యోగి ఆదిత్యనాథ్ పాలనలో కొత్త పన్నులు విధించకుండానే దేశంలో మిగులు నిధులున్న ఒకే ఒక రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్ అవతరించిందని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: యోగి ఆదిత్యనాథ్ పాలనలో దేశంలో మిగులు నిధులున్న ఒకే ఒక రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్ అవతరించింది.
ఫాక్ట్: కాగ్ నివేదికల ప్రకారం, 2006-07 నుంచే ఉత్తర ప్రదేశ్ రెవెన్యూ మిగులుని నమోదు చేసే రాష్ట్రంగా ఉంది.పైగా, RBI తాజా గణాంకాల ప్రకారం 2020-21లో ఉత్తరప్రదేశ్ రెవెన్యూ లోటు ₹2,367 కోట్లు కాగా ఒడిశా, ఢిల్లీ, మణిపూర్, అస్సాం వంటి రాష్ట్రాలు రెవెన్యూ మిగులుని నమోదు చేశాయి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) & CAG ప్రతిఏటా విడుదల చేసే వివిధ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నివేదికల ప్రకారం, ఉత్తర ప్రదేశ్ 2006-07 నుంచి రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉంది. 2006 నుంచి ఉత్తరప్రదేశ్‌కి చెందిన రెవెన్యూ మిగులు గణాంకాలను ఈ క్రింద పట్టికలో చూడవచ్చు.
ఆర్థిక సంవత్సరం | రెవెన్యూ మిగులు(+)/ లోటు(-) (కోట్లలో) |
2006-07 | +4,901 |
2007-08 | +3,499 |
2008-09 | +1,862 |
2009-10 | +7,047 |
2010-11 | +3,510 |
2011-12 | +6,980 |
2012-13 | +5,180 |
2013-14 | +10,070 |
2014-15 | +22,390 |
2015-16 | +14,340 |
2016-17 | +20,283 |
2017-18 | +12,552 |
2018-19 | +28,520 |
2019-20 | +67,560 |
2020-21 | -2,367 |
2021-22 | +22,107(సవరించిన అంచనా) |
2022-23 | +43,127(బడ్జెట్ అంచనా) |
పై గణాంకాలను బట్టి, యోగి ఆదిత్యనాథ్ 2017లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాకముందు నుంచే ఉత్తరప్రదేశ్ రెవెన్యూ మిగులు కలిగిన రాష్ట్రంగా ఉందని నిర్ధారించవచ్చు. పైగా RBI తాజా గణాంకాల ప్రకారం, 2020-21 సంవత్సరానికి గాను ఉత్తరప్రదేశ్ రెవెన్యూ లోటుని నమోదు చేయగా ఒడిశా, ఢిల్లీ, మణిపూర్, అస్సాం రాష్ట్రాలు రెవెన్యూ మిగులుని నమోదు చేశాయి.
చివరిగా, యోగి అదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాక ముందు నుంచి రెవెన్యూ మిగులు నమోదు చేసే రాష్ట్రంగా ఉంది.