Fake News, Telugu
 

పూరి జగన్నాథ్‌ను ఉద్దేశిస్తూ వి.వి.వినాయక్ చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్‌కు ఆపాదిస్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ప్రముఖ సినిమా దర్శకుడు వి.వి.వినాయక్ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని, వైసీపీ తరుపున ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందంటూ పలు వార్తసంస్థలు రిపోర్ట్ చేశాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలో వి.వి.వినాయక్ తనకు మరో జన్మంటూ వుంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ లాగా పుట్టాలని ఉంది అని ఒక ఇంటర్వ్యూలో అన్నట్టు సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మరో జన్మంటూ వుంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ లాగా పుట్టాలని ఉంది – దర్శకుడు వి.వి.వినాయక్.

ఫాక్ట్ (నిజం): ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు వి.వి.వినాయక్ పూరి జగన్నాథ్‌ను ఉద్దేశిస్తూ “మరో జన్మంటూ వుంటే జగన్ లాగా పుట్టాలని ఉంది” చేసిన వ్యాఖ్యలను ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు తప్పుగా ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఈ వైరల్ క్లెయిమ్ యొక్క నిజానిజాల్ని తెలుసుకోవటానికి ఇంటర్నెట్లో వెతకగా, ఇవే దృశ్యాలు కలిగిన 4 నిమిషాల నిడివిగల వీడియోని ‘iDream Media’ అనే యూట్యూబ్ మీడియా సంస్థ 12 జనవరి 2016న పబ్లిష్ చేసినట్టు తెలిసింది. పూర్తి ఇంటర్వ్యూ వీడియో చూడగా యాంకర్ వి.వి.వినాయక్ ను ఎస్ఎస్ రాజమౌళి, పూరి జగన్నాథ్‌లతో ఉన్న అనుబంధం గురించి ప్రశ్న అడగగా “మరో జన్మంటూ వుంటే జగన్ లాగా పుట్టాలని ఉంది” అని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను గమనిస్తే వి.వి.వినాయక్  వైరల్ వీడియోలో ఉన్న అదే దుస్తులను ధరించారు. దీన్ని బట్టి వి.వి.వినాయక్, డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ను గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు అని అర్థం అవుతుంది.

చివరగా, ‘మరో జన్మంటూ వుంటే జగన్‌లా పుట్టాలని ఉంది’ అని వి.వి.వినాయక్ పూరి జగన్నాథ్‌ను ఉద్దేశిస్తూ అన్నారు, సీఎం జగన్‌కు ఉద్దేశిస్తూ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll