Fake News, Telugu
 

జగిత్యాలలో ఆటోలో తరలించిన EVMలు ఓటర్ల అవగాహనకి ఉపయోగించే డెమో EVM లు

0

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పటి నుండి EVM ల మీద రోజుకో వివాదం చోటుచేసుకుంటుంది. తాజాగా, జగిత్యాలలో స్ట్రాంగ్ రూమ్ లో ఉండాల్సిన EVM లను రాత్రిపూట ఆటోలో తరిలిస్తున్నట్టు ఒక వీడియోని చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): జగిత్యాల లో స్ట్రాంగ్ రూమ్ లో ఉండాల్సిన EVM లను అర్థరాత్రి ఆటోలో వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఫాక్ట్ (నిజం): వీడియో లో ఉన్నవి ఎన్నికలలో ఉపయోగించిన EVM లు కావు, అవి ఓటర్ల అవగాహన కోసం ఉపయోగించిన M2 రకం, D-కేటగిరీ EVM లు. కావున పోస్ట్ లో ఎన్నికల్లో ఉపయోగించిన EVM లని చెప్పి తప్పుదోవపట్టిస్తున్నారు.

వీడియో లో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవడానికి మొదటిగా గూగుల్ లో ‘EVMs in Jagtial’ అని వెతకగా ఈ విషయం పై News18 మరియు ETV తెలంగాణ ప్రసారం చేసిన వార్తలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఆ వార్తల ప్రకారం వైరల్ అవుతున్న వీడియో లో ఉన్నవి ఓటర్ల అవగాహనన కోసం ఉపయోగించిన M2 రకం, D-కేటగిరీ EVM లు. వాటిని 15th ఏప్రిల్ అర్థరాత్రి ఆటోలో అర్బన్ తహశీల్దార్ కార్యాలయం నుంచి మినీ స్టేడియం గోదాంకు తరలించడానికి చూడగా, గోదాంకి తాళం ఉండడం తో తిరిగి తహశీల్దార్ కార్యాలయానికి తీసుకొని వచ్చారు. ఆటో లో తీసుకువస్తున్న కారణంగా EVMలను చూసిన ప్రజలు వీడియో తీసారు.

వీడియో వైరల్ అవ్వడంతో తెలంగాణ సీఈఓ రజత్ కుమార్ ప్రెస్ కాన్ఫెరెన్స్ లో మాట్లాడుతూ వీడియో లో ఉన్నవి ‘D’ క్యాటగరి EVM లని, అవి ఎన్నికలలో ఉపయోగించలేదని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైటు ప్రకారం ఎన్నికలలో ఉపయోగించే EVM మరియు VVPAT లు నాలుగు క్యాటగరిలల్లో విభజిస్తారు. ‘A’ మరియు ‘B’ క్యాటగరిల EVM లు ఎన్నికలలో ఓట్లు వేయడానికి ఉపయోగించినవి, ‘C’ మరియు ‘D’ క్యాటగరిలలో ట్రైనింగ్ కి ఉపయోగించే EVM లు, లోపలున్న EVMలు మరియు ఎన్నికలలో ఉపయోగించని EVMలు ఉంటాయి. ‘A’ మరియు ‘B’ క్యాటగరిల EVM లు స్ట్రాంగ్ రూమ్ లో పెడుతారు కానీ ‘C’ మరియు ‘D’ క్యాటగరిల EVM లు వేరే రూమ్ లో పెడుతారు. వీడియో లో తరలించేవి ‘D’ క్యాటగరి EVM లు, అవి కూడా M2 రకం. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో వందకు పైగా అభ్యర్థులు ఉండడంతో M3 రకం EVM లు వాడినట్టు రజత్ కుమార్ తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పినట్టుగా వీడియోలో ఉన్నవి ఎన్నికలలో ఉపయోగించిన EVMలు కావు.

చివరగా, ఆటోలో EVM లను తరలించిన మాట నిజమే, కానీ అవి ఓటర్ల అవగాహనకి ఉపయోగించే డెమో EVM లు.

Share.

About Author

Comments are closed.

scroll