Fact Check, Fake News, Telugu
 

ముంబై, కోల్‌కతా, చెన్నైలలో సుప్రీం కోర్టు బెంచీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న వార్తలో నిజం లేదు

0

కేంద్ర ప్రభుత్వం దేశంలో మరికొన్ని చోట్ల సుప్రీంకోర్టు బెంచీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, ఇందులో భాగంగానే ముంబై, కోల్‌కతాతో పాటు దక్షిణాదిన చెన్నైలో సుప్రీం కోర్టు బెంచీలను ఏర్పాటు చేయబోతుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ముంబై, కోల్‌కతాతో పాటు దక్షిణాదిన చెన్నైలో సుప్రీంకోర్టు బెంచీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఫాక్ట్(నిజం): ముంబై, కలకత్తా, చెన్నైలలో సుప్రీం కోర్టు బెంచీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. ఈ విషయానికి సంబంధించి ఎటువంటి ప్రతిపాదనను కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆమోదించలేదు. ఇదే అంశంపై లోక్ సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు సమాధానం చెప్తూ ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని అన్నారు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

సుప్రీం కోర్టు బెంచీలను దేశంలోని ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనేది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆమోదించలేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటే, మీడియా ఈ విషయాన్ని ప్రసారం చేసేది, కాని ఈ విషయానికి సంబంధించి మాకు ఎటువంటి వార్తా కథనాలు దొరకలేదు.

ఇటీవల లోక్ సభలో సుప్రీం కోర్టుని ‘కాన్స్టిట్యూషనల్ కోర్టు’ మరియు ‘కోర్ట్ ఆఫ్ అప్పీల్’ అని రెండుగా విభజించి కోర్ట్ ఆఫ్ అప్పీల్లను దేశంలోని నాలుగు ప్రదేశాల్లో స్థాపించాలని ‘లా కమిషన్’ చేసిన సిఫారసుల అమలుకు సంబంధించి ఒక ఎంపీ ప్రశ్న అడగగా, దీనిపై కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వకంగా జవాభిస్తూ ఇది సుప్రీంకోర్టు పరిధిలోని అంశమని, 2016లో సుప్రీంకోర్టుని  విభజించి నేషనల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఏర్పాటు చేయాలనీ సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్‌ దాఖలైందని, ప్రస్తుతానికి ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని అన్నారు.

న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చేస్తూ కోల్‌కతా, ముంబై & చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ప్రాంతీయ బెంచ్‌లతో కూడిన నేషనల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ను ఏర్పాటు చేయాలని 2016లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన అంతరం ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేశారు. ఐతే ఈ అంశం ప్రస్తుతానికి  పెండింగ్ లోనే ఉంది. నిజానికి 2016 తర్వాత ఈ కేసుని విచారణ కోసం ఇంతవరకు లిస్టు కూడా చేయలేదు.

ఢిల్లీ వెలుపల సుప్రీంకోర్టు బెంచీలు ఏర్పాటు చేయడానికి మాకు సరైన కారణాలు కనిపించట్లేదని 2010లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి అన్నట్టు కూడా లోక్ సభలో ఇచ్చిన సమాధానంలో కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ ‘PIB ఫాక్ట్ చెక్’ వారు కూడా ఇది ఫేక్ వార్త అని, అటువంటి నిర్ణయం ఏదీ ఇంకా తీసుకోలేదని ట్వీట్ చేసారు.

చివరగా, ముంబై, కోల్‌కతా, చెన్నైలో సుప్రీంకోర్టు బెంచీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll