Fake News, Telugu
 

CFI నాయకుడి వీడియోని బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష చనిపోకముందు హిజాబ్‌కు మద్దతుగా ఇచ్చిన ఇంటర్వ్యూ అని షేర్ చేస్తున్నారు

0

బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష చనిపోయే నాలుగు రోజుల ముందు ‘TV9’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హిజాబ్‌కు మద్దతు పలికిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. హిజాబ్‌కు మద్దతు పలికిన కారణంగానే హర్షను చంపేసి ఆ కేసును ముస్లింలపైకి నేట్టివేసినట్టు ఈ పోస్టులో ఆరోపిస్తున్నారు. కర్నాటక షిమోగాలో ఇటీవల బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష నగార హత్య జరిగిన నేపథ్యంలో, ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష, చనిపోయే నాలుగు రోజుల ముందు ‘TV9’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హిజాబ్‌కు మద్దతు పలికిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతున్న వ్యక్తి క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (CFI) కర్ణాటక రాష్ట్ర సెక్రటరీ సయ్యద్ సర్ఫరాజ్, చనిపోయిన బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష నగార కాదు. 08 ఫిబ్రవరి 2022 నాడు CFI నిర్వహించిన ఒక ప్రెస్ మీట్లో సర్ఫరాజ్, బీజేపీకి చెందిన కొన్ని హిందూ విద్యార్ధి సంఘాలు కర్ణాటక కాలేజీ క్యాంపస్ విద్యార్ధులపై హింసాత్మక దాడులు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. ఈ వీడియోకి బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష నగార హత్యకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘TV9 కన్నడ’ న్యూస్ ఛానల్ 08 ఫిబ్రవరి 2022 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. కర్ణాటక కాలేజీ విద్యార్ధులపై బీజేపీ హింసాత్మక దాడులు జరుపుతున్నాయని క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (CFI) విద్యార్ధి సంఘం నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తున్న దృశ్యాలని ఈ వీడియోలో తెలిపారు. బీజేపీకి మద్దతుతో నడుస్తున్న బజరంగ్ దళ్, ABVP మొదలగు హిందూ విద్యార్ధి సంఘాలు, కర్ణాటక కాలేజీ క్యాంపస్ విద్యార్ధులపై దాడులు నిర్వహిస్తున్నాయని CFI విద్యార్ధి నాయకులు ఈ ప్రెస్ మీట్‌లో ఆరోపించారు.

ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించిన వీడియోని CFI తమ ఫెస్‌బూక్ పేజిలో కూడా షేర్ చేసింది. ఈ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరని CFI ఫేస్‌బుక్ పేజీలో వెతికితే, ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న వ్యక్తి CFI కర్ణాటక రాష్ట్ర సెక్రటరీ సయ్యద్ సర్ఫరాజ్ అని తెలిసింది. 08 ఫిబ్రవరి 2022 నాడు నిర్వహించిన ప్రెస్ మీట్‌కు సంబంధించి పబ్లిష్ అయిన ఒక వార్తా కథనాన్ని సయ్యద్ సర్ఫరాజ్ తన ఫెస్‌బూక్ పేజిలో షేర్ చేసారు.

చనిపోయిన బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష నగార  ఫోటోని వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఫోటోతో పోల్చి చూడగా, ఈ వీడియోలో కనిపిస్తున్నది  బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష కాదు, CFI కర్ణాటక రాష్ట్ర సెక్రటరీ సయ్యద్ సర్ఫరాజ్ అని స్పష్టంగా తెలుస్తుంది.

చివరగా, CFI కర్ణాటక రాష్ట్ర సెక్రటరీ సయ్యద్ సర్ఫరాజ్ ఇచ్చిన ఒక ప్రెస్ మీట్ వీడియోని బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష చనిపోక ముందు హిజాబ్‌కు మద్దతు పలికిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll