Fake News, Telugu
 

ఉగ్రదాడులకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు పాకిస్తాన్ జెండాకు నిప్పంటిచ్చిన పాత ఫోటోను RSS కార్యకర్తలు జాతీయ జెండాను కాల్చారంటూ షేర్ చేస్తున్నారు

0

RSS వాళ్ళు గాంధీ వర్ధంతి రోజు జాతీయ జెండాను కాల్చారంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ ఫోటోలో కాషాయ కొండువాలు ధరించి గాడ్సే ఫోటోలు ప్రదర్శిస్తున్న కొందరు వ్యక్తులు జాతీయ జెండాకు నిప్పంటించడం గమనించొచ్చు. ఈ కథనం ద్వారా ఆ ఫోటోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: RSS కార్యకర్తలు గాంధీ వర్ధంతి రోజు జాతీయ జెండాను కాల్చి వేడుక చేసుకుంటున్న ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటో డిజిటల్‌గా మార్ఫ్ చేసింది. 2015లో ఉగ్రదాడులకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు పాకిస్తాన్ జెండాకు నిప్పంటించి నిరసన తెలుపుతున్న ఫోటోను డిజిటల్‌గా మార్ఫ్ చేసి పాకిస్తాన్ జెండా స్థానంలో భారత జెండాను చేర్చారు. పైగా ఈ ఫొటోకు గాంధీ వర్ధంతికి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టు కాషాయ కండువాలు ధరించిన కొందరు వ్యక్తులు ఒక జెండాకు నిప్పంటిస్తున్నది నిజమే అయినప్పటికీ, వాళ్ళు కలుస్తున్నది పాకిస్తాన్ జెండాను, భారత జెండాను కాదు. ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటో డిజిటల్‌గా మార్ఫ్ చేసింది. పైగా ఈ ఫొటోకు గాంధీ వర్ధంతికి ఎటువంటి సంబంధం లేదు.

ఈ ఫోటో కోసం వెతికే క్రమంలో ఇదే ఫోటోను 2016లో రిపోర్ట్ చేసిన ఒక వార్తా కథనం మాకు లభించింది. ఈ కథనం ప్రకారం ఇది మార్ఫ్ చేసిన ఫోటో. శివసేన కార్యకర్తలు గతంలో పాకిస్తాన్ జెండాను కాల్చి నిరసన తెలిపిన ఫోటోను డిజిటల్‌గా మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారన్నది ఈ వార్త సారాంశం.

ఈ కథనం ఆధారంగా వెతకగా జమ్ముకాశ్మీర్ శివసేన ఫేస్‌బుక్‌ పేజీ ఇవే ఫోటోలను 28 జూలై 2015నాడు షేర్ చేసిన పోస్ట్ కనిపించింది. పంజాబ్‌లోని దీనానగర్ గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా శివసేన జమ్ముకాశ్మీర్ యూనిట్ జమ్మూ-పఠాన్‌కోట్ జాతీయ రహదారిని దిగ్బంధించింది అంటూ ఇలాంటి ఫోటోలను షేర్ చేసారు. ఈ ఫోటోలలో శివసేన కార్యకర్తలు పాకిస్తాన్ జెండాకు నిప్పంటిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ ఫోటోను ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటోతో పోలిస్తే, 2015 నాటి ఫోటోని డిజిటల్‌గా మార్ఫ్ చేసి పాకిస్తాన్ జెండా స్థానంలో భారత జెండాను చేర్చినట్టు అర్ధమవుతుంది. అలాగే అసలు ఫోటోలో గాడ్సే ప్లకార్డ్ కూడా లేదు, అంటే దీన్ని కూడా డిజిటల్‌గా జోడించారని అర్ధమవుతుంది. శివసేన కార్యకర్తలు ఉగ్రదాడులకు నిరసనగా జమ్మూ-పఠాన్‌కోట్ జాతీయ రహదారిని దిగ్బంధించినట్టు వార్తా కథనాలు కూడా రిపోర్ట్ చేసాయి. ఈ సమాచారం బట్టి ఆ నిరసనలకు, గాంధీ వర్ధంతికి ఎటువంటి సంబంధం లేదని  స్పష్టమవుతుంది.

చివరగా, ఉగ్రదాడులకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు పాకిస్తాన్ జెండాకు నిప్పంటిచ్చిన పాత ఫోటోను RSS కార్యకర్తలు జాతీయ జెండాను కాల్చారంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll