Fake News, Telugu
 

మహిళా రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ బాక్సర్ విజేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ధోనికి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు

0

నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లుకు మద్దతు తేలిపిన ధోని అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. “నేను మహిళా రెజ్లర్లతో ఉన్నాను, అవసరమైతే నేను నా పతకాన్ని కూడా వదులుకుంటాను” అని ధోని వ్యాఖ్యానించినట్టు ఈ పోస్టులో చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: “నేను మహిళా రెజ్లర్లతో ఉన్నాను, అవసరమైతే నేను నా పతకాన్ని కూడా వదులుకుంటాను” – ధోని

ఫాక్ట్(నిజం): నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ భారత క్రికెటర్ ధోని ఈ వ్యాఖ్యలు చేయలేదు. కాగా రెజ్లర్లకు మద్దతు భారత బాక్సర్ విజేందర్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలను ధోనికి ఆపాదించి షేర్ చేస్తున్నారు. ఇప్పటివరకు రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ ధోని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

రెజ్లింగ్‌ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ భారత రెజర్లు గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు/క్రీడాకారులు నిరసన చేస్తున్న రెజ్లర్లకు మద్దతు తెలిపారు. ఐతే వైరల్ పోస్టులో చెప్తున్నట్టు భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని నిరసన చేస్తున్న మహిళ రెజ్లర్లకు మద్దతుగా ఇప్పటివరకైతే ఎటువంటి ప్రకటన చేయలేదు.

మహిళా రెజ్లర్లు మరియు ధోని ఉన్న వైరల్ ఫోటోలో ‘బోల్తా హిందుస్తాన్’ అన్న లోగో కనిపిస్తుంది. దీని ఆధారంగా ఆ వార్తా సంస్థ వెబ్‌సైట్‌ మరియు సోషల్ మీడియా అకౌంట్లను (ఇక్కడ మరియు ఇక్కడ) పరిశీలించగా ధోని, రెజ్లర్లకు మద్దతు తెలిపినట్టు ఎటువంటి వార్తను ఆ సంస్థ ప్రచురించలేదని తెలిసింది.

ఐతే 31 మే 2023న బాక్సర్ విజేందర్ సింగ్, మహిళ రెజ్లర్లకు మద్దతు తెలిపిన వార్తను ఈ సంస్థ ట్వీట్ చేసింది. “నేను మహిళా రెజ్లర్లతో ఉన్నాను, అవసరమైతే నా పతకాన్ని కూడా వదులుకుంటా” అని విజేందర్ సింగ్ వ్యాఖ్యానించినట్టు ఈ ట్వీట్ రిపోర్ట్ చేసింది. ఐతే ఈ వార్తను రిపోర్ట్ చేసే క్రమంలో ఈ సంస్థ మహిళా రెజ్లర్లతో పాటు విజేందర్ సింగ్ ఫోటోతో ఒక ఫోటో కొలాజ్‌ను ప్రచురించింది.

కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఈ ఫోటో కొలాజ్‌లోని విజేందర్ సింగ్ ఫోటో స్థానంలో ధోని ఫోటోను డిజిటల్‌గా జోడించి, ఈ వ్యాఖ్యలు ధోని అన్నట్టు సోషల్ మీడియాలో చేసారు. కాని నిజానికి ధోని ఈ వ్యాఖ్యలు చేయలేదు.

ఒకవేళ ధోని నిజంగానే ఇలా అని ఉంటే మీడియా ఈ వార్తను రిపోర్ట్ చేసి ఉండేది, కానీ మాకు అలాంటి కథనాలేవి కనిపించలేదు. పైగా ధోని సోషల్ మీడియా అకౌంట్లలో కూడా మహిళ రెజ్లర్లకు సంబంధించి ఎలాంటి పోస్టులు కూడా లేవు (ఇక్కడ మరియు ఇక్కడ).

చివరగా, మహిళా రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ బాక్సర్ విజేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ధోనికి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll