254 |
2020-21 | -2,367 | -22,298 |
2021-22 | +22,107 (సవరించిన అంచనా) | +4,395 (సవరించిన అంచనా) |
2022-23 | +43,127 (బడ్జెట్ అంచనా) | +3,754 (బడ్జెట్ అంచనా) |
పై గణాంకాలను బట్టి, ఉత్తర ప్రదేశ్ 2020-21 లో రెవెన్యూ లోటుని నమోదు చేసిందని, తెలంగాణ 2019-20, 2020-21 లలో రెవెన్యూ లోటుని నమోదు చేసిందని చెప్పవచ్చు.
అప్పు:
ఇక రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవసరాల కోసం వివిధ మార్గాలలో అప్పులు చేస్తూ ఉంటాయి. అయితే గత ప్రభుత్వాలు చేసిన అప్పులు కూడా ప్రస్తుతం చేసిన అప్పులకు జత చేయబడతాయి. RBI తాజా నివేదిక ప్రకారం, యోగి మరియు కేసీఆర్ పాలనలో ఇరు రాష్ట్రాల అప్పులు ఏ మేరకు పెరిగాయో ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
మొత్తం అప్పులు (కోట్లలో రూపాయలలో):
ఆర్థిక సంవత్సరం | ఉత్తర ప్రదేశ్ | తెలంగాణ |
2014-15 | 3,14,072* | 72,658 |
2015-16 | 3,85,337* | 90,523 |
2016-17 | 4,73,348* | 81,820 |
2017-18 | 5,17,584 | 1,60,296 |
2018-19 | 5,67,777 | 1,90,202 |
2019-20 | 5,49,559 | 2,25,418 |
2020-21 | 6,00,109 | 2,71,259 |
2021-22 | 6,43,586 (సవరించిన అంచనా) | 3,14,135 (సవరించిన అంచనా) |
2022-23 | 7,10,209 (బడ్జెట్ అంచనా) | 3,66,306 (బడ్జెట్ అంచనా) |
గమనిక: వివిధ కార్పొరేషన్ల ద్వారా రాష్ట్రాలు చేసిన అప్పుని ఈ గణాంకాలలో RBI జతచేయలేదు.
పై గణాంకాలను బట్టి, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం తరహాలో అప్పులు చేసిందని చెప్పవచ్చు.
Debt to GSDP ratio (అప్పు, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తుల నిష్పత్తి):
RBI గణాంకాల ప్రకారం, ఉత్తర ప్రదేశ్ మరియు తెలంగాణల ‘Debt to GSDP ratio’ ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
ఆర్థిక సంవత్సరం | ఉత్తర ప్రదేశ్ | తెలంగాణ |
2015-16 | 33.9* | 15.7 |
2016-17 | 36.7* | 12.4 |
2017-18 | 35.9 | 21.4 |
2018-19 | 35.9 | 22.2 |
2019-20 | 32.3 | 23.7 |
2020-21 | 36.4 | 28.2 |
2021-22 | 34.5 | 27.4 |
2022-23 | 32.6 | 28.2 |
పై గణాంకాలని బట్టి, యోగి అదిత్యనాథ్ పాలనలో ఉత్తర ప్రదేశ్ Debt to GSDP ratio మెరుగుపడిందని చెప్పవచ్చు.అయితే, ఈ సూచికలో ప్రస్తుతం తెలంగాణ ఉత్తర ప్రదేశ్ కంటే మెరుగ్గా ఉంది.
చివరిగా, ఉత్తర ప్రదేశ్ రెవెన్యూ మిగులు గణాంకాలను, తెలంగాణ రాష్ట్ర అప్పుల గణాంకాలతో పోల్చడం సరైన విధానం కాదు.