భారత దేశానికి ఉన్న ముగ్గురే ముగ్గురు శత్రువులు ముస్లింలు, క్రైస్తవులు మరియ సోషలిస్టులని, వారిని అంతమొందిస్తే తప్ప ఈ దేశం బాగుపడదని రాజకీయ విశ్లేషకుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ అన్నారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఈ దేశానికి ముస్లింలు, క్రైస్తవులు మరియ సోషలిస్టులు మాత్రమే శత్రువులు, వారిని అంతమొందిస్తే తప్ప ఈ దేశం బాగుపడదు – ఉండవల్లి అరుణ కుమార్
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసినది ఎడిట్ చేయబడిన వీడియో. దేశంలో ముస్లింలపై జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావిస్తూ, ముస్లింలపై దాడులు పాకిస్థాన్ విడిపోయినప్పటి నుండి అనేక రాష్ట్రాలలో చోటుచేసుకుంటూనే ఉన్నాయని, బీజేపీ భగవద్గీతగా భావించే గోల్వాల్కర్ రాసిన ‘బంచ్ అఫ్ థాట్స్’ పుస్తకంలో దేశానికి ముస్లింలు, క్రైస్తవులు మరియ సోషలిస్టులు మాత్రమే శత్రువులని భోధించారని ఉండవల్లి అరుణ కుమార్ వ్యాఖ్యలు చేశారు. గోల్వాల్కర్ పుస్తకానికి సంబంధించి ఉండవల్లి అరుణ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి ఈ వీడియోని రూపొందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం సంబంధిత కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Mango News’ యూట్యూబ్ ఛానెల్ 2022 ఆగస్టు నెలలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గానికి సంబంధించి, దేశంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు మరియు మతపరమైన దాడుల గురించి ఉండవల్లి అరుణ కుమార్ ఈ మీడియా సమావేశంలో మాట్లాడారు.
దేశంలో క్రైస్తవుల కంటే ముస్లింలపై దాడులు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయని ఒక విలేకరి ప్రశ్నించగా, ముస్లింలపై దాడులు పాకిస్థాన్ భారత దేశం నుండి విడిపోయినప్పటి నుండి అనేక రాష్ట్రాలలో చోటుచేసుకుంటూనే ఉన్నాయని, బీజేపీ భగవద్గీతగా భావించే గోల్వాల్కర్ రాసిన ‘బంచ్ అఫ్ థాట్స్’ పుస్తకంలో, భారత దేశానికి ముస్లింలు, క్రైస్తవులు మరియ సోషలిస్టులు మాత్రమే శత్రువులని, వారిని అంతమొందిస్తే తప్ప ఈ దేశం బాగుపడదని భోధించారని ఉండవల్లి అరుణ కుమార్ వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి అరుణ కుమార్ గోల్వాల్కర్ పుస్తకంలో ఉన్న వాటికి సంబంధించి చేసిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి ఈ వీడియోని రూపొందించారు.
చివరగా, ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తూ దేశానికి ముస్లింలు, క్రైస్తవులు మరియ సోషలిస్టులు మాత్రమే శత్రువులని ఉండవల్లి అరుణ కుమార్ అన్నారంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.