తెలుగుదేశం పార్టీ (TDP) ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (BJP), జనసేన పార్టీ (JSP)తో కలిసి కూటమిలో ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఈ కూటమిలో టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 సీట్లు గెలుచుకున్నాయి. నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “మేము మీతో పొత్తు పెట్టుకోకుంటే మాకు ఇంకో 15 సీట్లు ఎక్కువ వచ్చేవి” అని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఆయన బీజేపీని విమర్శిస్తున్నాడని అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల జరిగిన 2025 అసెంబ్లీ సమావేశంలో “మేము మీతో పొత్తు పెట్టుకోకుంటే మాకు ఇంకో 15 సీట్లు ఎక్కువ వచ్చేవి” అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీని విమర్శిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో 28 మార్చి 2018నాటిది. ఆ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రత్యేక హోదా విషయంలో బీజేపీపై విమర్శలు చేశారు. అప్పటికి టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది. అలాగే , చంద్రబాబు నాయుడు 2025 మార్చిలో బీజేపీ ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎటువంటి రిపోర్ట్స్ లేవు . కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ వీడియోలో పేర్కొన్నట్లుగా చంద్రబాబు నాయుడు తాజాగా బీజేపీపై ఈ వ్యాఖ్యలు చేశారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, మార్చి 2025లో చంద్రబాబు ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు.
మా పరిశోధనలో, 2018 నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు బీజేపీపై విమర్శించిన పలు నివేదికలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ). 29 మార్చి 2018న టీడీపీ 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయుడు మాట్లాడుతూ, బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే 15 సీట్లు ఎక్కువ గెలిచేవాళ్లమని, అయితే ఆ పొత్తు రాజకీయ లాభం కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసమే అని అన్నారు. కానీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ తమను మోసం చేసిందని ఆరోపించారు. ఈ కారణంతో టీడీపీ మార్చి 2018లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి వైదొలిగింది. టీడీపీ-బీజేపీ కూటమి ఏప్రిల్ 2014లో జరిగిన అసెంబ్లీ, లోకసభ ఎన్నికల ముందు ఏర్పడింది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం, తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, దీని పొడిగించిన వెర్షన్ “Eleventh Session Of Andhra Pradesh Legislative Assembly on 28-03-2018 Live” అనే శీర్షికతో 28 మార్చి 2018న I&PR AP (Govt of Andhra Pradesh Information and Public Relations Department) యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో మాకు లభించింది. ఈ వీడియోను పరిశీలించినప్పుడు, 5 గంటల 03 నిమిషాల టైంస్టాంప్ వద్ద సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ – “నేను రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించి ఉంటే, వారితో పొత్తు పెట్టుకోకుండా ఉంటే, ఆనాడు 15 సీట్లు నాకు ఎక్కువగా వచ్చి ఉండేవి. అది తెలుసు, లెక్కలు చెబుతున్నాయి” అని అన్నారు.

ఈ సెషన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీపై విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ తన హామీని నిలబెట్టుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడంలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
మేము 28 మార్చి 2018న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 11వ సెషన్ చర్చ పూర్తి పాఠం కనుగొన్నాము. ఇందులో, సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తన నిర్ణయమని స్పష్టం చేశారు. బీజేపీపై విమర్శలు చేస్తూ, ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్నారు. రాజకీయ లాభం కోసం కాదు, ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని, రాజకీయంగా ఆలోచించి ఉంటే 15 సీట్లు ఎక్కువ వచ్చేవని తెలిపారు. కేంద్రంతో పొత్తు పెట్టుకోవడం వల్ల రాష్ట్రానికే అన్యాయం జరిగిందని, దిల్లీలో పోరాటం కొనసాగిస్తామని అన్నారు.

చివరిగా, AP సీఎం చంద్రబాబు నాయుడు 2018లో ప్రత్యేక హోదా విషయంలో బీజేపీపై చేసిన విమర్శ వీడియోను తాజాగా 2025లో చేసిన వ్యాఖ్యలుగా తప్పుగా షేర్ చేస్తున్నారు.