Fake News, Telugu
 

23 రోజులు ఉపవాసం తర్వాత మరణించిన వ్యక్తి ఫోటోని, ఎన్నో సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్న సిద్ధ యోగి అంటూ షేర్ చేస్తున్నారు

0

“వీరి పేరు సాధు శ్రీ గోపాల్ యోగి. వీరు ఒక సిద్ధ యోగి, ఎన్నో సంవత్సరాలుగా శరీర స్పృహ లేకుండా పూర్తిగా బ్రహ్మానందంలో మునిగితేలుతున్న, ఇప్పటికీ సజీవంగా ఉన్న ఒక దివ్య పురుషులు” అని ఒక ఫేస్బుక్ పోస్టు ద్వారా షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఫోటోలో ఉన్న వ్యక్తి, శ్రీ గోపాల్ యోగి, ఎన్నో సంవత్సరాలుగా శరీర స్పృహ లేకుండా ధ్యానం చేస్తున్నారు.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్న వ్యక్తి జైన ముని బ్రహ్మచారి భగవాన్ దాస్. ఇతను ‘సల్లేఖన’ అనే జైన ఆచారాన్ని పాటిస్తూ 23 రోజుల ఉపవాసం చేసి 18 మే 2021న మరణించారు. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

ముందుగా ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా ఎటువంటి ఫలితాలు రాలేదు. “సాధు శ్రీ గోపాల్ యోగి” అని వెతికినా కూడా ఎక్కడా ఈ పేరు ప్రస్తావన దొరకలేదు. చివరగా యూట్యుబ్‌లో సంబంధిత పదాలతో వెతకగా ఒక వీడియో దొరికింది. ఆ వీడియోలో, ఫోటోలో ఉన్న వ్యక్తి  పేరు ‘బ్రహ్మచారి భగవాన్ దాస్’ అని చెప్పారు. ఇతను “సల్లేఖన” అనే జైన మతానికి సంబంధించిన ఆచారాన్ని పాటిస్తూ మరణించాడు అని కూడా చెప్పారు.

పైన దొరికిన సమాచారంతో ఇంటర్నెట్ లో వెతకగా ఒక బ్లాగులో ఈ వ్యక్తి యొక్క మరిన్ని ఫోటోలు మరియు వీడియో దొరికింది. ఈ బ్లాగులో ఉన్న సమాచారం ప్రకారం, జైన ముని అయిన ‘బ్రహ్మచారి భగవాన్ దాస్’ జైన మతానికి సంబంధించిన సల్లేఖన అనే ఆచారాన్ని పాటిస్తూ 18 మే 2021న మరణించారు.

ప్రముఖ జైన గురువు ఆచార్య విద్యాసాగర్ ఇంస్టాగ్రామ్ అకౌంటులో కూడా ఈ ఫోటో 2021లో పోస్ట్ చేసారు.

వికీపీడియా ప్రకారం, “సల్లేఖన అనేది జైనమతంలో ఆహారం మరియు ద్రవపదార్థాలు తీసుకోవడం క్రమంగా తగ్గించడం ద్వారా స్వచ్ఛందంగా ఆమరణ నిరాహార దీక్ష చేసే మతపరమైన ఆచారం. కొన్ని సందర్భాల్లో, ప్రాణాంతక అనారోగ్యంతో ఉన్న జైనులు సల్లేఖన చేస్తారు.” సల్లేఖన దీక్ష పాటిస్తూ తమ ప్రాణాలు వదిలిన ఇంకొన్ని ఘటనలు ఇక్కడ, ఇక్కడ చూడవొచ్చు.

చివరిగా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి జైన ముని బ్రహ్మచారి భగవాన్ దాస్. ఇతను ‘సల్లేఖన’ అనే జైన ఆచారాన్ని పాటిస్తూ 18 మే 2022న మరణించారు.   

Share.

About Author

Comments are closed.

scroll