Fake News, Telugu
 

12 శాతం జీఎస్టీ అనేది కేవలం ప్రైవేటు హాస్టళ్లలో మాత్రమే, విద్యాసంస్థలు నిర్వహించే హాస్టళ్లలో ప్రస్తుతం జీఎస్టీ మినహాయింపు కొనసాగుతుంది.

0

మీరు హాస్టల్‌లో ఉంటున్నారా, అయితే 12 శాతం జీఎస్టీ కట్టాల్సిందే అన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. విద్యార్థులు ఇకపై హాస్టల్‌ వసతికి మరింత ఫీజు చెల్లించాలి, హాస్టల్‌ అకామిడేషన్‌కు చెల్లించే అద్దెపై 12 శాతం జీఎస్టీ వర్తిస్తుందని అథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ వెల్లడించిందని ఈ పోస్టులో చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించిన వివరాలు చూద్దాం.

క్లెయిమ్: హాస్టల్‌లో ఉండే విద్యార్థులు ఇకపై హాస్టల్‌ అద్దెపై 12 శాతం జీఎస్టీ చెల్లించాలి.

ఫాక్ట్(నిజం): జులై 2022లో చేసిన సవరణల అనంతరం ప్రైవేటు హాస్టళ్లు, పీజీలకు జీఎస్టీ మినహాయింపు కొనసాగదని, ఇప్పటి నుండి ఇవి కూడా 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని ఇటీవల కర్ణాటక మరియు ఉత్తరప్రదేశ్ ఏఏఆర్‌ బెంచ్‌లు తీర్పును ఇచ్చాయి. ఐతే ఈ తీర్పు కేవలం ప్రైవేటు హాస్టళ్లు, పీజీలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ తీర్పులలో ఎక్కడ కూడా విద్యాసంస్థలు నిర్వహించే హాస్టళ్ల గురించి ప్రస్తావించలేదు. ఐతే జీఎస్టీ మొదలైనప్పటి నుండే విద్యాసంస్థలు నిర్వహించే హాస్టళ్లకు మినహాయింపు వర్తిస్తూ వచ్చింది. ప్రస్తుతం కూడా ఇదే కొనసాగుతుంది. ఐతే ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వార్త అసంపూర్ణంగా ఉండడంతో ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది.

ఇటీవల అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్‌) కర్ణాటక బెంచ్‌ ఒక కేసు విచారణ సంబంధించిన హాస్టళ్లు, పీజీలను నివాస గృహాలకు సమానంగా చూడలేమని స్పష్టం చేస్తూ, వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపు లేదని, 12 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తీర్పు చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వార్త ఈ తీర్పు నుండి సేకరించిందే.

రెండు నెలలకు ముందు  ఉత్తరప్రదేశ్ బెంచ్ కూడా ఇలాంటి తీర్పునే ఇచ్చింది. జులై 2022 నుండి రోజుకు వెయ్యి రూపాయలు వసూలు చేసే హాస్టళ్లను నివాస గృహాలకు పరిగణించి జీఎస్టీ మినహాయింపు ఇవ్వడం కుదరదని స్పష్టం చేస్తూ. ఇవి 12 శాతం జీఎస్టీ చెల్లించాలని తీర్పునిచింది.

ఐతే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇది కర్ణాటక మరియు ఉత్తరప్రదేశ్ ఏఏఆర్‌ రులింగ్ మాత్రమే, ఈ తీర్పు ఈ రెండు ఏఏఆర్‌ పరిధిలోనే వర్తిస్తుంది, దేశవ్యాప్తంగా కాదు. అలాగే ప్రభుత్వం(జీఎస్టీ కౌన్సిల్) కావాలనుకుంటే సవరణ చేసి వీటికి మినహాయింపు కొనసాగించవచ్చు. ఐతే ప్రస్తుతం ప్రభుత్వం ఇలాంటి నిర్ణయమైతే ఏది తీసుకోలేదు.

అంతకు ముందు మినహాయింపు ఉండేది:

2017 జీఎస్టీ రూల్స్ (నోటిఫికేషన్ 12/2017- ఎంట్రీ నం 12 & 14) కింద రోజుకు వెయ్యి రూపాయల వరకు వసూలు చేసే హాస్టళ్లు, పీజీలు, హోటళ్లు, క్లబ్బులు, క్యాంప్‌సైట్లు, మొదలైనవాటికి జీఎస్టీ మినహాయింపు ఇవ్వడంతో ఇవన్ని జీఎస్టీ చెల్లించేవి కాదు. ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాలలో స్పష్టం చేసింది.

ఐతే జులై 2022లో జీఎస్టీ రూల్స్‌కు సవరణలు చేసిన ప్రభుత్వం, మినహాయింపులకు సంబంధించి ఎంట్రీ నం.14ను (హోటళ్లు, క్లబ్బులు, క్యాంప్‌సైట్లు, మొదలైనవి) పూర్తిగా తొలగించింది. అంటే ఇక నుండి వీటికి జీఎస్టీ మినహాయింపు వర్తించదు. అలాగే ఈ సవరణలో ఎంట్రీ నం.12 కింద మినహాయింపు పొందే హాస్టళ్లు, పీజీలకు షరతులు విధించింది. ఇక నుండి రిజిస్టర్ అయ్యిన వ్యక్తి/సంస్థ 12 శాతం జీఎస్టీ కట్టాల్సిందే. రిజిస్టర్ కాని వ్యక్తి/సంస్థలకు మాత్రమే ఈ ఎంట్రీ కింద జీఎస్టీ మినహాయింపు ఉంటుంది.

పైన తెలిపిన కర్ణాటక మరియు ఉత్తరప్రదేశ్ ఏఏఆర్‌ తీర్పులు కూడా 2022లో చేసిన ఈ సవరణలను విశ్లేషిస్తూ చేసినవే. 2022 సవరణల కన్నా ముందు పొందిన జీఎస్టీ మినహాయింపులను సమర్థిస్తునే, ఈ సవరణల అనతరం హాస్టళ్లు, పీజీలు, హోటళ్లు, క్లబ్బులు, క్యాంప్‌సైట్లకు జీఎస్టీ మినహాయింపు వర్తించదని, ఇక నుండి ఇవి 12 శాతం జీఎస్టీ చెల్లించాలని పేర్కొంది.

ఒక హాస్టల్ లేదా భవనంలో ఎక్కువ మంది ఉండి, వారికి వేరుగా కిచెన్ లేకపోతే సాధారణ నివాసాలుగా పరిగణించలేమని , అవి నాన్ రెసిడెన్షియల్ కేటగిరీ కిందకు వస్తాయని కర్ణాటక ఏఏఆర్ స్పష్టం చేసింది. కాబట్టి అవి జీఎస్టీ చెల్లించాలని పేర్కొంది.

విద్యాసంస్థల హాస్టళ్లకు ఈ తీర్పు వర్తించదు:

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ తీర్పులలో ఎక్కడ కూడా విద్యాసంస్థలు నిర్వహించే హాస్టళ్ల గురించి ప్రస్తావించలేదు. ఈ రెండు కేసులు కూడా ప్రైవేటు హాస్టళ్లు దాఖలు చేసినవే. కోర్టు కూడా ప్రైవేటు హాస్టళ్ల నేపథ్యంలోనే ఈ తీర్పును వెల్లడించాయి. ఒకవేళ విద్యాసంస్థలు నిర్వహించే హాస్టళ్లకు కూడా ఇది వర్తిస్తుంది అంటే తీర్పులో ఈ అంశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించే వారు, కాని అలాంటి ప్రస్తావన ఏది ఈ తీర్పులో లేదు.

ఇకపోతే విద్యాసంస్థలు నిర్వహించే హాస్టల్ సేవలకు మొదటి నుండే జీఎస్టీ మినహాయింపు వర్తిస్తూ వచ్చింది. నోటిఫికేషన్ 12/2017- ఎంట్రీ నం.66 (ఒక విద్యా సంస్థ దాని విద్యార్థులు, సభ్యులు మరియు సిబ్బందికి అందించే సేవలు) కింద జీఎస్టీ మినహాయింపు పొందేవి. ప్రస్తుతం కూడా ఇదే మినహాయింపు కొనసాగుతుంది.  విద్యాసంస్థలు నిర్వహించే హాస్టల్ సేవలకు జీఎస్టీ మినహాయింపుకు సంబంధించి ఎలాంటి విద్యాసంస్థలకు ఇది వర్తిస్తుంది మొదలైన  సమాచారం ఇక్కడ చూడొచ్చు.

దీన్నిబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వార్త అసంపూర్ణంగా ఉందని, ఈ వార్త కేవలం ప్రైవేటు హాస్టళ్లకు మాత్రమే వర్తిస్తుందని, విద్యాసంస్థలు నిర్వహించే హాస్టళ్లకు కాదని కచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 12 శాతం జీఎస్టీ అనేది కేవలం ప్రైవేటు హాస్టళ్ల మాత్రమే, విద్యాసంస్థలు నిర్వహించే హాస్టళ్ల ప్రస్తుతం జీఎస్టీ మినహాయింపు కొనసాగుతుంది.

Share.

About Author

Comments are closed.

scroll