Fake News, Telugu
 

పంజాబ్ ప్రజలు AAPకు వ్యతిరేకంగా హర్యానాలో ప్రచారం చేసారంటూ ఒక పాత వీడియోను షేర్ చేస్తున్నారు

0

ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో AAPకు ఓటు వేయొద్దంటూ ఇప్పుడు కొందరు ప్రజలు పంజాబ్ నుండి హర్యానాకు వచ్చి మరీ విజ్ఞప్తి చేస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ఈ వీడియోలో నిజంగానే కొందరు వ్యక్తులు AAPకు ఓటు వేయొద్దని కోరుతుండడం చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: AAPకు ఓటు వేయొద్దంటూ 2024 లోక్ సభ ఎన్నికల సందర్బంగా కొందరు ప్రజలు పంజాబ్ నుండి హర్యానాకు వచ్చి విజ్ఞప్తి చేస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో పాతది. నవంబర్ 2022లో హర్యానాలోని ఆదంపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక జరిగినప్పుడు పంజాబ్‌కు చెందిన కొందరు మాజీ సైనికులు AAPకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పంజాబ్ నుండి కొందరు ప్రజలు హర్యానా వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయొద్దని కోరిన మాట నిజమే అయినప్పటికీ, ఇది ఈ మధ్య కాలంలో జరిగింది కాదు. ఈ ఘటన హర్యానాలో నవంబర్ 2022లో ఆదంపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగినప్పటిది.

ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే నిరసన తెలుపుతూ కూర్చున్న వ్యక్తుల వెనకాల ఉన్న బ్యానర్ పై ‘”ఖైరంపూర్ గ్రామస్తుల నిరవధిక నిరసన ప్రదర్శన” అని హిందీలో రాసి ఉండడం చూడొచ్చు.  దీని ఆధారంగా వెతకగా ‘ఖైరంపూర్’ హర్యానాలోని హిసార్ జిల్లాలో ఉందని తెలిసింది. అలాగే వైరల్ వీడియోలోని ప్రాంతంలో ఇదే బ్యానర్‌తో నిరసన చేస్తున్న ఫోటోను ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం నవంబర్ 2022లో ప్రచురితమైంది. 

మరింత వెతకగా ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో లాంటిదే ఎక్కువ నిడివి గల మరొక వీడియో మాకు కనిపించింది. ఈ వీడియోను నవంబర్ 2022లో షేర్ చేసారు. ఐతే ఈ వీడియోలో ఒక వ్యక్తి ‘ఆదంపూర్‌లో AAPకు ఓటు వేయొద్దని’ అభ్యర్థిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. కాగా ఆదంపూర్ నియోజకవర్గానికి ఆ సమయంలో ఉప ఎన్నిక జరిగినట్టు సమాచారం ఉంది. 

యూట్యూబ్‌లో వెతకగా నవంబర్ 2022లో పంజాబ్‌కు చెందిన మాజీ సైనికులు హర్యానాలోని ఆదంపూర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్టు ఒక లోకల్ రిపోర్ట్ మాకు దొరికింది. ఈ రిపోర్ట్‌లో మాజీ సైనికుల ట్రాలీపై ఉన్న బ్యానేర్ వైరల్ వీడియోలో కూడా కనిపిస్తుంది.

ప్రస్తుతం జరుగుతున్న 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇలా పంజాబ్ ప్రజలు హర్యానాలో AAPకు వ్యతిరేకంగా ప్రచారం చేసినట్టు ఎలాంటి రిపోర్ట్స్ మాకు లభించలేదు. వీటన్నిటిబట్టి ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో కూడా పాతదని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, పంజాబ్ ప్రజలు AAPకు వ్యతిరేకంగా హర్యానాలో ప్రచారం చేసారంటూ ఒక పాత 2022 వీడియోను షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll