Fake News, Telugu
 

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ముస్లిం అమ్మాయిలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు

0

అఫ్గానిస్తాన్‌లో జరిగిన పరిణామాలతో విసుగు చెంది, ఇస్లాం మీద అసహ్యంతో, గత 2 నెలల్లో సుమారు 5000 మంది ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారు” అని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు అన్నారని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: “అఫ్గానిస్తాన్‌లో జరిగిన పరిణామాలతో విసుగు చెంది, ఇస్లాం మీద అసహ్యంతో, గత 2 నెలల్లో సుమారు 5000 మంది ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారు” – ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు.

ఫాక్ట్: ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) అధ్యక్షుడు అలా అన్నట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. పోస్టులో ఉన్న ఫోటోలోని వ్యక్తి సజ్జద్ నొమాని. సజ్జద్ నొమాని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు. సుమారు 5000 మంది ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారని సజ్జద్ నొమాని అన్నారు. . కానీ, ఇలా పెళ్లి చేసుకుంటున్నారనడానికి అఫ్గానిస్తాన్‌లో జరిగిన పరిణామాలు కారణం అని ఆయన అనలేదు. సజ్జద్ నొమాని అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు చేసిన పనులను ప్రశంసించారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) అధ్యక్షుడు అలా అన్నట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి.

సుమారు 5000 మంది ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారని సజ్జద్ నొమాని అన్నారు. పోస్టులో ఉన్న ఫోటోలోని వ్యక్తి కూడా సజ్జద్ నొమాని. సజ్జద్ నొమాని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు, అధ్యక్షుడు కాదు. కానీ, ఇలా పెళ్లి చేసుకుంటున్నారనడానికి అఫ్గానిస్తాన్‌లో జరిగిన పరిణామాలు కారణం అని అనలేదు. దానికి సంబంధించి వీడియో ఇక్కడ చూడొచ్చు.

ముస్లిం మహిళలను హిందూ మతం వైపు ఆకర్షించడానికి ప్రణాళికబద్ధంగా కుట్ర జరుగుతోందని అన్నారు. మొబైల్ ఫోన్లతో పాటు కళాశాల విద్య వలన ఇలా జరుగుతుందని కారణాలు చెప్పారు. ముస్లిం బాలికలు ఇతర మతాల వారితో స్నేహం చేస్తున్నారని, వారు ఏమి చేస్తున్నారో వారి తల్లిదండ్రులకు తెలియట్లేదని ఆయన అన్నారు. తల్లిదండ్రులు తమ అమ్మాయిలకు ఇస్లాం గురించి బోధించడం లేదని మరియు వారి చుట్టూ ఏమి జరుగుతుందో చెప్పడం లేదని ఆయన అన్నారు. ఈ కారణాలు చెప్పారే తప్ప అఫ్గానిస్తాన్‌లో జరిగిన పరిణామాలతో విసుగు చెంది, ఇస్లాం మీద అసహ్యంతో చేసారని అనలేదు.

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు సజ్జద్ నొమాని అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు చేసిన పనులను ప్రశంసించారు. కానీ, ఇది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి ఆలోచన కాదని తర్వాత బోర్డు వారు చెప్పారు. షరియా చట్టాల ప్రకారం “చెల్లదు” కాబట్టి యువతలో మతాంతర వివాహాలను చేయొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆగష్టులో ఏడు అంశాల ఆదేశాలను జారీ చేసినట్టు న్యూస్ ఆర్టికల్స్ ద్వారా తెలుస్తుంది.

చివరగా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ముస్లిం అమ్మాయిలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll