గాల్లో ఇంధనం నింపుకుంటున్న రఫేల్ యుద్ద విమానం, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2016లో భారత ప్రభుత్వం ఫ్రాన్స్ దేశంతో కుదుర్చుకున్న 36 రఫేల్ యుద్ద విమానాల విక్రయ ఒప్పందం ప్రకారం, ‘29 July 2020’ నాడు ఐదు రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ దేశం నుండి భారత దేశానికి చేరుకున్నాయి. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన రఫేల్ యుద్ద విమానం గాల్లోనే ఇంధనం నింపుకుంటున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): పోస్టులోని చూపిస్తున్న వీడియో 2018లో బ్రెజిల్ ఎయిర్ ఫోర్సకి చెందిన F-5 ఫైటర్ జెట్ విమానం మరో విమానానికి గాల్లోనే ఇంధనం అందిస్తున్న వీడియో. భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన రఫేల్ యుద్ద విమానాలలో కూడా గాల్లో ఇంధనం నింపుకునే సదుపాయం ఉంది. కానీ, పోస్టులో వేరే వీడియో చూపిస్తూ క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే వీడియోని షేర్ చేస్తూ బ్రెజిల్ ఎయిర్ ఫోర్సు వారు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పెట్టిన ఒక ట్వీట్ దొరికింది. ఆ ట్వీట్లో, వీడియోలోని ఫైటర్ జెట్ బ్రెజిల్ దేశానికి సంబంధిచినదిగా తెలిపారు. బ్రెజిల్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన F-5 జెట్ ఫైటర్ విమానం మరో విమానానికి గాల్లోనే ఇంధనం అందిస్తున్నప్పుడు తీసిన వీడియో అని తెలిపారు. ఇదే వీడియోని చాల మంది 2018 మరియు 2019లో సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ వీడియోలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
2016లో భారత ప్రభుత్వం ఫ్రాన్స్ దేశంతో 36 రఫేల్ ఫైటర్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ‘29 July 2020’ నాడు ఐదు రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ దేశం నుండి భారత దేశానికి చేరుకున్నాయి. భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన రఫేల్ యుద్ద విమానాలలో కూడా గాల్లోనే ఇంధనం నింపుకోగల సదుపాయం ఉంది. అయితే, పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో భారత్ కి వచ్చిన రఫేల్ యుద్ద విమానాలకి సంబంధించినది కాదు.
ఇండియన్ ఎయిర్ ఫోర్సు వారు తమ అధికార ట్విట్టర్ అకౌంట్ల పెట్టిన ఒక ట్వీట్లో రఫేల్ ఫైటర్ జెట్లు భారత దేశానికి వచ్చే మార్గంలో గాల్లోనే ఇందనం నింపుకుంటున్న ఫోటోలు మనం చూడవచ్చు.
చివరగా, బ్రెజిల్ దేశానికి చెందిన F-5 ఫైటర్ జెట్ గాల్లో ఇంధనం నింపుతున్న వీడియోని చూపిస్తూ భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన రఫేల్ విమానాలకి సంబంధించిన వీడియో అని షేర్ చేస్తున్నారు.