Fake News, Telugu
 

రాహుల్ గాంధీ మహిళా సాధికారతపై చేసిన ప్రసంగంలోని కొంత భాగాన్ని వక్రీకరిస్తూ షేర్ చేస్తున్నారు

0

‘మహాత్మా గాంధీ వెంట మహిళలు కనిపిస్తారు గాని మోహన్ భగవత్ వెంట ఎప్పుడైనా మహిళలను చూసారా’ అని రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న వీడియోని షేర్ చేస్తూ ఈ ప్రసంగంలో రాహుల్ గాంధీ ఆలోచనల ప్రకారం ‘కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో ప్రతి మగ వ్యక్తితో మహిళలు ఉండటం అవసరం మరియు సహజమని’, రాహుల్ గాంధీ దృష్టిలో మహిళలకు ఉనికి లేదని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో ‘ప్రతి మగ వ్యక్తితో మహిళలు ఉండటం అవసరం మరియు సహజమని’ చెప్తున్న రాహుల్ గాంధీ ప్రసంగం.

ఫాక్ట్ (నిజం): మహిళా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం నాడు మహిళా సాధికారతపై ప్రసంగిస్తూ మహిళలకు అవకాశాలు అందించే విషయంలో, మహిళల పట్ల ఆర్‌ఎస్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని చెప్పే క్రమంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యల తరవాత ఆర్‌ఎస్‌ఎస్ మహిళలను అణచివేస్తుంది, కానీ కాంగ్రెస్ మహిళా సాధికారతకు ఒక వేదికను ఇస్తుందని అన్న వ్యాఖ్యలను కట్ చేసారు. పైగా ఈ ప్రసంగంలో ఎక్కడ కూడా మహిళల ఉనికిని తక్కువ చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

15 సెప్టెంబర్ 2021న ఢిల్లీలో జరిగిన మహిళా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం నాడు జరిగిన మీటింగ్‌లో రాహుల్ గాంధీ ప్రసంగం నుండి ఈ వ్యాఖ్యలు సేకరించారు. ఈ వీడియోలో 17:50 టైం వద్ద రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం చూడొచ్చు.

ఐతే ఈ మీటింగ్‌లో రాహుల్ గాంధీ మహిళా సాధికారత గురించి ప్రసంగిస్తూ ఒక సందర్భంలో ‘మహాత్మా గాంధీ వెంట మహిళలు కనిపిస్తారు గాని మోహన్ భగవత్ వెంట ఎప్పుడైనా మహిళలను చూసారా? మోహన్ భగవత్ వెంట మహిళలు కనిపించరు, ఎందుకంటే వారి సంస్థ (ఆర్‌ఎస్‌ఎస్) మహిళలను అణచివేస్తుంది, కానీ మా సంస్థ మహిళా సాధికారతకు ఒక వేదికను ఇస్తుంది,’ అని అన్నారు.

ఈ ప్రసంగంలో కేవలం ‘మహాత్మా గాంధీ వెంట మహిళలు కనిపిస్తారు గాని మోహన్ భగవత్ వెంట ఎప్పుడైనా మహిళలను చూసారా?’ అన్న కొంత భాగాన్ని మాత్రమే కట్ చేసి షేర్ చేసారు. కాని ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఆ తరవాత చేసిన ‘ఆర్‌ఎస్‌ఎస్ మహిళలను అణచివేస్తుంది, కానీ మా సంస్థ మహిళా సాధికారతకు ఒక వేదికను ఇస్తుందన్న’ వ్యాఖ్యలను తీసేసారు.

అసలు ఈ వ్యాఖ్యల ద్వారా మహిళలకు అవకాశాలు అందించే విషయంలో గానీ, మహిళల పట్ల ఆర్‌ఎస్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని చెప్పే ప్రయత్నం చేశాడే తప్ప రాజకీయాలలో ప్రతి మగ వ్యక్తితో మహిళలు ఉండటం అవసరమని గాని లేక మహిళల ఉనికిని తక్కువ చేస్తూ గానీ రాహుల్ గాంధీ ప్రసంగించలేదు. దీన్నిబట్టి రాహుల్ గాంధీ ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ షేర్ చేస్తున్నట్టు అర్ధం అవుతుంది.

చివరగా, రాహుల్ గాంధీ మహిళా సాధికారతపై చేసిన ప్రసంగం లోని కొంత భాగాన్ని వక్రీకరిస్తూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll