ఇటీవల 08 మార్చి 2025న ప్రకాశం జిల్లా మర్కాపురంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “తల్లికి వందనం ఇవ్వడానికి ఎలా అప్పు చేయాలో ఆలోచిస్తున్నాను” అని అన్నారు. ఈ నేపథ్యంలో, “అప్పులు తెచ్చి పథకాలు ఇవ్వడం గొప్పతనం కాదని సీఎం చంద్రబాబు నాయుడును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అప్పులు తెచ్చి పథకాలు ఇవ్వడం గొప్పతనం కాదు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): 21 ఫిబ్రవరి 2024న భీమవరంలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌ను ఉద్దేశించి ‘అప్పులు తెచ్చి పథకాలు ఇవ్వడం గొప్పతనం కాదు’ అని విమర్శించిన దృశ్యాలను ఈ వైరల్ వీడియో చూపిస్తుంది. అలాగే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎటువంటి రిపోర్ట్స్ కూడా లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, అప్పులు తెచ్చి పథకాలు ఇవ్వడం గొప్పతనం కాదు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, కచ్చితంగా పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి.
వైరల్ వీడియోలోని చంద్రబాబు నాయుడు దృశ్యాలు ఇటీవల 08 మార్చి 2025న ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు సంబంధించినవి. ఈ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయం సంఘాల మహిళలతో మాట్లాడుతున్న సందర్భంలో ఓ స్వయం సహాయక సంఘంలో రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తున్న ఒక మహిళ తమ జీతాలు పెంచాలి అని చంద్రబాబు నాయుడు కోరగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, “తల్లికి వందనం ఇవ్వడానికి ఎలా అప్పు చేయాలో ఆలోచిస్తున్నాను” అని అన్నారు.
ఇకపోతే వైరల్ వీడియోలోని పవన్ కళ్యాణ్ దృశ్యాలకు సంబంధించిన వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఫిబ్రవరి 2024లో పలు మీడియా సంస్థలు ఇవే దృశ్యాలు రిపోర్ట్ చేస్తూ యూట్యూబ్ లో పబ్లిష్ చేసిన పలు వీడియో కథనాలు (ఇక్కడ, ఇక్కడ), వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 21 ఫిబ్రవరి 2024న భీమవరంలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌ను ఉద్దేశించి,“అప్పులు చేసి బటన్ నొక్కడం కాదు, అభివృద్ధి చేసి బటన్ నొక్కితే సలాం కొడతానని” అన్నారు. దీన్ని బట్టి, 2024లో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వై.ఎస్.జగన్‌ను ఉద్దేశించి ‘అప్పులు తెచ్చి పథకాలు ఇవ్వడం గొప్పతనం కాదు’ అని పవన్ కళ్యాణ్ విమర్శించిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుందని మనం నిర్ధారించవచ్చు.
చివరగా, అప్పులు తెచ్చి పథకాలు ఇవ్వడం గొప్పతనం కాదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించలేదు.