Fake News, Telugu
 

హుజురాబాద్ ఉపఎన్నికలో ‘కేసీఆర్ చెప్పును నిలబెట్టినా లక్ష మెజారిటీతో గెలుస్తాం’, అని బాల్క సుమన్ అనలేదు

0

తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ లో అసెంబ్లీ ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో హుజురాబాద్ లో ‘కుక్కను కాదు కేసీఆర్ చెప్పును నిలబెట్టిన లక్ష మెజారిటీతో గెలుస్తాం’ అని టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ బాల్క సుమన్ వ్యాఖ్యానించినట్టు ఒక వార్తా పత్రిక ఫోటోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హుజురాబాద్ ఉపఎన్నికలో ‘కుక్కను కాదు కేసీఆర్ చెప్పును నిలబెట్టిన లక్ష మెజారిటీతో గెలుస్తాం’– టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ బాల్క సుమన్.

ఫాక్ట్ (నిజం): బాల్క సుమన్ ఈ వ్యాఖ్యలు చేయలేదు. ఆంధ్రప్రభ పత్రిక 26 జూన్ 2021 కరీంనగర్ ఎడిషన్ లో హుజురాబాద్ లో ఆ ముందు రోజు జరిగిన టీఆర్ఎస్ పార్టీ సమావేశానికి సంబంధించి ప్రచురించిన వార్త యొక్క క్లిప్ ని డిజిటల్ గా ఎడిట్ చేసి ఈ వైరల్ క్లిప్ ని తయారు చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఆంధ్రప్రభ పత్రిక 26 జూన్ 2021 కరీంనగర్ ఎడిషన్ లో హుజూరాబాద్ లో ఆ ముందు రోజు జరిగిన టీఆర్ఎస్ పార్టీ సమావేశానికి సంబంధించిన వార్త ప్రచురించింది. ఈ కథనంలో టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ బాల్క సుమన్ మాట్లాడుతున్న ఫోటో ప్రచురించింది. ఐతే ఈ క్లిప్ లో వార్తని మినహాయిస్తే మిగతాదంతా అచ్చం పోస్టులోని వార్త క్లిప్ లాగే ఉండడం గమనించొచ్చు. దీన్నిబట్టి, పోస్టులోని వార్తా కథనాన్ని ఆంధ్రప్రభ ప్రచురించిన కథనాన్ని డిజిటల్ గా ఎడిట్ చేసి తాయారు చేసినట్టు అర్ధం చేసుకోవచ్చు.

ఐతే ఆంధ్రప్రభ ప్రచురించిన ఈ కథనంలో బాల్క సుమన్ పోస్టులో పేర్కొన్న వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కాకపోతే హుజూరాబాద్ లో ఒక ‘అనామకుడిని నిలబెట్టి గెలిపించుకుంటాం’ బాల్క సుమన్ అన్నట్టు ఈ కథనంలో రాసుంది. ఒకవేళ బాల్క సుమన్ నిజంగానే పోస్టులో చెప్పిన వ్యాఖ్యలు చేసి ఉంటే ప్రధాన వార్తా పత్రికలు అన్నీ ఈ విషయాన్ని ప్రచురించేవి, కాని బాల్క సుమన్ ఇలా వ్యాఖ్యానించినట్టు ఏ వార్తా సంస్థ ప్రచురించలేదు. హుజూరాబాద్ లో జరిగిన ఈ సమావేశానికి సంబంధించి వార్తా సంస్థలు ప్రచురించిన కథనాలలో (ఇక్కడ మరియు ఇక్కడ ) ఎక్కడ కూడా బాల్క సుమన్ ఇలా అన్నట్టు రాయలేదు.

టీఆర్ఎస్ పార్టీ చెన్నూర్ ఫేస్ బుక్ పేజీలో ఈ సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడిన వీడియోని షేర్ చేసారు, ఈ వీడియోలో కూడా బాల్క సుమన్  హుజురాబాద్ ఉపఎన్నికలో ‘కుక్కను కాదు కేసీఆర్ చెప్పును నిలబెట్టిన లక్ష మెజారిటీతో గెలుస్తాం’ అన్న వ్యాఖ్యలు చేయలేదు.

ఇంతకుముందు కూడా ఇలాగే హుజురాబాద్ ఉపఎన్నికని ఉద్దేశించి హుజూరాబాద్ లో ‘కేసీఆర్ కుక్కను నిలబెట్టినా గెలుస్తాం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించినట్టు చెప్పే ఒక వార్తా పత్రిక క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది, కాకపోతే  కేటీఆర్ ఇలా వ్యాఖ్యానించినట్టు ఏ ప్రధాన వార్తా పత్రికలు ప్రచురించలేదు.

చివరగా, హుజురాబాద్ ఉపఎన్నికలో కేసీఆర్ చెప్పును నిలబెట్టిన లక్ష మెజారిటీతో గెలుస్తాం అని  బాల్క సుమన్  అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll