Fake News, Telugu
 

అసదుద్దీన్ ఒవైసీ పాత ప్రసంగంలో యూపీ పోలీసులపై చేసిన వ్యాఖ్యలను హిందువులను బెదిరించినట్లుగా షేర్ చేస్తున్నారు

0

అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగ క్లిప్‌తో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయబడుతోంది. ఈ ప్రసంగంలో ఆయన హిందువులను బెదిరించారని చెప్తున్నారు. పోస్టులో ‘యోగి ఎప్పుడూ ముఖ్యమంత్రి పధవిలో ఉంటాడా, మోదీ ఎప్పుడూ ప్రధానమంత్రి పదవిలో ఉంటాడా? ఒక్కసారి బీజేపీ ఓడిపోతే యోగి సన్యాసుల మఠానికి వెళ్ళిపోతాడు, మోదీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు, అప్పుడు హిందువులని కాపాడడానికి ఎవడొస్తాడు? అప్పుడు చూపిస్తాం మా పవర్’ అని ఓవైసీ హిందువులను ఉద్దేశించి అన్నాడని క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఈ పోస్టులో చెప్తున్న దాంట్లో ఎంత నిజముందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: తన ప్రసంగంలో హిందువులని బెదిరించిన అసదుద్దీన్ ఒవైసీ.

ఫాక్ట్ (నిజం): వీడియోలో ఉన్న అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగం 2021లో కాన్పూర్ లో నిర్వహించిన ఒక సభలోనిది. పూర్తి ప్రసంగం దాదాపు 45 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఇందులో నుండి ఒక్క నిమిషాన్ని ఎడిట్ చేసి పోస్టులో షేర్ చేసారు. తన ప్రసంగంలో కాన్పూర్  రసూలాబాద్ పోలీస్ స్టేషన్లో 80 ఏళ్ళ మొహమ్మద్ రఫీక్ పైన మూత్రం పోసి, ఆయన గెడ్డాన్ని లాగారని,  ఎస్.ఐ గజేందర్ పాల్ సింగ్ ఈ పని చేసారని అన్నారు. ఇది నిజమే కనుక ఐతే నాకు బాధ కలిగిస్తుంది, సిగ్గు కాదు అని చెప్పారు. ఆ తర్వాత, అసదుద్దీన్ ఒవైసీ యూపీ పోలీసులను ఉద్దేశిస్తూ యోగి, మోదీ చిరకాలం పదవుల్లో ఉండరు. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడుతారు అని అన్నారు. ఇందులో ఎక్కడ కుడా హిందువులను బెదిరించలేదు, పోలీసులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.

సరైన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగం గురించి వెతకగా, వైరల్ పోస్టులో ఉన్న నిమిషం నిడివి కలిగిన వీడియో యొక్క పూర్తి వెర్షన్ లభించింది (ఇక్కడ). దీనితో పాటు మరిన్ని వార్తా కథనాలు కూడా లభించాయి (ఇక్కడ, ఇక్కడ). 2021 డిసెంబర్ 12న AIMIM నిర్వహించిన ర్యాలీలో ఒవైసీ ప్రసంగించారు. దీని నిడివి దాదాపు 45 నిమిషాలు ఉంది. 40:17 సెకన్ల దగ్గర నుండి ఉన్న ప్రసంగ భాగంతో వైరల్ వీడియో మొదలవుతుంది. ఇక్కడ తాను  ఉత్తర ప్రదేశ్ పోలీసులను ఉద్దేశిస్తూ యోగి, మోదీ చిరకాలం పదవుల్లో ఉండరు… మేము మీ జులుం గుర్తుపెట్టుకుంటాను. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడుతారు అని అన్నారు.’ వైరల్ వీడియోలో ఎక్కడా ఒవైసీ హిందువులని గురించి మాట్లాడలేదు.

ప్రసంగంలో కొన్ని నిమిషాల ముందు సరిగ్గా 39:13 సెకన్ల దగ్గర అయన కాన్పూర్  రసూలాబాద్ పోలీస్ స్టేషన్లో 80 ఏళ్ళ మొహమ్మద్ రఫీక్ పైన మూత్రం పోసి, ఆయన గెడ్డాన్ని లాగారని,  ఎస్.ఐ గజేందర్ పాల్ సింగ్ ఈ పని చేసారని అన్నారు. ఇది నిజమే కనుక ఐతే నాకు బాధ కలిగిస్తుంది, సిగ్గు కాదు అని చెప్పారు. ఆ తర్వాత పోలీసులని ఉద్దేశించి మాట్లాడారు. ఈ మొత్తం భాగంలో తాను ఎక్కడ కుడా హిందువులను ఉద్దేశించి మాట్లాడలేదు. ఈ ప్రసంగం గురించి 2021లో పలు వార్త కథనాలు కూడా వచ్చాయి. వాటిని ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.

2021లో ఈ ప్రసంగం వైరల్ అయ్యింది. అప్పుడు బీజేపీ వారు ఒవైసీ పోలీసులని బెదిరించాడని విమర్శించారు. దానికి ఆయన ఒక ట్విట్టర్ త్రెడ్ ద్వారా వివరణ ఇచ్చారు. వీటి గురించి మరింత సమాచారం ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ పొందవచ్చు.

చివరిగా, AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాత ప్రసంగంలో యూపీ పోలీసులపై చేసిన వ్యాఖ్యలను హిందువులను తాను బెదిరించినట్లుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll