హుజురాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, బీజేపీ కార్యకర్తలు హుజురాబాద్ ప్రజలకు విచ్చలవిడిగా డబ్బులు మరియు మద్యం పంపిణీ చేస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. గత నాలుగు నెలలలో హుజురాబాద్ నియోజకవర్గంలో పెరిగిన మద్యం అమ్మకాల జాబితాను ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: బీజేపీ కార్యకర్తలు హుజురాబాద్ ప్రజలకు డబ్బులు మరియు మద్యం పంపిణీ చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసినది ఝార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక పాత వీడియో. 2019లో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ నిర్వహించిన ఒక బహిరంగ సభలో ప్రజలని సమీకరించడం కోసం బీజేపీ కార్యకర్తలు ఇలా అక్కడి ప్రజలకి తలా 200 రూపాయలు పంచారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Newswing’ అనే యూట్యూబ్ ఛానల్ 17 అక్టోబర్ 2019 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 2019లో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ నిర్వహించిన ఒక బహిరంగ సభలో ప్రజలని సమీకరించడం కోసం బీజేపీ కార్యకర్తలు ప్రజలకి తలా 200 రూపాయలు పంచినట్టు వీడియోలో రిపోర్ట్ చేసారు. ‘Newswing’ వెబ్సైటు ఈ విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసింది. వీడియోలోని ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో చోటుచేసుకున్నట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.
అంతేకాదు, వీడియోలో కనిపిస్తున్న ఒక బీజేపీ కార్యకర్త షర్టు పై “Abki Baar 65 Paar”(హిందీ భాషలో) అనే నినాదం రాసి ఉండటాన్ని మనం చూడవచ్చు. 2019లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ నాయకులు ఈ ‘#AbkiBaar65Paar’ అనే స్లోగన్ ఉపయోగించారు. దీన్ని బట్టి, పోస్టులో షేర్ చేసిన వీడియో 2019లో జరిగిన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
హుజురాబాద్ మద్యం విక్రయాల జాబితాకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(TSBSL) రాష్ట్ర లిక్కర్ సెల్స్ వివరాలను కేవలం జిల్లా లేదా డిపోల ఆధారంగా విడుదల చేస్తున్నట్టు తెలిసింది. కరీంనగర్ జిల్లా లిక్కర్ అమ్మకాల జాబితాలోనే హుజురాబాద్ లిక్కర్ విక్రయాలు కూడా ఉంటాయని స్పష్టమయ్యింది. హుజురాబాద్ మద్యం అమ్మకాల వివరాలను TSBSL ప్రత్యేకంగా తమ వెబ్సైటులో ఎక్కడా తెలుపలేదు. పోస్టులో షేర్ చేసిన లిక్కర్ అమ్మకాల జాబితాను ‘దిశా’ వార్తా సంస్థ తమ వార్త పత్రికలో ప్రచురించింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ‘దిశా’ న్యూస్ సంస్థ 26 ఆగష్టు 2021 నాడు ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసింది. కాని, ఈ జాబితాలో తెలిపిన సమాచారం కచ్చితమైనదో కాదో మేము నిర్ధారించలేము.
చివరగా, సంబంధం లేని పాత వీడియోని బీజేపీ కార్యకర్తలు హుజురాబాద్ ప్రజలకు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.