Fake News, Telugu
 

రాహుల్ గాంధీ పాదాలకు నమస్కరిస్తున్నట్టుగా కనిపిస్తున్న ఈ ఫోటోలోని వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు మోతీలాల్ వోరా కాదు

0

92 ఏళ్ల కాంగ్రెస్ నాయకుడు మోతీలాల్ వోరా, 50 ఏళ్ల రాహుల్ గాంధీ పాదాలపై పడి నమస్కరిస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కుటుంబపాలన మరియు పార్టీ నాయకులు నెహ్రూ కుటుంబానికి చేస్తున్న బానిసత్వాన్ని వివరించేందుకు ఈ ఒక్క ఫోటో చాలని పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

క్లెయిమ్: 92 ఏళ్ల కాంగ్రెస్ నాయకుడు మోతీలాల్ వోరా, 50 ఏళ్ల రాహుల్ గాంధీ పాదాలపై పడి నమస్కరిస్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో రాహుల్ గాంధీ పాదాలకు నమస్కరిస్తున్నట్టుగా కనిపిస్తున్నది ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నాయకుడు త్రీభువనేశ్వర్ సరన్ సింగ్ డియో (టిఎస్ సింగ్ డియో), మోతీలాల్ వోరా కాదు. 2018 డిసెంబర్ నెలలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ పట్టుకున్న పుష్పగుచ్చం నుండి కింద పడిపోయిన ధారాన్ని టిఎస్ సింగ్ డియో తీస్తుండగా ఈ ఫోటో తీసినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన ఫోటో కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఈ ఫోటోని ఇదే క్లెయింతో 2019 నుండి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే, 2019లో పెట్టిన కొన్ని పోస్టులలోని కామెంట్ సెక్షన్లో, ఈ ఫోటోలో రాహుల్ గాంధీ పాదాలకు నమస్కరిస్తున్నట్టుగా కనిపిస్తున్నది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన త్రీభువనేశ్వర్ సరన్ సింగ్ డియో (టిఎస్ సింగ్ డియో అని పిలుస్తారు) అని కొందరు యూసర్లు తెలిపారు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ పత్రిక వార్త సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ (ఆర్కైవ్డ్) దొరికింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 17 డిసెంబర్ 2018 నాడు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ ఫోటో తీసినట్టు తెలిసింది. రాహుల్ గాంధీ కాలి కింద పడిన ధారాన్ని టిఎస్ సింగ్ డియో తీస్తుండగా ఈ ఫోటో తీసినట్టు పత్రిక వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

ఈ సంఘటన జరిగినప్పుడు తాను అక్కడే ఉన్నానని, మన్మోహన్ సింగ్ పట్టుకున్న పుష్పగుచ్ఛం నుండి కింద పడిపోయిన ఒక ధారాన్ని టిఎస్ సింగ్ డియో తీస్తుండగా ఈ ఫోటో తీశారని ఒక సీనియర్ జర్నలిస్ట్ Quint వార్తా సంస్థకు స్పష్టం చేశారు.

అయితే, 17 డిసెంబర్ 2018 నాడు ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత టిఎస్ సింగ్ డియో రాహుల్ గాంధీ పాదాలకు నమస్కరించడానికి ప్రయత్నించగా, రాహుల్ గాంధీ అతన్ని ఆపి కరచాలనం ఇచ్చారు. ఈ విషయాన్ని టిఎస్ సింగ్ డియో పలు వార్తా సంస్థలుకు కూడా వివరించారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు మోతీలాల్ వోరా 92 ఏళ్ల వయసులో 21 డిసెంబర్ 2020 నాడు మరణించారు. ఈ ఫోటోలో రాహుల్ గాంధీ పాదాలకు నమస్కరిస్తున్నట్టుగా కనిపిస్తున్నది ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నాయకుడు టిఎస్ సింగ్ డియో, మోతీలాల్ వోరా కాదని అనేక వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, రాహుల్ గాంధీ పాదాలకు నమస్కరిస్తున్నట్టుగా కనిపిస్తున్న ఈ ఫోటోలోని వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు మోతీలాల్ వోరా కాదు.

Share.

About Author

Comments are closed.

scroll